ప్రతిపక్షంలో మాత్రమే అవినీతి ఉందా?

ABN , First Publish Date - 2022-08-11T08:55:39+05:30 IST

మనీ లాండరింగ్‌ కార్యకలాపాల నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) విషయంలో సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు అత్యున్నత న్యాయస్థానం చరిత్రలో మా యని మచ్చగా..

ప్రతిపక్షంలో మాత్రమే అవినీతి ఉందా?

కనీసం ఒక్క బీజేపీ నేతపై ఈడీ దర్యాప్తు జరిపిందా?

సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనీ లాండరింగ్‌ కార్యకలాపాల నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) విషయంలో సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు అత్యున్నత న్యాయస్థానం చరిత్రలో మా యని మచ్చగా మిగిలిపోతుందని సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే అన్నారు. ఈ చట్టాన్ని సుప్రీం కోర్టు అన్వయించిన తీరులో అనేక తప్పులు ఉన్నాయన్నారు. నేర విచారణకు సంబంధించిన మౌలిక న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. ‘‘ప్రతిపక్ష నాయకులపై మాత్రమే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ని ప్రయోగిస్తున్న తీరు న్యాయమూర్తులకు కనిపించలేదా? కేవలం ప్రతిపక్షంలోనే అవినీతి ఉందా? దేశం మొత్తం మీద కనీసం ఒక్క బీజేపీ నేతపైగానీ, వారి మిత్రులపైగానీ ఈడీ దర్యాప్తు జరిపిందా? బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అసలు తప్పులు జరగడం లేదని మనం నమ్మాలా? బీజేపీ నేతలు, వారి కుటుంబసభ్యులు కోట్లకు పడగలెత్తడాన్ని గుర్తించలేనంతగా మనం అంధులం అయ్యామా?’’ అని దుష్యంత్‌ దవే వ్యాఖ్యానించారు.


మనీ లాండరింగ్‌ కేసుల దర్యాప్తు విషయంలో ఈడీకి విస్తృత అధికారాలను కట్టబెట్టడాన్ని సమర్థిస్తూ... జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ సభ్యులుగా ఉన్న సుప్రీం ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై దుష్యంత్‌ దవే స్పందిస్తూ.... గడచిన రెండేళ్లుగా ఈడీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తుందన్న విమర్శలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ఈడీ చేతిలో ఆయుధంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడానికి ప్రభుత్వం ఈడీని ఉపయోగించుకుంటున్న తీరును న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందన్నారు. 

Updated Date - 2022-08-11T08:55:39+05:30 IST