యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా!

ABN , First Publish Date - 2022-04-04T04:05:21+05:30 IST

గ్రామాల్లోని చెరువులు, వాగులు, వంకల్లో నుంచి టన్నుల కొద్ది ఇసుకను ట్రాక్టర్ల ద్వారా రేయింబవళ్లు యథేచ్ఛగా అక్రమా రవాణా చేస్తున్నారు.

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా!
వాగుల్లో నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక

నిబంధనలకు తూట్లు

చోద్యం చూస్తున్న అధికారులు

వరికుంటపాడు, ఏప్రిల్‌ 3: గ్రామాల్లోని చెరువులు, వాగులు, వంకల్లో నుంచి టన్నుల కొద్ది ఇసుకను ట్రాక్టర్ల ద్వారా రేయింబవళ్లు యథేచ్ఛగా అక్రమా రవాణా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిపోతున్నా మామూళ్ల మత్తుల్లో మునిగిన అధికారులు తమకేమి పట్టనట్లుగా చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాగులకు సమీపంలో ఉన్న గ్రామాల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఇలాంటి అక్రమ దందా సాగుతున్నట్లు సమాచారం. కొంతమంది ట్రాక్టర్ల యజమానులు సిండికేట్‌గా ఏర్పడి ఇసుక తరలింపులకు పాల్పడుతున్నారు. ఒకవేళ తమకు తెలియకుండా ఇతర ట్రాక్టర్ల యజమానులు ఎవరైనా ముందడుగు వేస్తే ఇక ఆ ట్రాక్టర్లు పోలీస్‌ స్టేషన్‌లో ఉండాల్సిందే. ఎక్స్‌కవేటర్లను ఏర్పాటు చేసుకుని పోటీతత్వంతో ఇసుకను రహస్య ప్రాంతాలకు తరలించి డంప్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడి నుంచి  పట్టపగలే జాతీయ రహదారితో పాటు గ్రామాల్లోని ప్రధాన రహదారుల మీదుగా అక్రమంగా ఇసుక తరలిపోతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఎటువైపు చూసిన రాళ్లు, రప్పలుగా ర్శనమిస్తున్న వాగులు ఎడారిని తలపిస్తున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌ ఇసుకకు రూ.3500 నుంచి 4000 వరకు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. దూర ప్రాంతాలకు మరీంత అదనంగా ధరలు నిర్ణయించి రూ. లక్షల్లో తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. 

ఉనికిని కోల్పోతున్న వాగులు

నల్లబోతులవారిపల్లి, తూర్పుబోయమడుగుల, రామదేవులపాడు, కనియంపాడు, గణేశ్వరాపురం, విరువూరు, తూర్పుచెన్నంపల్లి, అలివేలు మంగాపురం, తిమ్మారెడ్డిపల్లి, తూర్పురొంపిదొడ్ల, దక్కనూరు, తదితర గ్రామాల సమీపంలో పిల్లాపేరు వాగు ఇప్పటికే ఉనికిని కోల్పోయింది. ఉదయగిరి మండలం జి.అయ్యవారిపల్లి, జి.చెర్లోపల్లి, అయ్యవారిపల్లి, బండగానిపల్లి, సున్నంవారిచింతల, తిరుమలాపురం, కుర్రపల్లి, అన్నంపల్లి, నేలటూరు, గడ్డంవారిపల్లి తదితర గ్రామాల ఉప్పు, పిల్లాపేరు వాగుల పరిస్థితి అంతే. 

దాడులు నిల్‌

ప్రతినిత్యం యఽథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్‌, సెబ్‌ శాఖల అధికారులెవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ కళ్ల ముందే అక్రమంగా తరలిపోతున్నప్పటికీ ఎలాంటి దాడులు నిర్వహించకుండా మౌనం వహిస్తుండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి మనకెందుకులే అంటూ ఒకరిపై మరొకరు కుంటె సాకులు చెప్పుకుంటు తప్పించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఉంచి ప్రకృతి వనరులను దోచుకొంటూ అక్రమ వ్యాపారం సాగిస్తున్న వ్యాపారులపై చట్టరీత్యా చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


Updated Date - 2022-04-04T04:05:21+05:30 IST