Abn logo
Jul 28 2020 @ 17:39PM

సీనియర్ నటుడు రావి కొండలరావు తుదిశ్వాస

హైదరాబాదు: ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, దర్శకనిర్మాత, సాహితీవేత్త, పాత్రికేయుడు రావి కొండలరావు గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. నగరంలోని బేగంపేటలో ఉన్న ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ రావి కొండలరావు మరణం సినీ, నాటక రంగాలకు తీరని లోటుగా పేర్కొన్నారు. తమ నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో 1932లో జన్మించిన రావి కొండలరావు సుకుమార్ అనే కలం పేరుతో వివిధ పత్రికల్లో ఎన్నో కథలు రాశారు. నాటికలు, నాటకాలు కూడా రచించారు. 2004లో ఆయన రచించిన బ్లాక్ అండ్ వైట్ అనే పుస్తకం తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారానికి ఎంపికైంది. భైరవద్వీపం, బృందావనం చిత్రాలకు సంభాషణలు, పెళ్ళి పుస్తకం చిత్రానికి కథ అందించారు. తమిళ, మలయాళ చిత్రాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఆయన సతీమణి దివంగత రాధాకుమారి కూడా ప్రముఖ నటి.

Advertisement
Advertisement
Advertisement