టీచర్లకు ‘సెల్ఫీ’ కష్టాలు

ABN , First Publish Date - 2022-08-17T06:25:57+05:30 IST

ప్రభుత్వ ఉపాధ్యాయులకు కొత్తగా ‘సెల్ఫీ’ కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం మంగళవారం నుంచి అమలులోకి తెచ్చిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) యాప్‌ చాలాచోట్ల ఇంటర్నెట్‌ సరిగా లేకపోవడంతో ఓపెన్‌ కాలేదు.

టీచర్లకు ‘సెల్ఫీ’ కష్టాలు
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన టీచర్స్‌ అటెండెన్స్‌ యాప్‌

ఇంటర్నెట్‌ సమస్యతో పలుచోట్ల తెరుచుకోని యాప్‌

సకాలంలో ఫొటోలు అప్‌లోడ్‌ కానివైనం

జిల్లాలో 6,664 మంది ఉపాధ్యాయులు 

తొలిరోజు 4,004 మంది రిజిస్ర్టేషన్‌

వీరిలో 931 మంది హాజరు మాత్రమే నమోదు

ప్రభుత్వ తీరుపై టీచర్లు ఆగ్రహం

‘సెల్ఫీ’ హాజరు విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌


(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ఉపాధ్యాయులకు కొత్తగా ‘సెల్ఫీ’ కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం మంగళవారం నుంచి అమలులోకి తెచ్చిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) యాప్‌ చాలాచోట్ల ఇంటర్నెట్‌ సరిగా లేకపోవడంతో ఓపెన్‌ కాలేదు. ఫేషియల్‌ స్కానింగ్‌ (సెల్ఫీ) ద్వారా హాజరు వేయించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఉపాధ్యాయుల్లో తొలిరోజు దాదాపు సగం మంది ఫేషియల్‌ స్కానింగ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పటికీ... రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ మాత్రం పది శాతానికి మించలేదు. అనకాపల్లి జిల్లాలో 1,448 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 6,664 మంది ఉపాధ్యాయులు  పనిచేస్తున్నారు.  మంగళవారం వీరిలో 4,004 మంది (60.08 శాతం) రిజిస్ర్టేషన్‌ పూర్తిచేసుకున్నారు. వీరిలో 931 మంది (13.97 శాతం) హాజరు మాత్రమే నమోదైంది. 

గతంలో టీచర్లు, బోధనేతర సిబ్బందికి అమలుచేసిన బయోమెట్రిక్‌, ఐరిస్‌ హాజరు విధానం స్థానంలో ప్రభుత్వం ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ‘సిమ్స్‌-ఏపీ’ అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తమ ఫోన్లలో దీనిని డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అవ్వాలి. రోజూ ఉదయం 9 గంటలలోపు పాఠశాలకు వచ్చి, యాప్‌లో లాగిన్‌ అయి మూడు యాంగిల్స్‌లో ఫొటోలు తీసుకోవాలి. వీటిని యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే హాజరు నమోదు అవుతుంది. 9 గంటలకు ఒక్క నిమిషం దాటినా హాజరును యాప్‌ అంగీకరించదు. ఆ రోజు సాధారణ సెలవు కాకుండా ఈఎల్‌, సిక్‌ లీవ్‌లను వినియోగిం చాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. పాఠశాల ఆవరణలో తప్ప మరెక్కడా ఈ యాప్‌లోకి ఫొటోలను అప్‌లోడ్‌ చేయడం కుదరదు. మంగళవారం నుంచి ప్రభుత్వం కొత్త హాజరు నమోదు విధానాన్ని అమల్లోకి తేవడంతో జిల్లాలో పలుచోట్ల ఉపాధ్యా యులు హైరానా పడ్డారు. చాలామంది టీచర్లు  తొమ్మిది గంటలకన్నా ముందే పాఠశాలలకు వెళ్లినా.. నెట్‌వర్క్‌ సరిగ్గా లేకపోవడంతో యాప్‌ ఓపెన్‌ కాలేదు. దీంతో ఫొటోలు అప్‌లోడ్‌ చేయలేకపోవడంతో ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) నమోదు చేయలేకపోయారు.

మునగపాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 18 మంది ఉపాధ్యాయులు వున్నారు. హెచ్‌ఎం వీరందరి వివరాలను యాప్‌లో నమోదు చేశారు. మంగళవారం ఉదయం లాగిన్‌ అవ్వడానికి ప్రయత్నించగా ఓపెన్‌ కాలేదని ప్రధానోపాధ్యాయుడు కేవీ సూర్యనారాయణ తెలిపారు. 18 మందిలో ఒక్క ఉపాధ్యాయుడి వివరాలు మాత్రమే నమోదయ్యాయని ఆయన చెప్పారు. గణపర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 13 మంది టీచర్లు వుండగా, ఒక్కరి హాజరు కూడా నమోదు కాలేదు.

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. నెట్‌వర్క్‌ సరిగ్గా లేని, ఒక ఉపాధ్యాయుడు మాత్రమే వున్న పాఠశాల్లో ఈ యాప్‌ ద్వారా  అటెండెన్స్‌ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. యాప్‌ కనెక్ట్‌ కాక హాజరు నమోదు కాకపోతే ఆ రోజు సెలవు కింద భావించి టీచర్‌ ఇంటికి వెళ్లిపోతే విద్యార్థులకు బోధన ఎలా సాగుతుందని యూటీఎఫ్‌ నేతలు అంటున్నారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌’ హాజరు విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోపోతే ఆందోళన తప్పదంటున్నారు.


Updated Date - 2022-08-17T06:25:57+05:30 IST