స్వీయ నిర్బంధంలో సంతోషంగా...!

ABN , First Publish Date - 2020-03-21T06:21:49+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా యావత్‌ ప్రపంచం స్తంభించిపోయింది. నిన్నటిదాకా బిజీబిజీగా ఆఫీసులు, స్కూళ్లకు పరుగులు పెట్టిన వాళ్లు ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. సినిమాలు, పార్కులు, షాపింగు మాల్స్‌ చుట్టూ తిరిగిన వాళ్లు కదలకుండా

స్వీయ నిర్బంధంలో సంతోషంగా...!

కరోనా వైరస్‌ కారణంగా యావత్‌ ప్రపంచం స్తంభించిపోయింది. నిన్నటిదాకా బిజీబిజీగా ఆఫీసులు, స్కూళ్లకు  పరుగులు పెట్టిన వాళ్లు ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. సినిమాలు, పార్కులు, షాపింగు మాల్స్‌ చుట్టూ తిరిగిన వాళ్లు కదలకుండా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టెక్నాలజీ సాయంతో ‘కరోనా’ స్వీయ నిర్బంధాన్ని భారంగా కాకుండా సంతోషంగా భావించడం ఎలా?


గత ఐదారు నెలలుగా పని ఒత్తిడి వల్ల చాలా సినిమాలు మిస్‌ చేసి ఉంటారు. ఇప్పుడు ఆ సినిమాలన్నీ చూడడానికి ఇది మంచి అవకాశం. ఆ సినిమాలు అమెజాన్‌ ప్రైమ్‌, జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్‌, జీ5 వంటి వీడియో ఆన్‌ డిమాండ్‌ సర్వీసుల్లో వచ్చి ఉంటాయి. వాటిని ఒంటరిగా చూడడం కాకుండా స్మార్ట్‌టీవీలో కుటుంబం మొత్తం కలిసి ఒకచోట కూర్చొని నచ్చిన సినిమాలు స్ట్రీమ్‌ చేసుకుంటూ ఎంజాయ్‌ చేయండి. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నప్పుడు పెద్దగా తెలియదు గానీ, ఇలా కుటుంబం మొత్తం ఒకే చోట ఇంట్లో కూర్చోవాల్సి వచ్చినప్పుడు, ఎవరి లోకంలో వారు ఉంటే అది మరింత ఒంటరితనానికి గురిచేస్తుంది. కాబట్టి పాత రోజుల్ని, ఉమ్మడి కుటుంబాలను గుర్తు చేసుకుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ గడపడం, లేదా కలిసి సినిమాలు చూడడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. 


డిజిటలైజ్‌ చేయండి

సహజంగా ఇంటి దగ్గర ఉంటే ఎక్కువ సమయం లభిస్తుంది. అది బోర్‌ కొట్టకుండా ఉండాలంటే ఉపయోగపడే పనులు చేయొచ్చు. మీ ఇంట్లో ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషిన్‌, టీవీలాంటి అన్ని వస్తువులు కొనుగోలు చేసిన బిల్స్‌ ఉంటాయి కదా! మీ ఫోన్‌లో కామ్‌ స్కానర్‌ వంటి అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసి, ఆ బిల్స్‌, వాటితో పాటు వారెంటీ సమాచారాన్ని స్కాన్‌ చేసి జాగ్రత్తగా క్లౌడ్‌ స్టోరేజ్‌లో సేవ్‌ చేసుకోండి. అలాగే గూగుల్‌ క్యాలెండర్‌ ద్వారా వాటర్‌ ప్యూరిఫైయర్‌ క్లీనింగ్‌ వంటి ప్రతీ ఆరు నెలలు, సంవత్సరానికి ఒకసారి చేయాల్సిన పనులను ఈవెంట్ల రూపంలో విభజించుకోండి. ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా, గూగుల్‌ క్యాలెండర్‌ వాటిని మీకు గుర్తు చేస్తుంది.


