సీనియర్‌ నటుడు Shivaram కన్నుమూత

  - వెంటాడిన ప్రమాదాలు 

  - చందనసీమలో మరో విషాదం 


బెంగళూరు: చందనసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరిన సీనియర్‌ నటుడు శివరాం (83) శనివారం కన్నుమూశారు. ఆయనకు ప్రమాదాలు వెంటాడాయి. తొలుత కారు ప్రమాదంలో గాయపడి ఆ వెంటనే కోలుకున్నా ఇంట్లో జారిపడ్డారు. తలకు బలమైన దెబ్బ తగలడంతో కుటుంబ సభ్యులు బ్యాంకు కాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అదే రోజు నుంచే శివరాం పరిస్థితి రోజురోజుకు విషమిస్తూ వచ్చింది. మెదడులో రక్తం చిట్లిందని, సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. వయసు పైబడ్డంతో ఆపరేషన్‌కు వెనుకాడారు. అంతలోనే బ్రెయిన్‌డెడ్‌గా మారిన శివరాం ఏకంగా కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే కన్నడ సినిమా రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నటుడు శివరాజ్‌కుమార్‌ బనశంకరిలోని నివాసానికి వెళ్లి కడపటి నివాళులు అర్పించారు. సీఎం బసవరాజ్‌ బొమ్మై, రెవెన్యూ మంత్రి అశోక్‌ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శివరాం ఓ ఐకాన్‌ అని కన్నడ సినిమా రంగంలో ఓ అరుదైన వ్యక్తి అని కొనియాడారు. 1965లో బెరితజీవ సినిమా ద్వారా కన్నడ సినిమాల్లోకి ప్రవేశించారు. తొలుత కొన్నాళ్లు నటుడిగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కొనసాగి ఆ తర్వాత పూర్తిగా నటనవైపే వెళ్లారు. బుల్లితెర, సినిమాలలోనూ కొనసాగారు. కన్నడ సినిమారంగంలో మేటి నటులైన డాక్టర్‌ రాజ్‌కుమార్‌, విష్ణువర్ధన్‌, అంబరీశ్‌తో కలసి పలు సినిమాలలో నటించారు. పార్థివదేహాన్ని సందర్శించిన తర్వాత శివరాజ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ శివరాం అన్న మా కుటుంబానికి ఆప్తుడన్నారు. ఆసుపత్రికి వెళ్లి శుక్రవారం పరామర్శించానని కోలుకుంటానని భావించారని అంతలోనే ఇలా వీడిపోయారన్నారు. ఆయన అయ్యప్ప భక్తుడని శబరిమలై కొండపైకి సునాయాసంగా వెళ్లేవారన్నారు. నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా సుపరిచితుడన్నారు. 


అంచలంచెలుగా ఎదిగిన నటుడు

శివరాం 1938లో అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని చూడసంద్ర గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్య ముగించి టైప్‌రైటర్‌గా కొనసాగేందుకు అన్నతో కలసి బెంగళూరుకు వచ్చారు. రంగస్థల నటుడిగా గుబ్బివీరణ్ణ కంపెనీలో పలు నాటకాలను ప్రదర్శించారు. 1958లోనే సినిమారంగంలోకి ప్రవేశించినా 1965లో నటుడిగా గుర్తింపు పొందారు. 1970, 80 మధ్యకాలంలో అందరి దర్శకులతో కలసి పనిచేశారు. పుట్టణ్ణ కనగాళ్‌తో సుదీర్ఘకాలం ప్రయాణించారు. డాక్టర్‌ రాజ్‌కుమార్‌, భారతి ప్రధానపాత్రలో నటించిన హృదయసంగమ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. నిర్మాతగా నాగరహావు, నానొబ్బకల్ల, ఆప్తమిత్ర, యజమాన, గజ్జపూజ, ఉపాసన వంటివి హిట్‌ అయ్యాయి. కర్ణాటక ప్ర భుత్వంచే 2010లో రాజ్‌కుమార్‌ జీవనసాఫల్య పురస్కారాన్ని, 2013లో డాక్టర్‌ బీ సరోజాదేవి జాతీయ పురస్కారాన్ని పొందారు. మాజీ ప్రధాని దేవేగౌడ, ప్రతిపక్షనేత సిద్దరామయ్య, మాజీ సీఎంలు యడియూరప్ప, కుమారస్వామి మంత్రులు గోవిందకారజోళ, అశ్వత్థనారాయణ, తోపాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం 7.30 నుంచి 10గంటలదాకా ప్రజల సందర్శనకోసం రవీంద్ర కళాక్షేత్రలో పార్థివదేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత బనశంకరి శ్మశానవాటిక లో అంత్యక్రియ లు జరుపుతామని శివరాం కుమారుడు లక్ష్మీశ్‌ వెల్లడించారు. 


Advertisement