అమ్మలా... అండగా...

ABN , First Publish Date - 2021-03-27T05:44:41+05:30 IST

ఉదయం ఏడుగంటలు కాగానే తమిళనాడులోని తిరుచురాపల్లి (తిరుచ్చి)లో ఉన్న శ్రీ సెల్లయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎ్‌సఎంటి) నుంచి రెండు మినీ బస్సులు బయలుదేరుతాయి. తిరుచ్చి, పెరంబలూర్‌ పరిధిలోని సుమారు నలభై గ్రామాలకు వెళ్ళి, పిల్లలను

అమ్మలా... అండగా...

  • తమ బాధలను చెప్పుకోవడం తెలియని ఎందరో పిల్లలకు  ఆసరాగా నిలుస్తున్నారు తమిళనాడులోని తిరుచ్చికి చెందిన సెల్వరాణీ రాజరత్నం.
  • న్యాయవాద వృత్తిని వదిలి సామాజిక సేవా మార్గంలో అడుగుపెట్టిన ఆమె మేథోపరమైన వైకల్యాలున్న బాలల కోసం బడి నడుపుతున్నారు.
  • ఆ పిల్లలు వారి  కాళ్ళమీద వారు నిలబడేలా శిక్షణ ఇస్తున్నారు. సమాజంతో కలిసిపోయేలా వారిని తీర్చిదిద్దుతున్నారు.  


పిల్లలకు రోజువారీ పనులైన పళ్ళు తోముకోవడం, దుస్తులు వేసుకోవడం, జుట్టు దువ్వుకోవడం, పరిశుభ్రంగా ఉండడం వంటివి నేర్పిస్తారు. వివిధ రంగులు, ఆకారాలనూ గుర్తించడం, వాటి పేర్లు చెప్పడం, అలాగే సంజ్ఞలతో సులభంగా భావాలను వ్యక్తపరపడం కూడా నేర్పుతాం. 


ఉదయం ఏడుగంటలు కాగానే తమిళనాడులోని తిరుచురాపల్లి (తిరుచ్చి)లో ఉన్న శ్రీ సెల్లయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎ్‌సఎంటి) నుంచి రెండు మినీ బస్సులు బయలుదేరుతాయి. తిరుచ్చి, పెరంబలూర్‌ పరిధిలోని సుమారు నలభై గ్రామాలకు వెళ్ళి, పిల్లలను ట్రస్ట్‌ దగ్గరకు తీసుకువస్తాయి. వారికి అల్పాహారం ఇచ్చాక శిక్షణ మొదలవుతుంది.  సాయంత్రం శిక్షణ ముగియగానే ఆ బస్సులు ఆ పిల్లలను   ఇళ్ళ వద్ద దిగబెడతాయి. ఈ పనులన్నిటినీ ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు సెల్వరాణీ రాజరత్నం స్వయంగా చూసుకుంటారు.


ఆ పిల్లలందరూ మేథోపరమైన వైకల్యాలున్నవారు. ఆ పిల్లల  తల్లితండ్రులు నిరుపేదలు కావడం, పెద్దగా చదువుకున్నవారు కాకపోవడంతో వైకల్యాలున్న తమ బిడ్డల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించే పరిస్థితులు లేవు. అమ్మగా ఆ బాధ్యతను ఎస్‌ఎ్‌సఎంటి తీసుకుంది. ఆ పిల్లల కోసం ‘శ్రీ సెల్లయ్య మెమోరియల్‌ స్పెషల్‌ స్కూల్‌ ఫర్‌ ఇంటలెక్చువల్లీ డిజేబుల్డ్‌ ఛిల్డ్రన్‌’ను సెల్వరాణి ఏర్పాటు చేశారు.


