Oct 11 2021 @ 16:26PM

Nedumudi Venu మృతి.. నివాళులు అర్పించిన సినీ రంగం

భారతీయుడు, అపరిచితుడు వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటుడు నెడుముడి వేణు. ఆయన నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. తమిళంతో సహా అనేక భాషాలకు చెందిన 500 పైగా చిత్రాల్లో నటించారు. 3 జాతీయ అవార్డులు, 6 కేరళ స్టేట్ అవార్డులను కూడా గెలుచుకున్నారు.  కరోనాకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 73ఏళ్ల వయసులో ఆయన నేడు మరణించారు.


ఆయన మృతికి పృథ్వీరాజ్ సుకుమారన్ తో సహా అనేక మంది మాలీవుడ్ సెలెబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. పృథ్వీరాజ్  ట్విటర్‌లో..‘‘ వేణు అంకుల్ మీకు వీడ్కొలు. మీ నటన అనేది ఎల్లప్పుడు మాతోనే ఉంటుంది. రాబోయే తరాలకు దీనిని తప్పక అందిస్తాం’’ అని చెప్పారు.

ఆయన ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేశారు. జానపద గేయాలు పాడటంతో పాటు, మృదంగంలోను నైపుణ్యం ఉంది. మొదట ఆయన నాటకాల్లో నటించారు. అనంతరం నాటకాల నుంచి సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. తంబు అనే చిత్రంలో నటించడం ద్వారా మాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేశారు. ఆ సినిమాకు జి.అరవిందన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1978లో విడుదలైంది.


ఆయన తాజాగా నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారమయిన నవరసలోను కనిపించారు. ఆ వెబ్ సిరీస్‌లో భాగం అయిన ‘‘ సమ్మర్ ఆఫ్ 92’’లో నటించారు. ఆ భాగానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. చివరగా ఆయన ‘‘ మరక్కార్: అరబికాడలింటే సింహం’’లో నటించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  నెడుముడి వేణుకు ఇద్దరు కుమారులు ఉన్నారు.