రాజధానులపై సెల్ఫ్‌గోల్‌!

ABN , First Publish Date - 2022-08-07T09:31:26+05:30 IST

రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారమే నడుచుకోవాలన్న తత్వం అధికార వైసీపీకి ఎట్టకేలకు బోధపడింది.

రాజధానులపై సెల్ఫ్‌గోల్‌!

  • రాజ్యాంగ విరుద్ధమని ఒప్పేసుకున్న వైసీపీ
  • పార్లమెంటులో ప్రైవేటు బిల్లుతో తేటతెల్లం
  • రాజధానులపై అసెంబ్లీకి అధికారం కోరిన బిల్లు
  • విభజనచట్టం ఉండగా అది సాధ్యం కాదని తెలిసే..
  • బిల్లు పెట్టామని చెప్పుకొనేందుకు హడావుడి
  • అయితే అది బూమరాంగ్‌ అయ్యే చాన్స్‌
  • పార్లమెంట్‌ తిరస్కరిస్తే ‘రాజధానులు’ కంచికే..
  • ఏబీఎన్‌పై మళ్లీ అక్కసు..ప్రత్యేకంగా బిల్లు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారమే నడుచుకోవాలన్న తత్వం అధికార వైసీపీకి ఎట్టకేలకు బోధపడింది. తాము అనుకున్నదే చట్టమని, సొంత నిర్ణయాలను అసెంబ్లీ వేదికగా శాసనాలుగా చేద్దామంటే కుదరదని.. రాజ్యాంగమే ప్రామాణికమన్న నిజాన్ని ఇన్నాళ్లకైనా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులను ఏర్పాటుచేస్తూ అసెంబ్లీలో బిల్లుపెట్టి ఆమోదించు కోవడం రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియ అన్న నిర్ధారణకు వచ్చింది. రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను అమలు చేయలేమని, వాటిని కోర్టులు అడ్డుకుంటాయన్న నగ్నసత్యం అనుభవంలో తెలుసుకుంది. ఫలితంగా మూడు రాజధానులకోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని వైసీపీ రాజకీయ కార్యాచరణ మొదలుపెట్టింది. పార్లమెంట్‌ కేంద్రంగానే దాన్ని ప్రారంభించింది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో దీనిపైనే ఓ ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3ని సవరించి రాష్ట్రం పరిధిలో ఒకటి అంతకన్నా ఎక్కువ రాజధానులు ఏర్పాటు చేసుకునేలా రాష్ట్ర శాసనసభకు అధికారం కల్పిస్తూ ఆర్టికల్‌ 3(ఏ)ని చేర్చాలని ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పార్లమెంట్‌ సాక్షిగా మూడు రాజధానులపై వైసీపీ తన తప్పును ఒప్పుకొన్నట్లయింది.


 విజయసాయి బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో ఓ సభ్యుడు వెరీగుడ్‌ అనగా, మరో సభ్యుడు వికట్టహాసం చేస్తూ హా.. హా అంటూ గట్టిగా నవ్వారు. నిజానికి, ఇది కూడా సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. ఏపీకి ఒకటి కంటే ఎక్కువ రాజధానులను ఏర్పాటు చేసుకునేలా చట్టం చేసుకునే అధికారం శాసనసభకు కల్పించాలని విజయసాయి కోరారు. అయితే, ఏపీ పునర్విభజన చట్టం-2014 అమల్లో ఉండగా అది సాధ్యంకాదని, ముందు కేంద్ర మే ఆ బిల్లును ఒప్పుకోదని నిపుణులు చెబుతున్నారు. ఏపీకి ఒక రాజధాని, తెలంగాణకు ఒక రాజధాని ఉండేలా పునర్విభజన చట్టం దిశానిర్దేశం చేసింది. ఇందుకు ది కేపిటల్‌ అనే పదం ప్రత్యక్ష సాక్ష్యం. హైకోర్టు కూడా ఇదే అంశం ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఏపీ పునర్విభజన చట్టంలో సవరణలు చేసేలా కేంద్రమే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని వైసీపీ ఒత్తిడి తీసుకురావాలి. కేంద్రంతో పునర్విభజన చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టించాలి. ‘‘ప్రత్యేక హోదాకే ఒప్పుకోని కేంద్రం... తన అధికారాలను కోల్పోయి రాష్ట్రాలను సూపర్‌పవర్‌ చేసే రాజ్యాంగ సవరణకు ఎలా సమ్మతిస్తుంది? కాబట్టి ఆ డిమాండ్‌పై కేంద్రం పెద్దగా స్పందించదు. ఈ డిమాండ్‌ దేశంలో ఒక్క వైసీపీకి మినహా మరే రాజకీయ పార్టీకీ లేదు. అలాంటప్పుడు ఉభయసభల్లో ఈ అంశంపై సభ్యుల మద్దతు కూడగట్టడం అనేది సాధ్యమయ్యేదేనా? దీనివల్ల ఏం సాధించలేమని తెలిసినా జనంలో చెప్పుకోవడానికి పనికి వస్తుందని వైసీపీ ఈ వ్యూహం తెరమీదకు తీసుకొచ్చి ఉంటుంది. 


