Abn logo
Nov 24 2021 @ 10:06AM

Tamilnaduలోని సేలంలో ఘోరం

- గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఐదిళ్లు ధ్వంసం

- ఫైర్‌ ఆఫీసర్‌ సహా ఐదుగురి దుర్మరణం

- పదిమందికి తీవ్రగాయాలు


చెన్నై: సేలంలోని ఓ ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌ ఐదిళ్లను ధ్వంసం చేయడంతో పాటు ఐదుగురి ప్రాణాలను బలి గొంది. మరో పదిమంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం వేకువజామున జరిగిన ఈ ఘటన వివరాలిలా వున్నాయి... సేలం కార్పొరేషన్‌ కరుంగల్‌పట్టి పాండురంగన్‌కోవిల్‌ వీధిలో పద్మనాభన్‌ (59) అనే అగ్నిమాపకదళ అధికారి, ఆయన భార్య దేవి (54), కుమారుడు లోకేష్‌ మూడంతస్థుల భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసిస్తున్నారు. వీరి ఇంటి పక్కనే వెంకట్రామన్‌ (61)కు చెందిన ఇళ్ళున్నాయి. ఆ ఇళ్లలో జౌళి వ్యాపారి గణేశన్‌, ఆయన భార్య మహాలక్ష్మి, మురుగన్‌, ఉషారాణి అనే దంపతులు, గోపీ అనే మరో వ్యక్తి కుటుంబాలతో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం వేకువజామున గోపి ఇంట్లో ఆయన బంధువు రాజాలక్ష్మి (80) పొయ్యి వెలిగించగానే గ్యాస్‌ సిలిండర్‌ పేలి క్షణాల్లో ఇంటిలోని గదులకు మంటలు వ్యాపించాయి. వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. ఈ పేలుడు ధాటికి పక్కనే ఉన్న పద్మనాభన్‌ ఉంటున్న భవనం, దాని పక్కనే ఉన్న మరో ఇల్లు పేకమేడల్లా కూలాయి. ఈ దుర్ఘటనలో ముందుగా అగ్నిమాపకదళాధికారి పద్మనాభన్‌, ఆయన భార్య దేవి, కార్తీక్‌ (18) అనే యువకుడు, రాజాలక్ష్మి అక్కడికక్కడే మరణించారు. ఎల్లమ్మ అనే మరో మహిళ మృతదేహం కూడా శిథిలాల నుంచి బయటపడింది. దీంతో ఈ దుర్ఘటనలో మృతిచెందినవారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ పేలుడు సంభవించిన వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపకదళానికి సమాచారమందించారు. పేలుడు సంభవించిన అరగంట వరకూ ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. భవనాల శిథిలాల మధ్య చిక్కుకున్న వారంతా కేకలు పెట్టారు. ఆలోగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని భవన శిథిలాల మధ్య చిక్కుకుని గాయ పడిన వెంకటరాజ్‌ (62), ఇంద్రాణి (54), మోహన్‌రాజ్‌ (40), నాగసుధా (30), గోపాల్‌ (76), ధనలక్ష్మి (64), సుదర్శన్‌ (6), గణేశన్‌ (40), ఉషారాణి, లోకేష్‌ (18), మురుగన్‌, కార్తీరామ్‌, శ్యామ్‌లను వెలికి తీసి చికిత్స నిమిత్తం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొందరి  పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.


చిన్నారిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

ఈ దుర్ఘటనలో శిథిలాల నుంచి మురుగన్‌, ఆయన భార్య ఉషారాణిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. అదే సమయంలో వీరి కుమార్తె పూజాశ్రీ (10) శిథిలాల మధ్య చిక్కుకుని ఏడుస్తుండగా అది విన్న అగ్నిమాపక సిబ్బంది ఆమెపై పడిన శిథిలాలను తొలగించేందుకు ఎక్స్‌కవేటర్లను ఉపయోగించారు. సుమారు మూడు గంటల తర్వాత ఆ బాలికను వెలికి తీసి తల్లిదండ్రులకు అప్పగించారు. గాయపడిన ఆ బాలికను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే సేలం జిల్లా కలెక్టర్‌ కార్మేగం, పోలీసు కమిషనర్‌ నజ్‌మల్‌ గోడా, కార్పొరేషన్‌ కమిషనర్‌ క్రీస్తురాజు, శాసనసభ్యులు రాజేంద్రన్‌, బాలసుబ్రమణియన్‌ ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల తొలగింపు పనులను పరిశీలించారు.

క్రైమ్ మరిన్ని...