Aug 27 2021 @ 23:20PM

‘టక్ జగదీష్’ ఎఫెక్ట్: ‘లవ్ స్టోరి’ విడుదల వాయిదా

వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరి’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రిలీజ్ డేట్ విషయంలో నాని ‘టక్ జగదీష్’ చిత్రం ఓటీటీలో విడుదల అవుతున్నా.. ఆపాలని నిర్మాతలు ఇటీవల చర్చలు జరిపారు. కానీ నాని ‘టక్ జగదీష్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న విడుదల అవుతుందంటూ అధికారికంగా శుక్రవారం ప్రకటించడంతో.. చేసేది లేక ‘లవ్ స్టోరి’ నిర్మాతలే తమ చిత్ర విడుదలను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ‘టక్ జగదీష్’ చిత్రం ఓటీటీలో విడుదలవుతుంది కాబట్టి.. థియేటర్లలో విడుదలవుతున్న ‘లవ్ స్టోరి’ చిత్రంపై పెద్దగా ఎఫెక్ట్ ఏమీ పడదు. అందులోనూ శేఖర్ కమ్ముల చిత్రం. సాయిపల్లవి క్రేజ్ ఎలాగూ ఉంది. మరి ఎందుకు మేకర్స్ వెనక్కి తగ్గుతున్నారో అర్థం కాని పరిస్థితి. రెండు, మూడు పెద్ద సినిమాలు కూడా ఒకే రోజు విడుదలైన చరిత్ర టాలీవుడ్‌కి ఉంది. అలాంటిది నాని చిత్రం ఓటీటీలో విడుదలవుతుంటే.. ‘లవ్ స్టోరి’ మేకర్స్ ఎందుకు రిలీజ్‌ను వాయిదా వేయాలని అనుకుంటున్నారో..? తెలియాల్సి ఉంది.