‘మేం ప్రైవేటు బిల్లుపెట్టాం.. కేంద్రం ఒప్పుకోలేదు.. మిగతా పార్టీలు సహకరించలేద’ని ప్రచారం చేసుకోవడానికి తప్ప మరే ప్రయోజనం దీనివల్ల ఉన్నట్లుగా కనిపించడం లేదు. పైగా, ఈ చర్య వైసీపీకే నష్టదాయకంగా ఉంది. ‘రాజ్యాంగంతో సంబంధం లేకుండా మూడు రాజధానులు ఎలా తీసుకొచ్చారు?’ అన్న ప్రశ్నలకు ఆ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంది?’’ అని రాజ్యాంగ విశ్లేషకులు కె.సుబ్బారావు చెప్పారు. ఇక్కడ వైసీపీకి రాజకీ యంగా మరో నష్టం కలిగించే అంశం ఉందని ఆయన విశ్లేషించారు. ‘‘మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని వైసీపీ చెబుతోంది. కచ్చితంగా అసెంబ్లీలో మరో బిల్లు తీసుకొస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఆ పనిచేయకుండా... ఇప్పుడు రాజ్యాంగ సవరణ పేరిట పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టారు. అది అయ్యేపనికాదు. ఈ వ్యవహారం తేలేవరకు మూడు రాజధానులపై అసెంబ్లీలో బిల్లుపెట్టలేరు. కాబట్టి ఈ వ్యవహారంలో వైసీపీనే రెండింతలుగా సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నట్లయింది. అంటే మూడు రాజధానుల ముచ్చట ఇక అంతే సంగతులు’’ అని ఆయన విశదీకరించారు. 


ఏబీఎన్‌పై మళ్లీ అక్కసు

ప్రసార సాధనాలు, మీడియాను నియంత్రించే ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు(పీసీఐ) కీలక అధికారాలు కట్టబెట్టాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ప్రైవేటు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. తప్పుడు వార్తలను ప్రసారంచేసే ‘ఆల్‌ బయాస్డ్‌ న్యూస్‌ చానల్స్‌’ లేక ఎ.బి.ఎన్‌. చానళ్లపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ‘పీసీఐ’కి కల్పించాలంటూ... పరోక్షంగా ఏబీఎన్‌ చానల్‌ను బిల్లులో టార్గెట్‌ చేశారు. ఏబీఎన్‌పై పార్లమెంటు సాక్షిగా మరోసారి తన అక్కసు వెళ్లగక్కేందుకే వైసీపీ ప్రైవేటు బిల్లు పెట్టిందనేది విజయసాయి వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. నిజానికి, ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబానికి సొంత మీడియా ఉంది. అది పూర్తిగా జగన్‌ స్వీయ ప్రయోజనాల కోసమే పని చేస్తోంది.  ఆ మీడియాపైనా చర్యలు తీసుకోవాలని విజయసాయి ప్రెస్‌ కౌన్సిల్‌ను కోరినట్లేనా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.


హోదాపై బిల్లు ఏది?

మూడు అంశాలపై ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టిన  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం గుర్తుకురాలేదా? 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని ఆ పార్టీనేత జగన్‌ చెప్పారు. మరి ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ ప్రైవేటు బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఆ విషయం వైసీపి ఎంపీకి గుర్తుకు రాలేదా? లేక ప్రాధాన్యత జాబితాలో లేదా. నిజానికి ఏపీకి మూడు రాజధానుల కన్నా ప్రత్యేక హోదానే జీవనాడి . ఇదే విషయం ఏపీలో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారు. అలాంటిది ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లుపెట్టకపోవడంతో వైసీపీకి మూడు రాజధానులు, మీడియా నియంత్రణపై ఉన్న శ్రద్ధ...రాష్ట్ర ప్రయోజనాలపై లేదని రాజకీయ విశ్లేషకులు

అభిప్రాయపడుతున్నారు. 


కొసమెరుపు : జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్న చట్టసభలసభ్యులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇతర కీలక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు, సమావేశాల్లో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ తప్పనిసరి బెయిల్‌ ఇచ్చేలా ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయాలని మరో ప్రైవేటు బిల్లును విజయసాయి ప్రవేశపెట్టారు. అయితే, పలు ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ‘ఏ2‘గా అభియోగాలను ఎదుర్కొంటున్న నేత...ఈ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. 

Updated Date - 2022-08-07T09:31:26+05:30 IST