ఆ శిక్షణతోనే ఆత్మరక్షణ!

ABN , First Publish Date - 2021-10-14T05:30:00+05:30 IST

మహిళలపై నానాటికీ పెరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను ధైర్యంగా ప్రతిఘటించాలంటే...

ఆ శిక్షణతోనే ఆత్మరక్షణ!

‘మహిళలపై నానాటికీ పెరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను ధైర్యంగా ప్రతిఘటించాలంటే... మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాల్సిందే’’ అంటున్నారు కందుల సంధ్యారాణి. ఈ దిశగా ఇతరులను ప్రోత్సహించడానికి ముందు స్వయంగా కర్రసాము, కరాటే నేర్చుకున్నారు. ఇప్పుడు ఎందరికో శిక్షణ ఇస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెచుతున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి జెడ్‌పిటిసి సభ్యురాలైన సంఽధ్యారాణి ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.


‘‘నేను పుట్టిన ఊరు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామం. విద్యార్థి దశ నుంచే సామాజిక సేవ, రాజకీయాలు అంటే ఇష్టం. డిగ్రీ వరకూ చదువుకున్నాక... రామగుండం మండలం లింగాపూర్‌కు చెందిన కందుల పోశంతో నాకు వివాహం అయింది. ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. సర్పంచ్‌గా, ఎంపిటిసిగా పని చేశారు. నన్ను కూడా రాజకీయాల్లో ప్రోత్సహించారు. 2006లో ఎంపిటిసిగా, 2010లో ఎంపీపీగా గెలిచాను. ఆ తరువాత... తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో... ఎంపీపీ పదవికి, అప్పటివరకూ ఉన్న పార్టీకి రాజీనామా చేసి, టిఆర్‌ఎస్‌లో చేరాను 2014లో రామగుండం, 2018లో పాలకుర్తి మండల జెడ్‌పిటిసి సభ్యురాలుగా ఎన్నికయ్యాను. 


మొదట సందేహించాను...

మహిళలపై అత్యాచారాలు, హింస, వేధింపుల గురించి వార్తలు లేని రోజు లేదు. బాధితుల్లో అన్ని వయసుల స్త్రీలు ఉంటున్నారు దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఎదుర్కోవాలంటే మహిళలకు ఆత్మరక్షణ నైపుణ్యాలు తప్పనిసరి. అందుకే మా ప్రాంతంలో బాలికలకు, యువతులకు తగిన శిక్షణ ఇప్పించాలనుకున్నాను. వారిని ఒప్పించాలంటే ముందు ఆ శిక్షణ నేను తీసుకోవాలని, స్వయంగా వారికి నేర్పాలనీ నిర్ణయించుకున్నాను. నా వయసు 43 ఏళ్ళు. కర్ర సాము, కరాటే నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉంటాయేమోనని మొదట సందేహించాను. అయితే ఎలాంటి సమస్యలూ ఉండవని తెలుసుకున్నాను. రామగుండం ప్రాంతంలో కర్ర సాము, కరాటేలో నిష్ణాతుడైన సురేశ్‌ వద్ద ఏడాదిన్నర క్రితం శిక్షణలో చేరాను. ఆరు నెలల పాటు... ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సాధన చేశాను. నామీద ఎవరైనా దాడికి తలపడితే... వాళ్ళను మట్టి కరిపించగలలనే ఆత్మస్థైర్యం వచ్చేదాకా శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు కొందరు బాలికలకు, యువతులకు శిక్షణ ఇస్తున్నాను.


దారుఢ్యం కాపాడుకోవడానికి రోజు ఉదయం 5 కిలోమీటర్లు పరుగెడతాను. వ్యాయామం చేస్తాను.. ఇటీవల రామగుండంలో జరిగిన ఒక పోటీకి నన్ను అతిథిగా పిలిచారు. పోటీలో పాల్గొన్నవారు తమతో కర్రసాము చేయాలని కోరారు. వారితో తలపడి పైచెయ్యి సాధించాను. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  ఆ వీడియోలు చూసి కర్రసాము నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగిందనీ, స్ఫూర్తి పొందామనీ అనేకమంది చెప్పడం.. ఆనందం. ప్రతి బాలిక విద్యార్థి దశ నుంచే ఏదో ఒక మార్షల్‌ ఆర్ట్స్‌లో తర్ఫీదు పొందాలి. అప్పుడే... దాడులు, వేధింపుల నుంచి తమను తాము కాపాడుకోగలుగుతారు.


స్వయంగా ట్రాక్టర్‌లో...

 ప్రజాప్రతినిధిగా మహిళా సమస్యల  పరిష్కారానికి కృషి చేస్తున్నాను. అనాథ యువతులు, పేదింటి ఆడపిల్లల వివాహాలకు, చదువుకు ఆర్థికంగా చేయూతనిస్తాను. చెట్టు కింద జీవిస్తున్న  మహిళకు ఇల్లు కట్టించా. లాక్‌డౌన్‌లో వలస కార్మికులకు భోజనాలు అందించడం, వాహనాలు సమకూర్చి స్వస్థలాలకు పంపించా. కరోనాతో మరణించినవారి మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించాను. ఒక సందర్భంలో మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి ఎవరూ ముందుకు రాకపోతే... స్వయంగా నేనే ట్రాక్టర్‌లో తీసుకువెళ్ళాను. ఇలాంటి పనులు ఎంతో తృప్తినిస్తాయి. గోదావరిఖని స్టేడియంలో మూడేళ్ల క్రితం ‘ముంగిట్లో రంగుల హరివిల్లు’ పేరిట 400 మందితో 4 గంటల్లో ఒకటే ముగ్గు వేయించి ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌’ రికార్డు సాధించడం మంచి జ్ఞాపకం.’’

బుర్ర సంపత్‌ కుమార్‌, పెద్దపల్లి

Updated Date - 2021-10-14T05:30:00+05:30 IST