అవసరం లేనివి తీసేయండి

ఎవరి స్మార్ట్‌ఫోన్‌లో చూసినా కూడా భారీ మొత్తంలో ఫోటోలు, వీడియోలు నిండిపోయి ఉంటాయి. ఇప్పుడు ఎలాగూ ఇంట్లోనే  ఉంటున్నారు, ఖాళీ సమయం దొరికింది కాబట్టి మీ ఫోన్‌ స్టోరేజ్‌ మొత్తాన్ని పరిశీలించి ముఖ్యమైన ఫోటోలను గూగుల్‌ ఫొటోస్‌ వంటి క్లౌడ్‌ స్టోరేజీలోకి బ్యాకప్‌ తీసుకోండి. అనవసరమైన వాటిని తొలగించండి.  సులభంగా ఫొటోలను గుర్తించే విధంగా ఫోల్డర్లుగా ఆర్గనైజ్‌ చేయండి. అలాగే మీ ఫోన్‌లో గత రెండు మూడు నెలలుగా ఉపయోగించని అప్లికేషన్లని గుర్తించి వాటిని  తొలగించండి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్‌ పని తీరు మునుపటి కన్నా మెరుగుపడుతుంది. అవసరమైతే ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ చేయడం ద్వారా మరింత ప్రయోజనం ఉంటుంది. అందుబాటులో ఉన్న సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోండి.


ఫేక్‌ న్యూస్‌కి దూరంగా...

కరోనా వైరస్‌ గురించి చాలాచోట్ల ఎక్కువ ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్‌ చాలా ప్రమాదకరమైనదే. అయితే ఒక స్థాయికి మించి ఆందోళన చెందటం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అది దీర్ఘకాలంలో మానసిక ఒత్తిడి, కుంగుబాటు వంటి ఇతర సమస్యలకు కారణమవుతుంది. అదే పనిగా ఫేస్‌బుక్‌ న్యూస్‌ ఫీడ్‌ స్ర్కోల్‌ చెయ్యడం, వివిధ సైట్ల నుంచి కరోనా వైరస్‌ గురించి క్షణానికోసారి వచ్చే లింకులను క్లిక్‌ చేసి.. కరోనా వైరస్‌ ‘మన దాకా వచ్చింది’ అన్న భయాలు పెట్టుకోవడం మానేయాలి.  ఫోన్‌లో చీటికి మాటికి నోటిఫికేషన్స్‌ పంపించే అప్లికేషన్లు ఉంటే వాటి నోటిఫికేషన్లని డిజేబుల్‌ చేయండి. అలాగే అనవసరమైన వాట్సాప్‌ గ్రూప్‌ల నుంచి బయటకు రండి. కరోనా వైరస్‌ గురించి యూట్యూబ్‌లో, వాట్సప్‌లో అదే పనిగా వీడియోలు చూడడం, దాని గురించి చర్చించుకోవడం పరోక్షంగా దాని పట్ల మరింత ఆందోళన పెరగడానికి కారణమవుతుంది. మీ మొబైల్‌ ఫోన్‌, కంప్యూటర్‌లో నవ్వు తెప్పించే వీడియోలు, ఆహ్లాదాన్ని ఇచ్చే సన్నివేశాలు చూస్తూ ఎంజాయ్‌ చేయాలి. అంతే తప్పించి ఆందోళన పెంచే వీడియోలు చూడవద్దు. చాలామంది ‘ఇలాంటివి తెలుసుకోవడం ద్వారా మరింత జాగ్రత్తగా ఉంటాం’ అనే అపోహలో ఉంటారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఎవరికి వాళ్లం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవి సరిపోతాయి. అంతే తప్పించి అతిగా భయపడటం వల్ల మీకూ, మీ కుటుంబానికి ప్రశాంతత కరువవుతుంది.



ఆరోగ్యం కాపాడుకోండి..

