కరీంనగర్‌లో భారీ ఎత్తున పేలుడు పదార్థాల పట్టివేత

ABN , First Publish Date - 2021-02-26T05:52:57+05:30 IST

కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 25: స్టోన్‌ పాలిష్‌పేరిట బస్తాల్లో ప్యాక్‌ చేసి ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా అక్రమంగా తరలిస్తున్న 14క్వింటాళ్ల గన్‌పౌడర్‌, రెండు వేల డిటోనేటర్లను కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం రాత్రి కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో పట్టుకున్నారు.

కరీంనగర్‌లో భారీ ఎత్తున పేలుడు పదార్థాల పట్టివేత

14 క్వింటాళ్ల గన్‌పౌడర్‌, 2 వేల డిటోనేటర్లు స్వాధీనం

నక్సల్స్‌ గ్రూపులకు సరఫరా కోసమేనా? పోలీసుల అనుమానం

పట్టుబడిన నిందితుల్లో సిద్దిపేట వాసి, అదుపులో మరికొందరు


కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 25: స్టోన్‌ పాలిష్‌పేరిట బస్తాల్లో ప్యాక్‌ చేసి ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా అక్రమంగా తరలిస్తున్న 14క్వింటాళ్ల గన్‌పౌడర్‌, రెండు వేల డిటోనేటర్లను కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం రాత్రి కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ఎంజే మార్కెట్‌లో షబ్బీర్‌ అనే వ్యక్తి ఈ గన్‌పౌడర్‌ను బస్తాల్లో ప్యాక్‌ చేసి కరీంనగర్‌లోని హెచ్‌ఎంటీ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా సిద్దిపేటకు చెందిన అందె విష్ణువర్ధన్‌రెడ్డికి 10క్వింటాళ్లు(25బ్యాగ్‌లు), కరీంనగర్‌లోని సాయినగర్‌కు చెందిన అనసూరి సతీ్‌షకుమార్‌కు శ్రీరామట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా 4క్వింటాళ్ల(10బ్యాగ్‌లు) గన్‌పౌడర్‌ పంపించాడు. భారీఎత్తున గన్‌పౌడర్‌, డిటోనేటర్లు గుట్టుచప్పుడు కాకుండా ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారంతో కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించగా భారీఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. సతీ్‌షకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతని ఇంటి వద్ద 2వేల డిటోనేటర్లు దొరికాయి. ఈ గన్‌పౌడర్‌, డిటోనేటర్లు హైదరాబాద్‌లోని ఎంజే మార్కెట్‌లోని ఆయుఽధాల విక్రయదుకాణం(ఆర్మ్స్‌అండ్‌ ఆమినేషన్‌షాపు) నిర్వాహకుడు షబ్బీర్‌ నుంచి నిందితులు కొనుగోలు చేశారని విచారణలో వెల్లడైంది. 


 నక్సల్స్‌ కోసమేనా?

హైదరాబాద్‌లోని ఎంజే మార్కెట్‌లో షబ్బీర్‌కు చెందిన ఆయుధ దుకాణంలో అక్రమంగా తయారైన గన్‌పౌడర్‌, డిటోనేటర్లు కరీంనగర్‌కు ట్రాన్స్‌పోర్ట్‌లో తరలించి ఇక్కడి నుంచి తీవ్రవాద సంస్థలకు కొరియర్ల ద్వారా చేరవేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గన్‌పౌడర్‌, డిటోనేటర్లను కొనుగోలు చేసి ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా కరీంనగర్‌కు తీసుకొచ్చినట్లు విష్ణువర్ధన్‌రెడ్డి, సతీ్‌షకుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారంతో ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజర్లతోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌ ఎంజే మార్కెట్‌లోని ఆయుధాల దుకాణం (ఆర్మ్స్‌ అండ్‌ ఆమినేషన్‌షాపు)యజమాని షబ్బీర్‌ను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ఆయుధాల లైసెన్స్‌ కలిగి ఉన్నప్పటికీ అతనికి డిటోనేటర్లు, గన్‌పౌడర్‌ విక్రయించే లైసెన్స్‌ లేదని సమాచారం. పెద్దఎత్తున గన్‌పౌడర్‌, డిటోనేటర్స్‌ తీసుకువస్తున్న ