ఆంక్షల అమ్మఒడి !

ABN , First Publish Date - 2022-06-27T06:21:02+05:30 IST

రకరకాల కారణాలు చూపుతూ జిల్లాలో ‘అమ్మఒడి’కి కోత విధించారు. వేలాది మందిని పథకానికి దూరం చేశారు. జాబితాల్లో పేర్లు గల్లంతు కావడంతో బాధితులు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కానీ సిబ్బంది సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఆంక్షల అమ్మఒడి !
ఏడు విద్యుత్‌ మీటర్లు అత్తపేరుతో ఉన్నట్లు పేర్కొన్న ధ్రువపత్రాన్ని చూపిస్తున్న రమణి


తెరపైకి అనేక నిబంధనలు
వేలాది మందికి పథకం దూరం
గత రెండుసార్లు వచ్చినా.. ఈసారి మొండిచేయి
సచివాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

 రకరకాల కారణాలు చూపుతూ జిల్లాలో ‘అమ్మఒడి’కి కోత విధించారు. వేలాది మందిని పథకానికి దూరం చేశారు. జాబితాల్లో పేర్లు గల్లంతు కావడంతో బాధితులు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కానీ సిబ్బంది సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సహేతుకమైన కారణాలను చూపలేకపోతున్నారు. కొన్నిచోట్ల వాస్తవ విరుద్ధమైన కారణాలను చెబుతున్నారు. విద్యుత్‌ను అధికంగా వినియోగించారని కొందరికి, మీటర్లు అధికంగా ఉన్నాయని మరికొందరికి, మ్యాపింగ్‌ కాలేదని ఇంకొందరికి మొండిచేయి చూపారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తులు అప్‌లోడ్‌ చేసిన క్రమంలో దొర్లిన తప్పిదాలు మరికొందరికి శాపంగా మారాయి. వెరసి జిల్లాలో వేలాది మంది పేర్లు ‘అమ్మఒడి’ జాబితా నుంచి గల్లంతయ్యాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో విద్యాశాఖలో అస్పష్టత నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 38 మండలాలు ఉండగా.. విభజనతో 30 మండలాలే మిగిలాయి. అయితే ఉమ్మడి జిల్లా లబ్ధిదారులకు.. ఇప్పటికీ పోల్చుకుంటే మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాల్లో భాగంగా ‘అమ్మఒడి’ పథకాన్ని అమలుచేస్తోంది. 2019-20 విద్యాసంవత్సరంలో తొలుత పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున నగదు జమ చేశారు. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి రెండోసారి రూ.1,000లను మినహాయించి రూ.14,000 చొప్పున జమ చేశారు. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి జనవరిలో అందించాల్సి ఉన్నా.. రకరకాల కారణాలు చూపుతూ జూన్‌ మాసాంతంలో నగదు విడుదల చేస్తున్నారు. సోమవారం జిల్లా నుంచే ‘అమ్మఒడి’ నగదు పంపిణీ ప్రక్రియను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ ఏడాది కేవలం రూ.13 వేలు మాత్రమే అందించనున్నారు.

గణాంకాలు పరిశీలిస్తే..
ఉమ్మడి జిల్లా గణాంకాలను పరిశీలిస్తే.. 2019-20లో 2,39,902 మంది, 2020-21లో 3,77,692 మందికి ‘అమ్మఒడి’ పథకం వర్తించింది. ఈ ఏడాది మాత్రం 2,00,153 మందికి మాత్రమే లబ్ధిదారులుగా తేల్చారు. అయితే జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎనిమిది మండలాలు తగ్గాయి. కానీ లబ్ధిదారుల సంఖ్య కూడా దాదాపు లక్షకుపైగా తగ్గడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై విద్యాశాఖ అధికారులు కూడా స్పష్టతనివ్వడం లేదు. లబ్ధిదారులను కుదించాలన్న ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. నెలకు రూ.12 వేలపైన వేతనం, పట్టణాల్లో 1,000 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు, ఏడాదిలో 75 శాతం హాజరు, నెలకు 300 విద్యుత్‌ యూనిట్ల వాడకం, నాలుగు చక్రాల వాహనాలు వంటి నిబంధనలతో భారీగా అమ్మఒడికి కోతలు విధించారు. టెక్నికల్‌గా తల్లుల రేషన్‌కార్డుల్లో పిల్లల పేర్లులేవన్న సాకుతో పలువుర్ని నిలిపేసినట్లు సమాచారం. అర్హత సాధించిన చాలామందికి బ్యాంకు అకౌంట్లు విషయంలో దెబ్బతిన్నారు. జాబితాల్లో చాలామంది పేర్లు పక్కన ఇన్‌యాక్టివ్‌ అకౌంట్‌ అని చూపించింది. అవన్నీ పూర్తిచేసుకుని... సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించుకున్నా వారికీ పథకం వర్తించలేదు.


Updated Date - 2022-06-27T06:21:02+05:30 IST