Abn logo
May 11 2021 @ 03:56AM

వెయ్యి బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

బద్వేలుకు చెందిన రైస్‌మిల్లు యజమానిపై కేసు 


మదనపల్లె క్రైం, మే 10: రెండు లారీల్లో  రేషన్‌ బియాన్ని అక్రమంగా తర లిస్తున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్లను అరెస్టు చేసి రిమాండుకు తర లించినట్లు డీఎస్పీ రవిమనోహరాచారి చెప్పారు. సోమవారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో  కేసు వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. టూటౌన్‌ సీఐ నరసింహులు సోమవారం సిబ్బందితో అన్నమయ్య సర్కిల్‌లో నాకాబందీ నిర్వహిస్తుండగా అటుగా వచ్చిన రెండు లారీలను తనిఖీ చేశారు. వాటిల్లో బియ్యం ఉండగా, సరఫరాకు సంబంధించి ఎలాంటి వేబిల్లులు లేకపోవడంతో కడప జిల్లా బద్వేలుకు చెందిన డ్రైవర్లు సోమశంకరయ్య, జాఫర్‌, క్లీనర్లు సుబ్బయ్య, రామచంద్రను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు. బియ్యాన్ని  బద్వేలు నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలిసింది. అలాగే  బద్వేలుకు చెందిన రైస్‌మిల్లు యజమాని సురేంద్ర... నెల్లూరు జిల్లా వింజమూరు వద్ద రేషన్‌ బియ్యానికి నకిలీ పత్రాలు సృష్టించి మామూలు బిల్లుల ముసుగులో అక్రమ రవాణా చేస్తున్నట్లు  తేలింది.  బియ్యం సంచులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ట్యాగ్‌లుండడం గమనార్హం. కాగా రైస్‌మిల్లు యజమానిని అరెస్టు చేసి తీసుకొచ్చేందుకు సిబ్బందిని బద్వేలుకు పంపుతున్నట్లు చెప్పారు.  లారీల సహా బియ్యం బస్తాలను సీజ్‌ చేసి పౌరసరఫరాలశాఖ అధికారులు అప్పగించామన్నారు. ఒక్కో బస్తా 50 కిలోలు ఉందని, ఒక్కో లారీలో 500 బస్తాలున్నాయని చెప్పారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.12 లక్షలు ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement