స్వాధీనం చేసుకున్న లిక్విడ్ గంజాయితో ఎస్ఈబీ పోలీసులు
ఒకరి అరెస్టు, మరొకరి పరారీ
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.పది లక్షలు
చింతపల్లి, మే 19: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న ఏడు కిలోల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేసినట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఎస్ఈబీ ఎస్ఐ ఎండీ ఇబ్రహీం తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ లిక్విడ్ గంజాయి తరలిస్తున్నట్టు అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు గురువారం అన్నవరం-లోతుగెడ్డ మార్గంలో వాహనాల తనిఖీ నిర్వహించామన్నారు. ఆ సమయంలో ఇద్దరు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆపామని, వారు తప్పించుకునేందుకు యత్నించగా...తమ సిబ్బంది చాకచక్యంగా అడ్డుకున్నారన్నారు. అయితే వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి పారిపోయాడని, అతడిని పట్టుకునే యత్నంలో కానిస్టేబుల్ షేక్ రెహమాన్ గాయపడ్డారన్నారు. వాహనం నడుపుతున్న కుడుముసారి పంచాయతీ బొడ్డపుట్టుకి చెందిన పాంగి రత్నాలుని విచారించగా.. పారిపోయిన వ్యక్తి ప్రధాన నిందితుడని, అతడు కోరుకొండకు చెందిన పాంగి సాంబగా తెలిపాడన్నారు. వాహనం, లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా పాంగి రత్నాలును అరెస్టు చేసి, కోర్టుకు తరలించామన్నారు. స్వాధీనం చేసుకున్న ఏడు కిలోల లిక్విడ్ గంజాయి విలువ రూ.పది లక్షలు ఉంటుందన్నారు. ఈ దాడిలో ఎస్ఈబీ సిబ్బంది అప్పలనాయుడు, సత్యనారాయణ, వరలక్ష్మి పాల్గొన్నారు.