51 ఆస్పత్రుల్లో సెల్ఫ్‌ ఆక్సిజన్‌ జనరేట్‌ ప్లాంట్లు

ABN , First Publish Date - 2021-05-06T08:04:12+05:30 IST

కొవిడ్‌ విలయతాండవం నేపథ్యంలో ఆక్సిజన్‌ అవసరాలు భారీగా పెరిగాయి. దీంతో అన్ని రాష్ట్రాలకు సెల్ఫ్‌ ఆక్సిజన్‌ జనరేట్‌ యంత్రాలను కేంద్రం పంపనుంది.

51 ఆస్పత్రుల్లో సెల్ఫ్‌ ఆక్సిజన్‌ జనరేట్‌ ప్లాంట్లు

  • 500-1000 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం
  • ఈ నెలాఖరుకు రాష్ట్రానికి పంపనున్న కేంద్రం
  • మెడికల్‌ కాలేజీలు, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు


హైదరాబాద్‌, మే 5(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ విలయతాండవం నేపథ్యంలో ఆక్సిజన్‌ అవసరాలు భారీగా పెరిగాయి. దీంతో అన్ని రాష్ట్రాలకు సెల్ఫ్‌ ఆక్సిజన్‌ జనరేట్‌ యంత్రాలను కేంద్రం పంపనుంది. తెలంగాణకు మరో 51 యంత్రాలను పంపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. వీటిని పలు మెడికల్‌ కాలేజీలు, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్రాలతో గాలి ద్వారా ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుంది. కేంద్రం పంపే యంత్రాల్లో కొన్ని 500 లీటర్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే.. మరికొన్ని 1000 లీటర్లు ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలో 5 చోట్ల (గాంధీ ఆస్పత్రి, ఖమ్మం, భద్రాద్రి ఏరియా ఆస్పత్రుల్లో) సెల్ఫ్‌ ఆక్సిజన్‌ జనరేట్‌ యంత్రాల ద్వారా ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతోంది. గచ్చిబౌలిలోని టిమ్స్‌లో ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా ఉత్పత్తి మొదలు కాలేదు. 35 సర్కారీ దవాఖానాల్లో ఇప్పటికే లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను ఏర్పాటు చేశారు.


ఎక్కడెక్కడంటే..

ఈ నెలాఖరుకు వచ్చే ఆక్సిజన్‌ జనరేట్‌ యంత్రాలను హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ ఆస్పతి, ఛాతీ ఆస్పత్రి, ఫీవర్‌ హస్పిటల్‌, గొల్కొండ ఆస్పత్రి, కింగ్‌ కోఠి ఆస్పత్రి, మలక్‌పేట్‌, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు ఆక్సిజన్‌ కొరత ఎక్కువగా ఉండే మారుమూల ప్రాంతాల్లోని ఆదిలాబాద్‌ రిమ్స్‌, నల్లగొండ, సూర్యాపేట మెడికల్‌ కాలేజీలు, వరంగల్‌ ఎంజీఎం, సిద్దిపేట, తాండూరు, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లా ఆస్పత్రులు, మాతాశిశు సంరక్షణ కేంద్రం, పఠాన్‌చెరు, జహీరాబాద్‌, నారాయణ్‌ఖేడ్‌, జోగిపేట, గజ్వేల్‌, మెదక్‌, గద్వాల, మహబూబాబాద్‌, నారాయణపేట్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జనగాం, జగిత్యాల, నిర్మల్‌, జీఎంహెచ్‌ హన్మకొండ, సీకేఎం వరంగల్‌, వికారాబాద్‌, మంచిర్యాల, బోధన్‌, టీబీ ఆస్పత్రి వరంగల్‌, భువనగిరి, కామారెడ్డి, బాన్స్‌వాడ, హుజూరాబాద్‌, హుజూర్‌నగర్‌, గోదావరి ఖని, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం ఎంసీహెచ్‌, భైంసా ఆస్పత్రుల్లో యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-05-06T08:04:12+05:30 IST