Sena Vs Sena : వాడీవేడీ వాదనలు విన్నాక సుప్రీంకోర్ట్ ఏం చెప్పిందంటే..

ABN , First Publish Date - 2022-07-20T19:24:08+05:30 IST

శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు అనంతర పరిణామాలపై దాఖలైన 6 పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం(నేడు) విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్ట్(Supreme Court) ఎమ్మెల్యేలకు జా

Sena Vs Sena : వాడీవేడీ వాదనలు విన్నాక సుప్రీంకోర్ట్ ఏం చెప్పిందంటే..

న్యూఢిల్లీ : శివసేన(shivasena) ఎమ్మెల్యేల తిరుగుబాటు అనంతర పరిణామాలపై దాఖలైన 6 పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం(నేడు) విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్ట్(Supreme Court) ఎమ్మెల్యేలకు జారీ చేసిన అనర్హత నోటీసులపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆదేశాలు జారీచేసింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం(Maharastra political Crisis)తో ముడిపడిన అంశాలన్నింటినీ విస్తృత ధర్మాసనం పరిశీలనకు పంపించాల్సి ఉందని, ఈ అంశాన్ని తదుపరి విచారణలో నిర్ణయిస్తామని చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదావేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని తెలిపింది.


కోర్టులో వాదనలు చేయాలనుకుంటున్న అంశాలన్నింటినీ సంధానించి వచ్చే బుధవారం కల్లా ఒక   పిటిషన్ సమర్పించాలని ఇరు వర్గాలకూ బెంచ్ సూచించింది. పిటిషన్లకు సంబంధించిన ఏవైనా ఆరోపణలను తిరస్కరించాలనుకున్నా అంతా కలిపి ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కాగా మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో అనర్హత ప్రొసీడింగ్స్, స్పీకర్ ఎన్నిక, విప్ ఉల్లంఘన, విశ్వాస పరీక్షతోపాటు పలు అంశాలున్నాయి. ఏ వర్గాన్నీ బాధపెట్టకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని ఉద్ధవ్ థాక్రే తరపు లాయర్ కపిల్ సిబల్ కోరారు.


ఇవీ ఇరుపక్షాల వాదనలు..

షిండే క్యాంప్‌లోని ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించారు కాబట్టి అనర్హులుగా ప్రకటించాలని ఉద్ధవ్ థాక్రే తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుని కోరారు. అనర్హత అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలపకూడదని ప్రస్తావించారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కూడా చెల్లుబాటు కాదన్నారు. అనర్హులు కాబోయే ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికలో ఓటు వేశారని పేర్కొన్నారు. ఇక అనర్హత వేటు వేయకుండా ఎమ్మెల్యేలను ఇలాగే వదిలేస్తే ప్రతిసారీ 7-8 మందిని తమవైపు తిప్పుకుంటారని, అలా జరగడం ఆ ఎమ్మెల్యేలను ఎంచుకున్న ప్రజల అబీష్టానికి వ్యతిరేకమని కోర్టు గుర్తించాలన్నారు. పార్టీ ఫిరాయించడానికి ప్రజులు ఎలా సహకరిస్తారని ఆయన ప్రశ్నించారు. 


షిండే క్యాంప్ తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అనర్హత ప్రొసీడింగ్స్‌ను పేర్కొన్న ఆయన.. ‘‘ కనీసం 20 మంది ఎమ్మెల్యేల మద్ధతులేని వ్యక్తిని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నామా? కోర్టులు అంతటి నిస్సహాయ స్థితిలో ఉన్నాయా?’’ అని ఆయన ప్రశ్నించారు. శివసేన ఎమ్మెల్యేలకు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని, పార్టీలో అసంతృప్తిని తెలియజేయడం ఫిరాయింపు కాదని, అనర్హత వేటు వేసేందుకు కారణం కాబోదని చెప్పారు. 


న్యాయవాది సాల్వే వాదనలు విన్న సీజేఐ ఎన్‌వీ రమణ.. ఇరు వర్గాలకూ చట్టాలు వర్తిస్తాయన్నారు. ఇలాంటి కేసుల్లో తొలుత హైకోర్టుని ఆశ్రయించాలని, ఆ తర్వాతే ఇక్కడికి రావాలని ఇదివరకే చెప్పామన్నారు. కాగా గవర్నర్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకి హాజరయ్యారు. కొత్తగా దాఖలైన పిటిషన్లకు సంబంధించిన కాపీలేవీ తమకు అందలేదని కోర్టుకి చెప్పారు. అన్నీ అంశాలపై సమాధానం ఇచ్చేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని షిండే వర్గం లాయర్ సాల్వే కోరగా.. ఈ రోజే(బుధవారం) రిప్లై ఇవ్వాలని కపిల్ సిబల్ పట్టుబట్టారు. తన స్నేహితుడు ఎందుకు ఇంతగా ఆందోళన చెందుతున్నారో అర్థం కావడంలేదని సాల్వే ప్రతిస్పందించారు.

Updated Date - 2022-07-20T19:24:08+05:30 IST