అబ్బా... సొంత డబ్బా!

ABN , First Publish Date - 2021-05-15T09:28:14+05:30 IST

దేశ ప్రజలు టీకా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక... ‘కొవాగ్జిన్‌’ టీకాకు మరింత కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తయారీ ఫార్ములాను ఇతర కంపెనీలతో పంచుకునేందుకు భారత్‌ బయోటెక్‌ అంగీకరించిందని... ఈనెల 11న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్రానికి రాసిన లేఖే దీనికి కారణమని ఆయన సొంత పత్రికలో గొప్పగా చెప్పుకొన్నారు. అసలు విషయం ఏమిటంటే...

అబ్బా... సొంత డబ్బా!

‘ఆక్సిజన్‌ కోటా పెంచండి... టీకాల సరఫరా ఎక్కువ చేయండి’ అని కేంద్రానికి తూతూమంత్రపు లేఖలు రాసి చేతులు దులుపుకోవడం!

ఏదైనా, ఎవరివల్లనైనా, ఎందుకు ఏ స్పందన కనిపించినా... ‘ఇది మా ఘనతే’ అని గొప్పలు చెప్పుకోవడం! సొంత మీడియాలో డబ్బా కొట్టుకోవడం! ‘కొవాగ్జిన్‌’ టీకా ఉత్పత్తి టెక్నాలజీ బదిలీ విషయంలో అచ్చంగా ఇదే జరిగిందని నిపుణులు చెబుతున్నారు. 


  • కొవాగ్జిన్‌ టెక్నాలజీ బదిలీపై జగన్‌ మీడియా వింత ప్రచారం
  • ఆయన లేఖ వల్లే కదలిక వచ్చిందని గొప్పలు
  • టెక్నాలజీ బదిలీపై గతనెల 15నే కేంద్రం ప్రకటన
  • మూడు సంస్థలను ఎంపిక చేసినట్లు వెల్లడి
  • టీకా ఉత్పత్తి పెంచడంపై రెండు నెలలుగా దృష్టి
  • మహారాష్ట్ర, యూపీ, హైదరాబాద్‌లోని సంస్థల్లో
  • బయో సేఫ్టీ లెవెల్స్‌ పెంపునకు నిధుల విడుదల
  • మార్చిలోనే మహారాష్ట్రలో తయారీపై ఉద్ధవ్‌ లేఖ


(అమరావతి - ఆంధ్రజ్యోతి): దేశ ప్రజలు టీకా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక... ‘కొవాగ్జిన్‌’ టీకాకు మరింత కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తయారీ ఫార్ములాను ఇతర కంపెనీలతో పంచుకునేందుకు భారత్‌ బయోటెక్‌ అంగీకరించిందని... ఈనెల 11న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్రానికి రాసిన లేఖే దీనికి కారణమని ఆయన సొంత పత్రికలో గొప్పగా చెప్పుకొన్నారు. అసలు విషయం ఏమిటంటే... కొవాగ్జిన్‌ ఫార్ములాను ఇతర కంపెనీలతో పంచుకునేందుకు గత నెలలోనే ఒప్పందం కుదిరింది. ఈ టీకా టెక్నాలజీని మూడు ప్రభుత్వరంగ సంస్థలకు బదిలీ చేసి వాటి ద్వారా కూడా వ్యాక్సిన్‌ తయారు చేయిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ బయో టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గత నెల 15వ తేదీనే ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.


జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థకు అనుబంధంగా ఉన్న ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్‌ సంస్థ (హైదరాబాద్‌), కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భారత్‌ బయోలాజికల్‌ సంస్థ (యూపీ), మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హాప్కిన్స్‌ ఫార్మా సంస్థలను దీని కోసం ఎంపిక చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. అంతకుముందే దీనికి సంబంధించి అనేక పరిణామాలు జరిగాయి. కొవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌ సంస్థ... కేంద్ర ప్రభుత్వ సంస్థలైన భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ)లతో కలిసి రూపొందించింది. అంటే... ఇతర సొంత ఆవిష్కరణలకు వర్తించే పూర్తిస్థాయి ‘పేటెంట్‌’ కొవాగ్జిన్‌కు వర్తించదని అందరికీ తెలుసు. అయితే... ఎలాంటి ప్రమాణాలు, వసతులున్న చోట దీనిని తయారు చేయాలనేది సమష్ఠిగా చర్చించి, అనుమతించాల్సి ఉంటుంది.


