గంటకు 56 వేల మొబైల్స్‌ అమ్మకం

ABN , First Publish Date - 2022-10-07T09:16:05+05:30 IST

ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు ఇటీవల ముగిసిన 7 రోజుల పండుగల తొలి సీజన్‌ అమ్మకాల్లో 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

గంటకు 56 వేల  మొబైల్స్‌ అమ్మకం

ఫెస్టివ్‌ సీజన్‌ సేల్‌పై రెడ్‌సీర్‌ నివేదిక

న్యూఢిల్లీ : ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు ఇటీవల ముగిసిన 7 రోజుల పండుగల తొలి సీజన్‌ అమ్మకాల్లో 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రూ.40 వేల కోట్ల అమ్మకాలు సాధించాయి. రెడ్‌సీర్స్‌ స్ర్టాటజీ  కన్సల్టింగ్‌ లిమిటెడ్‌ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం మింత్రా, షాప్సీ సహా ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ ఆర్డర్ల విలువలో అగ్రస్థానంలో ఉండగా మీషో రెండో స్థానంలో ఉంది. గత నెల 22 నుంచి 30 తేదీల మధ్యలో ఇంచుమించుగా అన్ని ఆన్‌లైన్‌ సైట్లు ఫెస్టివ్‌ సేల్‌ వీక్‌ 1 నిర్వహించాయి. ఈ సీజన్‌ అమ్మకాల్లో మొబైల్‌ ఫోన్లు ప్రత్యే క ఆకర్షణగా నిలిచాయి. మొబైల్‌ ఫోన్ల విభాగం మొత్తం వాణిజ్య విలువలో (జీఎంవీ) 41 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. అంటే గంటకు 56,000 ఫోన్లు అమ్ముడుపోయాయి. ఫ్యాషన్‌ విభాగం 20 శాతం జీఎంవీ సాధించింది. గత పండుగల సీజన్‌తో పోల్చితే 48 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒక్క మొబైల్స్‌ విభాగమే 7 రెట్లు వృద్ధిని నమోదు చేయగా ఎలక్ర్టానిక్స్‌ 5 రెట్లు, ఫ్యాషన్‌ 3 రెట్లు, ఇతర విభాగాలు 2 రెట్లు వృద్ధిని నమోదు చేసినట్టు రెడ్‌ సీర్‌ అసోసియేట్‌ పార్టనర్‌ సంజయ్‌ కొఠారి తెలిపారు. ఇక కొనుగోలుదారుల సంఖ్య కూడా గత ఏడాదితో పోల్చితే 24 శాతం పెరిగింది. వారిలో 65 శాతం మంది ద్వితీయ శ్రేణి నగరాల వారే ఉన్నారు.  

Updated Date - 2022-10-07T09:16:05+05:30 IST