ఓయూ దూరవిద్యలో సెమిస్టర్‌ విధానం

ABN , First Publish Date - 2020-09-25T09:51:25+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యలో వచ్చే ఏడాది నుంచి సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతమున్న వార్షిక పరీక్షలకు స్వస్తి పలకనున్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ కసరత్తు చేస్తోంది...

ఓయూ దూరవిద్యలో సెమిస్టర్‌ విధానం

  • వచ్చే ఏడాది నుంచి అమలుకు కసరత్తు
  • సబ్జెక్టుల విభజనపై ప్రత్యేక కమిటీ
  • యూజీసీ ఆదేశాల మేరకు చర్యలు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యలో వచ్చే ఏడాది నుంచి సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతమున్న వార్షిక పరీక్షలకు స్వస్తి పలకనున్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ కసరత్తు చేస్తోంది. రెగ్యులర్‌తోపాటు దూరవిద్యలోనూ సెమిస్టర్‌ విధానాన్ని అమలు చేయాలన్న యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఆదేశాల మేరకు  వర్సిటీ అధికారులు చర్యలు చేపట్టారు. వివిధ కోర్సుల్లో సబ్జెక్టుల వారీగా విభజన చేయడానికి ఇప్పటికే వర్సిటీలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సూచనల ఆధారంగా ఆయా సబ్జెక్టుల్లో పాఠ్యాంశాల విభజన ప్రక్రియను సైతం మొదలుపెట్టారు.


వార్షిక పరీక్షల ద్వారా సబ్జెక్టులపై విద్యార్థులకు ఉన్న అవగాహనను సరిగ్గా అంచనా వేయలేమని,  సెమిస్టర్‌ విధానంతో  వారి సామర్థ్యాలు మెరుగవుతాయని వర్సిటీ అధికారులు అంటున్నారు. కాగా, పనులు చేసుకుంటూ చదువుకునే దూరవిద్య అభ్యర్థులు ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు రాయడం కొంత వరకు సవాలుతో కూడుకున్నదని, అయినా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సెమిస్టర్‌ విధానం వచ్చే ఏడాది అమల్లోకి రానున్నదని వర్సిటీకి చెందిన ఓ డైరెక్టర్‌ తెలిపారు. కాగా, ఓయూ దూరవిద్యలో చదివిన పలువురు వివిధ స్థాయుల్లో స్థిరపడ్డారు. ఏటా పదివేల మందికి పైగా విద్యార్థులు వివిధ రకాల దూర విద్య కోర్సుల్లో చేరుతున్నారు.


Updated Date - 2020-09-25T09:51:25+05:30 IST