మీ మనవడిని సంక్షేమ హాస్టల్‌కు పంపండి

ABN , First Publish Date - 2022-08-06T08:51:06+05:30 IST

ప్రభుత్వ హాస్టళ్లలో వసతుల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే...

మీ మనవడిని సంక్షేమ హాస్టల్‌కు పంపండి

హాస్టళ్లలో విద్యార్థుల బాధ తెలుస్తుంది.. సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్‌

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ హాస్టళ్లలో వసతుల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే... తన మనవడిని సంక్షేమ హాస్టల్‌కు పంపించాలని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. తన మనవడికి ఉన్న సౌకర్యాలు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో, గురుకుల విద్యాసంస్థల్లో కూడా ఉన్నాయంటున్న కేసీఆర్‌... ఆయన మనవడిని నాలుగు రోజులు సంక్షేమ హాస్టల్‌కు పంపాలని సవాల్‌ విసిరారు. ‘‘మీ మనవడిని సంక్షేమ హాస్టల్‌ పిల్లలతో కలిసి స్నానం చేయమని, బాత్‌రూమ్‌కి వెళ్లమని చెప్పండి. హాస్టల్‌లోనే అన్నం తిని, అక్కడే పడుకోమని చెప్పండి. వారి బాధ మీకు తెలుస్తుంది’’ అని రాజేందర్‌ అన్నారు. యూనివర్సిటీలు, గురుకులాలు, హాస్టళ్ల దుస్థితిపై విద్యార్థులు గవర్నర్‌కు మొరపెట్టుకున్నా ప్రభుత్వంలో చలనం లేదా? అని నిలదీశారు. దొడ్డిదారిన వచ్చినవారు హుజూరాబాద్‌లో చిల్లర పనులు చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై ఈటల మండిపడ్డారు. ‘‘పోయేకాలం వచ్చిన తరవాత ఎవరూ ఆపలేరు. కేసీఆర్‌ నెత్తిన శని ఉంది. ప్రగతి భవన్‌ డైరెక్షన్‌లో ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్‌ ప్రజలు నమ్మరు. తెలంగాణలో ఉన్న చైతన్యాన్ని, విద్యార్థి ఉద్యమాన్ని చంపేశారు. 6లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వ్యక్తి కేసీఆర్‌’’ అని రాజేందర్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-06T08:51:06+05:30 IST