అంతా ‘అరుణాచలం’!

ABN , First Publish Date - 2022-05-12T09:34:16+05:30 IST

పిడ్రిన్‌ సరఫరా కేసులో ప్రధాన నిందితుడు ఎవరో తేలిపోయింది. చెన్నై నుంచి విజయవాడకు వచ్చి ఎపిడ్రిన్‌ పార్సిల్‌ ఇచ్చింది అరుణాచలం అని నిర్ధారణ అయింది. విజయవాడ భారతీనగర్‌లో ఉన్న డీఎ్‌సటీ (డిస్టెన్స్‌ స్పీడ్‌ టైం) ఇంటర్నేషనల్‌

అంతా ‘అరుణాచలం’!

ఎపిడ్రిన్‌ సరఫరాలో అతడే కొరియర్‌ 

చెన్నై నుంచి వచ్చి పార్శిల్‌ బుకింగ్‌

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

చెన్నై విమానాశ్రయంలో అరెస్టు

భారీగా స్మగ్లింగ్‌ గూడ్స్‌ స్వాధీనం

బర్మా బజార్‌ నుంచి నడిచిన వ్యవహారం


విజయవాడ, మే 11 (ఆంధ్రజ్యోతి): ఎపిడ్రిన్‌ సరఫరా కేసులో ప్రధాన నిందితుడు ఎవరో తేలిపోయింది. చెన్నై నుంచి విజయవాడకు వచ్చి ఎపిడ్రిన్‌ పార్సిల్‌ ఇచ్చింది అరుణాచలం అని నిర్ధారణ అయింది. విజయవాడ భారతీనగర్‌లో ఉన్న డీఎ్‌సటీ (డిస్టెన్స్‌ స్పీడ్‌ టైం) ఇంటర్నేషనల్‌ కొరియర్‌ సర్వీస్‌ నుంచి జనవరి 31న ఆస్ట్రేలియాకు వెళ్లిన పార్సిల్‌ దారి తప్పి కెనడాకు వెళ్లి తిరిగి బెంగళూరు విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారుల చేతిలో పడిన విషయం తెలిసిందే. ఈ పార్సిల్‌లో నాలుగు కిలోల ఎపిడ్రిన్‌ ఉండటంతో కొరియర్‌ ఉద్యోగి గుత్తుల తేజను గత నెల 30న కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఈ పార్సిల్‌ను చెన్నై నుంచి విజయవాడకు తీసుకురావడంలో పాత్ర పోషించిన అరుణాచలం అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఎపిడ్రిన్‌ ఎపిసోడ్‌లో అరుణాచలం పాత్ర ఉందని ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల ఆరో తేదీన వార్త ప్రచురితమైంది. ఇదే విషయాన్ని డీసీపీ మేరీప్రశాంతి, ఏడీసీపీ కొల్లి శ్రీనివాసరావు, ఏసీపీలు ఖాదర్‌బాషా, వర్మ, ఇన్‌స్పెక్టర్‌ రావి సురేశ్‌రెడ్డితో కలిసి ఆపరేషనల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో బుధవారం వెల్లడించారు. 


కొరియర్‌కు రూ.10వేలు ఇస్తామన్నారు..: చెన్నైలోని కోయంబేడు ప్రాంతానికి చెందిన కుప్పుస్వామి అరుణాచలం వెంకటేశం ఏసీ మెకానిక్‌. అక్కడ బర్మా బజార్‌లో పనిచేస్తుంటాడు. దుబాయ్‌ నుంచి స్మగ్లింగ్‌ సరుకులు తీసుకొచ్చి బజార్‌లోని వివిధ షాపులకు చేర్చి కమీషన్‌ తీసుకుంటాడు. ఇదే బజార్‌లో పనిచేస్తున్న ఇద్దరు యువకులు కమీషన్‌ పద్ధతిపై డ్రగ్స్‌ మాఫియా ఇచ్చే పార్సిళ్లను ఆయా ప్రాంతాలకు పంపుతారు. అరుణాచలంతో ఏసీ రిపేరు చేయించుకున్న ఓ వ్యక్తి తాను ఇచ్చిన పార్సిల్‌ను కొరియర్‌కు ఇస్తే రూ.10వేలు ఇస్తానని చెప్పాడు. బర్మా బజార్‌లో వచ్చే సంపాదన కంటే ఇది ఎక్కువగా ఉండడంతో అరుణాచలం రూటు మార్చుకున్నాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొండవీటి గోపీసాయి చెన్నై శివారున ఉన్న సవిత ఇంజనీరింగ్‌ కళాశాలలో 2017 నుంచి 2021 వరకు చదివాడు. ఆ సమయంలో ఒక రిసార్ట్‌లో గోపీసాయి ఇచ్చిన ఆధార్‌కార్డు ఫొటోస్టాట్‌ కాపీని మాఫియా సంపాదించింది.