రాత్రి పడుకోబోయే ముందు స్పాటిఫై, యూట్యూబ్‌ వంటి వాటిలో ఆహ్లాదకరమైన సంగీతం, మానసిక ఒత్తిడి తగ్గించే వైట్‌ నాయిస్‌ లాంటివి వినండి. ఇవి అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. అయితే కొంతమంది రాత్రిపూట అదేపనిగా మొబైల్‌, కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ స్ర్కీన్‌ వంక చూస్తూ గడుపుతూ ఉంటారు. దీంతో వాటి నుంచి వచ్చే నీలికాంతి ప్రభావం వల్ల త్వరగా నిద్ర పట్టదు. రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ సమయంలో సరైన ఆహారం తీసుకోండి. ఫోన్‌ పక్కన పడేసి కంటినిండా నిద్ర పోండి. ఒకవేళ రోగనిరోధక శక్తి తగ్గి చిన్న జలుబు లాంటివి వచ్చినా, ప్రస్తుతం కరోనా ఉన్న తరుణంలో అది మీతోపాటు మిగిలిన వాళ్లలో భయాన్ని సృష్టిస్తుంది. కాబట్టి చేజేతులా ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండండి. అప్పుడే కరోనా లాంటి మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొనగలుగుతాం.


ఆన్‌లైన్‌ కోర్సులు 

ఇంతకు ముందు రోజు మొత్తం మీద కనీసం రెండు మూడు గంటలు బయట తిరగడానికే సరిపోయేది. ఇప్పుడు ఆ సమయం మొత్తం ఆదా అవుతోంది. ఈ నేపథ్యంలో అలా మిగిలిన సమయాన్ని ఏదైనా ఆసక్తికరమైన విషయాన్ని యుడెమీ, లింక్డిన్‌ లెర్నింగ్‌, యూట్యూబ్‌ వంటి వాటిలో నేర్చుకోవడానికి వెచ్చించండి. సంగీతం మొదలుకొని వాయిస్‌ మాడ్యులేషన్‌, బాడీ లాంగ్వేజ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, ఐ.టి. సబ్జెక్టులు వంటి అనేక రకాల కోర్సులు ఆన్‌లైన్‌లో లభిస్తుంటాయి. వీడియోలు చూస్తూ కేవలం పాసివ్‌గా నేర్చుకోవడం కాకుండా, ముఖ్యమైన విషయాలను అప్పటికప్పుడు నోట్‌బుక్‌లో నోట్‌ చేసుకుంటూ నిజంగా క్లాస్‌కి వెళ్లి నేర్చుకుంటున్నంత ప్రాక్టికల్‌గా అధ్యయనం చేయవచ్చు. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు మెదడులో డోపమిన్‌ రసాయనం విడుదల కావటం వల్ల కొత్త ఉత్సాహం కూడా లభిస్తుంది. కరోనా కారణంగా ఇంట్లో బందీగా ఉన్నామనే భావనను కొత్త విషయాలు నేర్చుకునే వ్యాపకంలో పడి కొద్దిగంటల్లోనే మర్చిపోవచ్చు.


గేమ్స్‌ అదే పనిగా వద్దు..

చాలామంది ఇప్పటికే గంటల తరబడి వీడియో గేమ్స్‌లో నిమగ్నమవుతున్నారు. ఇంట్లో మీరు ఒక్కరే ఉంటే ఇబ్బంది లేదు గానీ, ఇంట్లో అందరు ఉన్నా ఎవరి ఫోన్‌లో వారు గేమ్స్‌                       ఆడుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా గడపడం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఎవరికి వారు ముభావంగ ఉంటూ, ఇంట్లో వాళ్ళతో మాట్లాడకపోతే దాని ప్రభావం ప్రతీ కుటుంబ సభ్యుడి మీద పడుతుంది. కాబట్టి ఇంటిల్లిపాది కబుర్లు చెప్పుకుంటూ గడపండి.


విదేశాల్లో ఉంటే..

పిల్లలు చదువు నిమిత్తం విదేశాల్లో ఉండి ఉంటారు. కొందరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుండి ఉంటారు. వాళ్లను తలచుకుని బాధపడడం కన్నా వాట్సప్‌, స్కైపీ వంటి వీడియో కాలింగ్‌ సదుపాయాలను ఉపయోగించి కుటుంబం మొత్తం ఒక గ్రూప్‌గా ఏర్పడి వారితో కొంత సమయం గడపడం ద్వారా చాలావరకు ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అలాగే వారి క్షేమసమాచారాలు ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసుకోవచ్చు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కుటుంబం నుంచి లభించే మాటలు వారికి ఎంతో ఊరటనిస్తాయి.

Updated Date - 2020-03-21T06:21:49+05:30 IST