ఆత్మజ్ఞానం.. కర్మానుభవం

ABN , First Publish Date - 2020-08-21T08:37:02+05:30 IST

కర్మలు మూడు రకాలు. అవి.. సంచితం, ఆగామి, ప్రారబ్ద కర్మలు.

ఆత్మజ్ఞానం.. కర్మానుభవం

కర్మలు మూడు రకాలు. అవి.. సంచితం, ఆగామి, ప్రారబ్ద కర్మలు. అనేక జన్మల్లో చేసి మూటగట్టుకున్న కర్మల ఫలితం సంచితకర్మ. కర్తృత్వ బుద్ధితో ప్రస్తుత దేహంతో మరణ పర్యంతం చేసేది ఆగామికర్మ. అనేక జన్మల నుండి అహంతో లీనమై ప్రస్తుత దేహానికి ప్రారంభమై ఉండేది ప్రారబ్దకర్మ. అంటే ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా  ఉండేది ప్రారబ్దం.


ఈ మూడు కర్మలూ తత్వజ్ఞానం లేనివారిని ఆవరించి, జ్ఞానం కలిగేవరకు బాధిస్తాయి. ఈ కర్మల నుండి, జన్మచక్రం నుంచి విడివడడమే విముక్తి. తత్వజ్ఞానంచే సంచితం నశిస్తుంది. జ్ఞానిని అగామికర్మ అంటుకొనదు. ఎందుకంటే జ్ఞాని తన జీవితాన్ని తామరాకుపైనున్న నీటిబిందువు వలె నిమిత్తమాత్రంగా గడుపుతాడు. ప్రారబ్దకర్మ అనుభవాన్ని గురించి మాత్రం నిశితంగా పరిశీలించవలసి ఉంది.

జ్ఞానోదయాత్పురారబ్దం కర్మజ్ఞానాన్ననశ్యతి

అదత్వా స్వఫలం లక్ష్యముద్దిశ్యోత్సృష ్టబాణవత్‌

అని ఆదిశంకరుల ‘వివేకచూడామణి’ వివరిస్తుంది. ఆత్మజ్ఞానం కలగక ముందు ప్రారంభింపబడిన ప్రారబ్దకర్మ శస్త్రం నుండి విడువబడిన అస్త్రం తన లక్ష్యాన్ని సాధించి తీరునట్లు.. సుఖదుఃఖ రూప ఫలాన్ని అనుభవించక తీరదని తెలుస్తోంది. అమ్ములపొదిలో నున్న బాణంవంటిది సంచితకర్మ. ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న బాణంవంటిది అగామికర్మ. ప్రయోగించబడిన బాణంతో సమానం ప్రారబ్ద కర్మ. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్యురుతే తథా ..అని పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ‘జ్ఞానమనే అగ్ని కర్మలన్నింటినీ భస్మం చేస్తుందని’ దాని అర్థం.


జ్ఞాని దృష్టిలో ఆత్మయందు సర్వకర్మల సంబంధం నిషేధింపబడింది. జ్ఞానులు దేని గురించీ విచారించరు. దేనినీ కోరుకోరు.  సమస్తకార్యాలూ చేసినా చేయనివారే అవుతారు. ఇంద్రియాలు ఆయా కార్యాలయందు వర్తించినా వారు ఏమీ చేయనట్టే. ఇంద్రియాలు దేహానికే సంబంధించినవిగానీ.. ఆత్మకు కాదు. అందువల్ల ఆత్మజ్ఞాని, దేహాన్ని దేహేంద్రియాలను తనవిగా విశ్వసింపడు. అగ్నిదేవుడు సర్వపదార్థాలూ భక్షించినా వాటి గుణాలు అంటుకోని విధంగా జ్ఞానికి కర్తృత్వ బుద్ధి లేకపోవడం చేత ఆయాకర్మలచే బాధితుడుకాడు.

స్వప్నదేహో యథాధ్యస్తస్తథైవాయం హి దేహకః

అధ్యస్తస్య కుతోజన్మ జన్మాభావేహి కుతః స్థితిః

స్వప్నదేహంవలే జాగ్రదావస్తయందలి దేహంకూడా కల్పితమే. లేని దేహానికి జన్మ లేదు. జన్మ లేనందున దానికి ప్రారబ్దం సిద్ధించదు. దేహాత్మభావమే ప్రారబ్దకారణం. సత్యమైన సర్వవ్యాపకమైన ఆత్మ ఏ కాలమందూ పుట్టదు,  గిట్టదు. అది సనాతనమైనది. అది జగతికి అదిష్ఠానం.


అందుకే జనుడు తత్వాన్వేషణతో జ్ఞానామృతాన్ని సంపూర్ణంగా సాధించి, ఆత్మసాక్షాత్కారాన్ని పొంది, తన స్వస్వరూపమైన ఆత్మలో లీనం కావాలి. అటువంటి బృహత్తరమైన కార్యంసాధిస్తే అతనికి మరో జన్మ లేదు. జన్మ లేనందువల్ల మరణం కూడా లేదు. ఇదే కైవల్యం. మోక్షం.


సామాన్య ప్రజానీకానికి ప్రపంచం ఉంది, దేహం కూడా ఉంది, ఆ దేహంతో అనేక కర్మలు చేస్తున్నాం అనే భ్రాంతి ఉంది. అట్టివారు అజ్ఞానాన్ని (అవిద్యను) అధిగమించి జ్ఞాన విత్తాన్ని సాధించినప్పుడు అంతా కల్పితమనే సత్యాన్ని గ్రహిస్తారు. మరోజన్మలేని మహోన్నతులౌతారు.

- విద్వాన్‌ వల్లూరు చిన్నయ్య, 9948348918 


Updated Date - 2020-08-21T08:37:02+05:30 IST