నిర్మాణంలోకి నీళ్లు ఇంకితే ప్రమాదం

ABN , First Publish Date - 2020-10-20T09:37:11+05:30 IST

ఇళ్ల మధ్య నీళ్లు నిలిచి ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదని, ఇళ్ల నిర్మాణంలోకి ఇంకితేనే ప్రమాదమని ఎన్‌ఐటీ వరంగల్‌ సివిల్‌ ..

నిర్మాణంలోకి నీళ్లు ఇంకితే ప్రమాదం

  • ఇంటి మధ్య నిలిచే నీటితో ప్రమాదం ఉండదు
  • పునాదులు వేసేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి
  •  జనాభాకు తగ్గట్టుగా డ్రెయినేజీ రీ డిజైన్‌ చేయాలి
  •  ‘ఆంధ్రజ్యోతి’తో ఎన్‌ఐటీ డైరెక్టర్‌ ఎన్వీ రమణరావు

హైదరాబాద్‌ సిటీ/జేఎన్‌టీయూ, అక్టోబరు19 (ఆంధ్రజ్యోతి): ఇళ్ల మధ్య నీళ్లు నిలిచి ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదని, ఇళ్ల నిర్మాణంలోకి ఇంకితేనే ప్రమాదమని ఎన్‌ఐటీ వరంగల్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్వీ రమణరావు అన్నారు. ఇళ్ల మధ్యలో చేరిన వరద నీటిలో కాలుష్యం ఉండడం కూడా ప్రమాదకరమేనని తెలిపారు. భారీ వర్షాల కారణంగా వందలాది కాలనీలు ఇప్పటికీ వరద ముంపులో ఉన్న నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ వివరాలు..


వరద నీరు ఇళ్లలో చేరితే వచ్చే ప్రమాదమేంటి?

వరద నీరు నిలిచి.. బిల్డింగ్‌ తడవడం వల్ల ఇటుకలు, రాళ్ల మధ్య ఉన్న సిమెంటు జాయింట్లు వదులవుతాయి. అపార్ట్‌మెంట్లకు గట్టినేల వచ్చేంతవరకు తవ్వి అక్కడ పునాదులు ఏర్పాటుచేస్తే ఎలాంటి ఇబ్బందులుండవు. పునాదులు సరిగ్గా లేనివి కుంగిపోయే అవకాశముంటుంది. చిన్న చిన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లకు మాత్రం నీళ్లు పిల్లర్లలోకి ఇంకిపోయి అవి వంగిపోయే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతం ఏడు రోజులుగా కాలనీల్లో నీళ్లు అలాగే ఉన్నాయి. వీటివల్ల ఇప్పుడేమీ సమస్య ఉండదు. కానీ, భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. మామూలు నీళ్లయితే ఏమీ కాదు. వరద నీరు నిర్మాణంలోకి ఇంకడం వల్ల వల్ల 50 ఏళ్ల లైఫ్‌ ఉండే బిల్డింగ్‌ 30 ఏళ్లకు పడిపోతుంది. ఇళ్లను పరిశీలించి పునరుద్ధరణ పనులు చేపట్టాలి. క్వాలిఫైడ్‌ ఇంజనీర్లతో ఇళ్లను తనిఖీ చేయించుకోవాలి. 


భవన పునాదుల్లో ఎలాంటి జాగ్రత్తలుండాలి?

వదులు మట్టి తీసేసి.. గట్టి మట్టి వచ్చిన తర్వాత పునాదులు వేసుకోవాలి. హైదరాబాద్‌లో నిర్మించే సాధారణ ఇళ్లకు కనీసం 1.5 మీటర్లు లోపలికి వెళ్లాలి. అక్కడ నుంచి పిల్లర్లు వేసుకోవాలి. అపార్ట్‌మెంట్లకు మరింత ఎక్కువగా ఉంటుంది. శ్లాబ్‌ల మీద నిర్మాణాలు ఉండకూడదు. 


సెల్లార్‌లోకి నీళ్లు రాకుండా జాగ్రత్తలు ఎలా ఉండాలి?

సెల్లార్‌ కోసం తవ్వేటప్పుడు ఎక్కువ లోతుకు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లినా.. సెల్లార్‌ లీకేజీలు ఉండకూడదు. సెల్లార్‌ ప్రాంతంలో నీళ్లు నిలవకుండా.. భవనానికి దూరంగా ప్రవాహం ఉండేలా చూసుకోవాలి. రోడ్డు కంటే 1.2 మీటర్ల ఎత్తున ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ ప్రవేశం ఉండాలి. ఇళ్లలోకి, సెల్లార్‌లోకి నీళ్లు వచ్చినవారు.. భవనం చుట్టూ స్లోప్‌ ఉండేలా గుట్టలాంటి నిర్మాణం చేపట్టాలి.  


నగరంలో వరద ముప్పు అధికంగా ఉండటానికి కారణం?

అక్రమ నిర్మాణాల వల్లే ఈ సమస్య తలెత్తుతుంది. వరద వచ్చినప్పుడు ఈ అక్రమ భవనంతో పాటు నిబంధనలకు అనుగుణంగా నిర్మించే భవనాలకూ వరద ముప్పు ఏర్పడుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే సిటీ డ్రెయినేజీ పక్కాగా ప్లాన్‌ చేసుకొని అమలు చేయాలి. హైదరాబాద్‌లో డ్రెయినేజీ వ్యవస్థను రీ డిజైన్‌ చేయాల్సిన అవసరం ఉంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి వాడకం పెరిగినందున.. ఎక్కడికక్కడ ఎస్‌టీపీలు ఏర్పాటు చేసి రీ డ్రెయినేజీ చేసుకోవాలి. నిర్మాణ అనుమతి ఇచ్చేటప్పుడు వాటర్‌బోర్డు, జీహెచ్‌ఎంసీ అధికారుల మధ్య సమన్వయం ఉండాలి. 


వరద ముంపు తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

సాధారణంగా 50 ఏళ్లకు, 40 ఏళ్లకు ఒకసారి వరదలు వస్తుంటాయి. ఆ సందర్భంలో ఏ స్థాయిలో వరదలు వచ్చాయి, ఏ స్థాయిలో డ్రెయినేజీ వ్యవస్థ ఉండాలి.. అని వచ్చిన వరదల ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. 

Updated Date - 2020-10-20T09:37:11+05:30 IST