సెల్ఫీతో హాజరు!

ABN , First Publish Date - 2022-08-14T06:44:47+05:30 IST

‘ప్రతి టీచరు కచ్చితంగా ఉదయం తొమ్మిదిగంటలకల్లా స్కూలు ఆవరణలో సెల్ఫీ తీసుకుని విద్యా శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

సెల్ఫీతో హాజరు!

ఉపాధ్యాయుల మెడపై ప్రభుత్వం కత్తి

ఉదయం 9 గంటలకల్లా పాఠశాల ఆవరణలో ఫొటో తీసుకుని విద్యా శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి

ఒక్క నిమిషం ఆలస్యమైనా అరపూట జీతం కట్‌

ఈ నెల 16వ తేదీ నుంచి అమలు

భగ్గుమంటున్న ఉపాధ్యాయులు

ఇప్పటికే ఉన్న యాప్‌లతోనే తిప్పలు


విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):

‘ప్రతి టీచరు కచ్చితంగా ఉదయం తొమ్మిదిగంటలకల్లా స్కూలు ఆవరణలో సెల్ఫీ తీసుకుని విద్యా శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. నెట్‌వర్క్‌తో సంబంధం లేదు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అరపూట జీతం కట్‌ అవుతుంది...’’

...ఇదీ ఉపాధ్యాయులకు వచ్చిన ఆదేశం. ఉదయం తొమ్మిది గంటలకల్లా ప్రతి టీచర్‌ షేషియల్‌ స్కానింగ్‌ యాప్‌ ద్వారా సెల్ఫీ తీసుకుని ఆన్‌లైన్‌లో పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్‌ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. లేనిపక్షంలో అరపూట బేసిక్‌, డీఏ కట్‌ (అరపూట జీతం) అవుతాయని హెచ్చరించింది. ఈ నిబంధన ఈనెల 16వ తేదీ నుంచి అమలులోకి రానున్నది. 

పాఠశాలకు సకాలంలో రావాలనే ఉద్దేశంతో కొత్త టెక్నాలజీని తీసుకువచ్చినట్టు విద్యా శాఖ చెబుతున్నా ఉపాధ్యాయులు మాత్రం అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.  ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం కావడానికి తాము కారణమన్న అక్కసుతోనే ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తున్నారు. తాజాగా విధించిన నిబంధన మేరకు...పాఠశాల ఆవరణలో (ఇప్పటికే ప్రతి పాఠశాలను జియోట్యాగ్‌ చేశారు) మొబైల్‌ ఫోన్‌లో నెట్‌వర్క్‌ ఆన్‌ చేయగానే లొకేషన్‌ వస్తుంది. వెంటనే ప్రతి టీచర్‌ షేఫియల్‌ యాప్‌ ద్వారా సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్‌ చేయాలి. ఈ ప్రక్రియ ఉదయం తొమ్మిది గంటలకల్లా పూర్తిచేయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఫొటోను ఫేషియల్‌ స్కానింగ్‌ స్వీకరించదు. దీంతో అరపూట జీతం కట్‌ అవుతుంది. నెట్‌వర్క్‌ బిజీగా ఉన్నా..లేకపోయినా సంబంధం లేదని స్పష్టం చేసింది. 

పిల్లలకు పాఠాలు బోధించాల్సిన టీచర్లు ఇప్పటికే పలు రకాల యాప్‌లతో సతమతమవుతున్నారు. ప్రతిరోజు ఉదయం పిల్లల హాజరు తీసుకుని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇంకా మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం సమయంలో ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి. మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యం, గుడ్లు, చెక్కీలు వచ్చినప్పుడు వాటి వివరాలు నమోదుచేసి అప్‌లోడ్‌ చేసుకోవాలి. నాడు-నేడు పనుల వివరాలు, బిల్లులు, సిమెంట్‌, ఇతర స్టాకు వివరాలు ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తుండాలి. యాప్‌లలో అప్‌లోడ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో బోధన కంటే వీటికే టీచర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదయం ఫస్ట్‌ పీరియడ్‌ ప్రారంభం కాగానే పిల్లల హాజరు తీసుకుని అప్‌లోడ్‌ చేసే సమయంలో నెట్‌వర్క్‌ వుంటే పది నిమిషాల్లో ముగుస్తోంది. లేకపోతే యాప్‌లో అప్‌లోడింగ్‌ చక్రం తిరుగుతూనే...ఉంటుంది. ఒక్కొక్కసారి గంటా, రెండు గంటలైనా యాప్‌లో వివరాలు అప్‌లోడ్‌ కావు. దీంతో బోధన కుంటుపడుతోంది. ఈ నేపథ్యంలో ఉన్న యాప్‌లనే తొలగించి తమను బోధనకే పరిమితం చేయాలని టీచర్లు కోరుతుండగా వాటితోపాటు సెల్ఫీతో కూడిన ఫేషియల్‌ స్కానింగ్‌ యాప్‌ను జత చేసింది. గతంలో ఉదయం తొమ్మిది గంటలకు టీచర్‌ రాకపోతే..కొన్ని చర్యలు ఉండేవి. మూడుసార్లు ఆలస్యంగా వస్తే ఒకరోజు సెలవుగా పరిగణించేవారు. ఈ నిబంధనను కఠినతరం చేస్తూ..ఉదయం 9.15 గంటలలోగా (పాఠశాలలో ప్రార్థన ముగిసేలోగా) టీచరు హాజరుకాకపోతే పూట సెలవుగా పరిగణిస్తున్నారు. దీనిని మరింత కఠినం చేస్తూ ఉదయం తొమ్మిది గంటలకు ఒక నిమిషం దాటినా పూట జీతం కట్‌ చేయనున్నట్టు తాజాగా ఆదేశాలు ఇచ్చారు. కాగా ఉమ్మడి జిల్లాలో మారుమూల గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీలో నెట్‌వర్క్‌ ఉండదు. అటువంటిచోట్ల సెల్ఫీతో ఫొటో తీసి షేషియల్‌ స్కానింగ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం సాధ్యంకాదని టీచర్లు చెబుతున్నారు. ఇంకా నెట్‌వర్క్‌ జామ్‌ అయి యాప్‌లో వివరాలు ఆలస్యంగా అప్‌లోడ్‌ జరిగితే తమకు ఏమి సంబంధమని ప్రశ్నిస్తున్నారు. 


సెల్ఫీ అప్‌లోడ్‌ ఆలోచన విరమించుకోవాలి

జి.చిన్నబ్బాయ్‌, అనకాపల్లి జిల్లా యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి

ప్రస్తుతం వున్న యాప్‌లతోనే ఉపాధ్యాయులు కుస్తీ పడుతున్నారు. కొత్తగా పాఠశాల ఆవరణలో సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్‌ చేయాలనడం దారుణం. సమయపాలన పాటించడానికి టీచర్లు వ్యతిరేకం కాదు. రాష్ట్రవ్యాప్తంగా 1.85 లక్షల మంది టీచర్లు ఒకేసారి సెల్ఫీ అప్‌లోడ్‌ చేస్తే సర్వర్‌ జామ్‌ అవుతుంది. అయినా టీచర్‌ జీతం కట్‌ చేస్తామనడం ఏంటీ?. అలాగే మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీలో నెట్‌వర్క్‌ ఉండదు. అటువంటప్పుడు ఏం చేయాలి?...తక్షణమే ఫేషియల్‌ స్కానింగ్‌ యాప్‌ అమలును విరమించుకోవాలి.

Updated Date - 2022-08-14T06:44:47+05:30 IST