దాన్ని అరుణాచలం ఫొటోతో మార్ఫింగ్‌ చేయించాడు. అరుణాచలం స్వస్థలం వేలూరు జిల్లాలోని వాణియంబాడి. ఇది కర్ణాటక, ఆంధ్ర సరిహద్దుల్లో ఉండటంతో అతడు తెలుగు బాగా మాట్లాడతాడు. దీంతో డ్రగ్స్‌ మాఫియా అరుణాచలాన్ని ఎంచుకుంది. గూగుల్‌లో విజయవాడ భారతీనగర్‌లో ఉన్న డీఎ్‌సటీ కొరియర్‌ గురించి తెలుసుకున్న మాఫియాలో ఇద్దరు వ్యక్తులు అతడిని తీసుకుని బస్సులో మూడుసార్లు విజయవాడకు వచ్చి పార్సిల్‌ ఇచ్చారు. ఇక్కడి పరిస్థితులను గమనించారు. పర్వాలేదని నిర్ధారించుకున్నాక చీరల్లో ఎపిడ్రిన్‌ పెట్టి పార్సిల్‌ను అరుణాచలానికి ఇచ్చారు. వారే బస్సు టికెట్లు తీసి పంపారు. జనవరి 31న బస్సులో విజయవాడకు వచ్చిన అరుణాచలం పార్సిల్‌ ఇచ్చి వెంటనే వెళ్లిపోయాడు. అంతకుముందు పార్సిల్‌లో అరుణాచలం ఇచ్చిన ఆధార్‌ ఫొటోస్టాట్‌ కాపీపై అతడి ఫొటో, సెల్‌నంబర్‌ ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారాలుగా మారాయి. బెంగళూరు కస్టమ్స్‌ అధికారులకు తేజ చిక్కిన తర్వాత స్మగ్లింగ్‌ సరుకులు తీసుకురావడానికి అరుణాచలం దుబాయ్‌ వెళ్లిపోయాడు. అతడి కోసం కాపుకాసిన విజయవాడ పోలీసులు చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతడి నుంచి సోనీ డీవీడీ ప్లేయర్లు, గేమ్స్‌ డివై్‌సలు, క్రష్‌బుల్‌ క్యాప్సుల్స్‌తో కూడిన సిగరెట్లు, సోనీ ప్లే స్టేషన్‌ డ్యూయల్‌ సీన్‌ చార్జింగ్‌ స్టేషన్‌, ఐ ఫోన్‌ను పోలిన నకిలీ ఫోన్లు, ల్యాప్‌ట్యా్‌పలు, రీచార్జబుల్‌ బ్యాటరీలు, మెమొరీ కార్డులు, బంగారం వాచీలు, దుబాయ్‌ దినార్లు, రెండు పాస్‌పోర్టులు, రూ.5వేలు స్వాధీనం చేసుకున్నారు. గుత్తుల తేజను అరెస్టు చేసిన వార్తలు రావడంతో అరుణాచలంతోపాటు విజయవాడకు వచ్చిన ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం ప్రత్యేక బృందాలు చెన్నైలో గాలిస్తున్నాయని పోలీసు కమిషనర్‌ టి.కాంతిరాణా తెలిపారు. 

Read more