సేవాతత్వం ఆమె వారసత్వం

సెల్వరాణి తండ్రి సెల్లయ్య సమాజ సేవలో ముందుండేవారు. 1983లో, తిరుచ్చిలో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు. తిరుచ్చి, పెరంబలూర్‌ చుట్టుపక్కల కరువుబారిన పడిన గ్రామాల్లోని పేదలు, గిరిజనులు, మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ఆ సంస్థ పని చేసేది. తండ్రి సేవాతత్పరతను చూస్తూ పెరిగారు సెల్వరాణి. న్యాయవాద వృత్తిని చేపట్టిన ఆమెకు కార్డియో సర్జన్‌ ఎన్‌.రాజరత్నంతో వివాహం అయింది. ఆ తరువాత భర్తతో దుబాయ్‌ వెళ్ళారు. అక్కడే చాలా కాలంపాటు ఉన్నారు. అయితే, ఊహించని విధంగా తండ్రినీ, భర్తను ఆమె కోల్పోవాల్సి వచ్చింది. సొంత ఊరైన తిరుచ్చికి చేరుకున్న సెల్వరాణి తిరిగి లాయర్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. మరోవైపు తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తూ, ఆయన ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థను పునరుద్ధరించి ‘ఎస్‌ఎ్‌సఎం ట్రస్టు’గా దాని పేరు మార్చారు. 

 

కదిలించిన సంఘటన

‘‘ఒక రోజు, స్వయంసహాయక సంఘాల మహిళలను కలవడానికి ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడ   ఒక బాలికను చూశాను. ఆమెను ఇంటి ముందు స్తంభానికి కట్టేశారు. ఆమె గురించి వాకబు చేశాను. ‘ఆ బాలిక మేథోపరమైన వైకల్యంతో బాధపడుతోంది. బడిలో ఆమెను చేర్చుకోరు. ఆమె తల్లితండ్రులు దినసరి కూలీలు. తమతో పాటు బిడ్డను తీసుకువెళ్ళలేరు. అందుకే వారు పనికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డను అలా కట్టేస్తూ ఉంటార’ని స్థానికులు చెప్పారు. ఆ పిల్ల పరిస్థితి చూసి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తనలాంటి వారికోసం ఏదైనా చెయ్యాలనిపించింది. ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలన్న ఆలోచన అప్పుడే నాకు కలిగింది’’ అంటారు సెల్వరాణి. 


దాతల విరాళాలతో

అయిదుగురు పిల్లలతో మొదలైన స్పెషల్‌ స్కూల్‌లో ఇప్పుడు 31 మంది పిల్లలున్నారు. ‘‘పద్ధెనిమిదేళ్ళ వయసువారి వరకూ చేర్చుకుంటున్నాం. ప్రత్యేక అవసరాలున్న బాలలకు బోధించడంలో నైపుణ్యం ఉన్న ఇద్దరు అధ్యాపకులు, శిక్షణ పొందిన ఇద్దరు టీచర్లు ఉన్నారు. ఒక ఫిజియోథెరపిస్ట్‌, ఆయాలు, డ్రైవర్లతో సహా మరో ఎనిమిది సిబ్బంది ఉన్నారు. వీరందరూ పిల్లల బోధన, ఆరోగ్యం, పరిశుభ్రత బాధ్యతలు చూస్తారు. ట్రస్ట్‌ సిబ్బంది ఎంపికలో వారి నేపథ్యాన్నీ, సేవ చేయడంలో వారి ఆసక్తినీ పరిగణనలోకి తీసుకుంటాం’’ అని చెప్పారామె.  ఇక్కడ శిక్షణ పొంది, బయటకు వెళ్ళిన పిల్లల్లో చాలామంది ఇప్పుడు తమ పనులు స్వయంగా చేసుకోగలుగుతున్నారు. చిన్న వృత్తులతో ఆదాయం పొందుతున్నారు. ‘‘పట్టణాల్లో ఇలాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం పాఠశాలలు ఉన్నాయి.


కానీ గ్రామాల్లో పిల్లలకు ఎలాంటి సాయం అందడం లేదు. అందుకే మా సేవల కోసం గ్రామాలను ఎంచుకున్నాను. ఇప్పటివరకూ యాభైమందికి పైగా పిల్లలు మా దగ్గర శిక్షణ పొందారు. వారి ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతున్నారు. దాతలనుంచి వచ్చే విరాళాలతో ఈ కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నాం. పాఠశాలలో పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి వీలైనంతగా పాటుపడుతున్నాం. మా సేవలను మరిన్ని గ్రామాలకు విస్తరించాలన్నదే నా కోరిక. రాబోయే కాలంలో మా పాఠశాలకు అనుబంధంగా పిల్లలు ఉండడానికి వసతి కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని చెబుతున్నారు సెల్వరాణి. 

Updated Date - 2021-03-27T05:44:41+05:30 IST