ప్రశాంతంగా..

ABN , First Publish Date - 2021-07-31T05:22:48+05:30 IST

మునిసిపాలిటీల్లో రెండో వైస్‌ చైరన్‌ ఎన్నిక ప్రశాంతంగా సాగింది. శుక్రవారం పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి ఈ ఎన్నికలు నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యతను కనబరచడంతో.. ఆ పార్టీకి చెందిన వారే మూడుచోట్ల రెండో వైస్‌ చైర్మన్లుగా కొలువుదీరారు.

ప్రశాంతంగా..
సురేష్‌బాబును, విప్‌ను అభినందిస్తున్న మంత్రి అప్పలరాజు, చైర్మన్‌ బళ్ల గిరిబాబు.

- మునిసిపాలిటీల్లో రెండో వైస్‌ చైర్మన్ల ఎన్నిక

- ఇచ్ఛాపురం, పాలకొండలలో ఎమ్మెల్యే అశోక్‌తో పాటు  టీడీపీ కౌన్సిలర్లు గైర్హాజరు

- పలాసలో సురేష్‌బాబుకు సహకరించిన ప్రతిపక్ష సభ్యులు

(పలాస/ ఇచ్ఛాపురం/ పాలకొండ)

మునిసిపాలిటీల్లో రెండో వైస్‌ చైరన్‌ ఎన్నిక ప్రశాంతంగా సాగింది. శుక్రవారం పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి ఈ ఎన్నికలు నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యతను కనబరచడంతో.. ఆ పార్టీకి చెందిన వారే మూడుచోట్ల రెండో వైస్‌ చైర్మన్లుగా కొలువుదీరారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలోని నాలుగో వార్డు కౌన్సిలర్‌ మీసాల సురేష్‌బాబు రెండో వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. శుక్రవారం మునిసిపల్‌ కార్యాలయం సమావేశ మందిరంలో ఎన్నికల అధికారి సీతారామమూర్తి ఆధ్వర్యంలో వైస్‌చైర్మన్‌-2 ఎంపిక నిర్వహించారు. సురేష్‌బాబును తొమ్మిదో వార్డు కౌన్సిలర్‌ గుజ్జు జోగారావు  ప్రతిపాదించగా, 18వ వార్డు కౌన్సిలర్‌ సనపల సింహాచలం  బలపరిచారు. దీంతో సురేష్‌బాబును వైస్‌చైర్మన్‌-2గా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. 11వ వార్డు కౌన్సిలర్‌ దుర్గాశంకర్‌ పండాను విప్‌గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ  రెండో వైస్‌ చైర్మన్‌గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సురేష్‌బాబును ఎన్నుకొని చరిత్ర తిరగ రాశామని తెలిపారు. ఎన్నికకు ప్రతిపక్ష సభ్యులు సహకరించడంతో మంత్రి వారిని అభినందించారు. అనంతరం సురేష్‌బాబు, విప్‌ దుర్గాశంకర్‌లను చైర్మన్‌ బళ్ల గిరిబాబు, వైస్‌చైర్మన్‌-1 బోర కృష్ణారావు, కౌన్సిలర్లు అభినందించారు. కార్యక్రమంలో కమిషనర్‌ రాజగోపాలరావు, టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ వజ్జ బాబూరావు, డిక్కల ఆనంద్‌, డొక్కరి తులసి, త్రివేణి, వైకాపా కౌన్సిలర్లు బెల్లాల శ్రీనివాసరావు, పి.ప్రసాద్‌, పి.అజయ్‌, బడగల సుజాత, గీత పాల్గొన్నారు.


ఇచ్ఛాపురానికి స్వర్ణమణి

ఇచ్ఛాపురం మునిసిపాలిటీ రెండో వైస్‌ చైర్‌పర్సన్‌గా ఏడో వార్డు కౌన్సిలర్‌ లాభాల స్వర్ణమణి ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రత్యేకాధికారి, సబ్‌ కలెక్టర్‌ వికాస్‌  మర్మత్‌  అఽద్యక్షతన ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించారు. 23 మంది కౌన్సిలర్లకు గాను వైసీపీకి చెందిన 16 మందితో పాటు చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి హాజరయ్యారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, ఆరుగురు కౌన్సిలర్లు  గైర్హాజరయ్యారు. స్వర్ణమణి పేరును ఒకటో వార్డు కౌన్సిలర్‌ సుగ్గు ప్రేమ్‌కుమార్‌ ప్రతిపాదించగా, 18వ వార్డు కౌన్సిలర్‌ సీహెచ్‌ జగన్‌ బలపరిచారు. 17 మంది కౌన్సిలర్లు ఆమెకు మద్దతు తెలిపారు.  అనంతరం ఎన్నికల అధికారి, మునిసిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి ఆమెను అభినందించారు. ఎన్నిక నిర్వహణలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ వినోద్‌బాబు ఆధ్వర్యంలో పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు సత్యనారాయణ, హైమావతి సిబ్బంది మునిసిపల్‌  కార్యాలయం వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగ్వరాలా, సొసైటీ ఫర్‌ ఎంప్లాయీమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి, నర్తు నరేంద్ర తదితరులు స్వర్ణమణి ని అభినందించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ ఉలాల భారతి దివ్య, కౌన్సిలర్లు, పాల్గొన్నారు. 


పాలకొండకు ప్రతాప్‌

పాలకొండ నగర పంచాయతీ రెండో వైస్‌చైర్మన్‌గా 11వ వార్డు కౌన్సిలర్‌ పల్లా ప్రతాప్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఎమ్మెల్యే కళావతి, నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ యందవ రాధాకుమారి, కౌన్సిలర్లు హాజరై ప్రతాప్‌ను ఎన్నుకున్నారు.  తొలుత ఐదో వార్డు కౌన్సిలర్‌ వెలమల మన్మఽథరావు... ప్రతాప్‌ పేరును ప్రతిపాదించగా, 15వ వార్డు కౌన్సిలర్‌ దుప్పాడ పాపినాయుడు బలపరిచారు. దీంతో మిగిలిన 16 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే కళావతి...  ప్రతాప్‌ అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రతాప్‌కు డీసీసీబీ మాజీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌, నగర పంచాయతీ కమిషనర్‌ నడిపేన రామారావు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికకు  ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు   గైర్హాజరయ్యారు. 

Updated Date - 2021-07-31T05:22:48+05:30 IST