maharastra political crisis : ఏక్‌నాథ్ షిండే ఓ ద్రోహి.. శివసేన తీవ్ర ఆగ్రహం

ABN , First Publish Date - 2022-06-23T16:07:37+05:30 IST

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి(maharastra political crisis) కేంద్ర బిందువైన ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)ని ‘ద్రోహి’గా శివసేన అభివర్ణించింది. ఈడీ(ED), సీబీఐ(CBI)లకు భయపడిన ఈ ద్రోహి పారిపోయాడని మండిపడింది

maharastra political crisis : ఏక్‌నాథ్ షిండే ఓ ద్రోహి.. శివసేన తీవ్ర ఆగ్రహం

ముంబై : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి(maharastra political crisis) కేంద్ర బిందువైన ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)ని ‘ద్రోహి’గా శివసేన అభివర్ణించింది. ఈడీ(ED), సీబీఐ(CBI)లకు భయపడిన ఈ ద్రోహి పారిపోయాడని మండిపడింది. శివసేన(Shiva sena) టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీ(BJP) ఉచ్చులో చిక్కుకున్నారని వ్యాఖ్యానించింది. తిరుగుబావుటా ఎగరేసిన ఎమ్మెల్యేలకు తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా(Saamna)’లో ప్రచురితమైన ఓ కథనం పేర్కొంది.


రాజీనామాకు సిద్ధమైన ఉద్దవ్ థాక్రే..

శివసేన ఎప్పటికీ హిందుత్వను వీడదని.. బాల్‌ ఠాక్రే కుమారుణ్ని అయిన తాను అధికారం కోసం ఎన్నటికీ పాకులాడనని ఉద్ధవ్‌ ఠాక్రే(Uddav Thackeray) బుధవారం చేసిన వ్యాఖ్యలు కొత్త మలుపునకు కారణమయ్యాయి. ‘‘ఏక్‌నాథ్‌ షిండేతో ఉన్న ఎమ్మెల్యేల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. తమను బలవంతంగా తీసుకెళ్లారని వారంతా చెబుతున్నారు. శివసేన(Shivasena)ను హిందుత్వ నుంచి ఎవరూ వేరు చేయలేరు. శరద్‌పవార్‌(sharad pawar), కమల్‌నాథ్‌(kamal nath) నాకు ఫోన్‌ చేశారు. నేను సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు.’’ అని ఠాక్రే ఆ వెబ్‌క్యాస్టింగ్‌లో వివరించారు. సీఎం పదవికి తాను తగనని తన పార్టీవాళ్లే అంటే రాజీనామా చేయడానికి సిద్ధమేకానీ.. తన తర్వాత శివసైనికులే సీఎం అవుతారన్న గ్యారంటీ ఉందా? అని ప్రశ్నించారు. శివసైనికులే సీఎం అయితే తాను సంతోషిస్తానన్నారు. ప్రస్తుతం గువహటిలో ఉన్న రెబెల్‌ ఎమ్మెల్యేల్లో కొందరు వెనక్కి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారని.. చాలామందిని బలవంతపెట్టి, బెదిరించి ముంబై నుంచి తరలించారని ఠాక్రే తెలిపారు. తనకు అనుభవం లేకున్నా ప్రభుత్వం నడపడానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీకి, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌కు, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం.. ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ తన కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే, మంత్రి జితేంద్రతో కలిసి.. ఠాక్రే అధికారిక నివాసం ‘వర్ష’లో ఆయనతో భేటీ అయ్యారు. కాగా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే తన వ్యక్తిగత నివాసమైన మాతోశ్రీకి తరలిపోనున్నారని సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఠాక్రేనే ఉంటారని.. అవసరమైతే మహావికాస్‌ అఘాడీ బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఠాక్రే తన పదవికి రాజీనామా చేయట్లేదని తేల్చిచెప్పారు.

Updated Date - 2022-06-23T16:07:37+05:30 IST