జూన్‌ నాటికి కోవాగ్జిన్‌ టీకా తయారీని రెట్టింపు చేయాలని, సెప్టెంబరు నాటికి ఐదారు రెట్లు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది. దీనికి అనుగుణంగా ఒకటి రెండు నెలలుగా గట్టి ప్రయత్నాలు సాగుతున్నాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే మార్చి నెలలో హాఫ్‌కిన్స్‌ కంపెనీని సందర్శించారు. అక్కడ కోవాగ్జిన్‌ ఉత్పత్తి చేపట్టాలని  కేంద్రానికి లేఖ రాశారు. ఇక... హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇమ్యునోలాజికల్‌ సంస్థలో టీకా తయారీకి ఉన్న వసతులను భారత్‌ బయోటెక్‌ గతంలోనే పరిశీలించింది. ఆ సంస్థకు టీకా టెక్నాలజీని బదిలీ చేస్తూ... అందులోనే కొంత ముడి పదార్థాన్ని తయారు చేయాలని నిర్ణయించుకొంది. ఈ టెక్నాలజీ బదిలీకి ఏప్రిల్‌లోనే రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దీనికి కేంద్రం అనుమతీ లభించింది. కోవాగ్జిన్‌ ఉత్పత్తి పెంచడానికి కేంద్రంలోని అధికారులు అంతకు ముందు నుంచే కసరత్తులు చేస్తున్నారు.


యూపీలోని బులంద్‌షహర్‌లో ఉన్న భారత్‌ బయోలాజికల్‌ కంపెనీ ప్లాంటును మార్చి నెలలోనే నిపుణుల బృందం సందర్శించింది. అక్కడున్న వసతులపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించింది. దీంతో ఇక్కడ కూడా టీకా ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించుకుని...ఏప్రిల్‌ 15న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మూడు యూనిట్లకు అవసరమైన నిధులు విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. తమ ప్లాంట్‌లో కోవాగ్జిన్‌ టీకా తయారు చేయబోతున్నట్లు భారత్‌ బయోలాజికల్‌ అదే రోజున స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం పంపింది. ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే వేరే టీకాల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. కానీ, వైరస్‌ ఉత్పత్తికి అవసరమైన వసతులు వీటిలో లేవు. బయో సేఫ్టీ లెవల్‌ -3 స్థాయి సౌకర్యాలు ఉంటేనే తమ టీకా ఉత్పత్తి సాధ్యపడుతుందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. దీనిని కేంద్రమూ నిర్ధారించింది. తాము ఎంపిక చేసిన మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ స్థాయి ప్రమాణాలు అభివృద్ధి చేయడానికే నిధులు విడుదల చేసింది. వీటితోపాటు బెంగుళూరు, పుణెల్లో భారత్‌ బయోటెక్‌ అనుబంధ ప్లాంట్లలో కూడా టీకా తయారీకి అవసరమైన వసతులను కల్పించడంపై దృష్టి పెట్టారు. ఈ  రెండు కేంద్రాల్లోనూ కోవాగ్జిన్‌ తయారీకి అనుమతులు లభించాయి.


ఇతర కంపెనీల ద్వారా కూడా...

ఫ్రెంచి కంపెనీ సనోఫికి మన దేశంలో ఉన్న టీకా తయారీ కంపెనీల్లో కోవాగ్జిన్‌ తయారు చేయడంపై కూడా భారత్‌ బయోటెక్‌ కంపెనీ చర్చలు ప్రారంభించింది. తెలుగు పారిశ్రామికవేత్తలు నెలకొల్పిన శాంతా బయోటెక్‌ ఇప్పుడు ఈ ఫ్రెంచి కంపెనీ కింద ఉంది. ఫ్రెంచి కంపెనీ కూడా తమ ప్లాంట్లలో వసతులు దీనికి అనుగుణంగా పెంచాల్సి ఉంటుంది. దీంతోపాటు యూర్‌పలో బయో సేఫ్టీ లెవల్‌ - 3 సదుపాయాలు ఉన్న ఫార్మా కంపెనీల్లో కోవాగ్జిన్‌ టీకా తయారు చేయించడానికి భారత్‌ బయోటెక్‌ కంపెనీ చర్చలు జరుపుతోంది. అక్కడ తయారు చేయించి మన దేశానికి దిగుమతి చేసుకోవాలన్నది ఆ కంపెనీ ఆలోచన. దీనికీ కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇదంతా ఒకటి రెండు నెలలుగా జరుగుతోంది. ఇన్ని ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతుండగా... తమ ముఖ్యమంత్రి లేఖ రాసిన తర్వాతే కేంద్రంలో కదలిక వచ్చిందని జగన్‌ మీడియా పేర్కొనడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘పాత విషయాలను ప్రజలు మర్చిపోతుంటారన్న ధైర్యంతోనే ఇలాడబ్బా కొట్టుకొంటున్నారు’ అని ఏపీ బీజేపీ నేత ఒకరు సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానించడం కొసమెరుపు!

Updated Date - 2021-05-15T09:28:14+05:30 IST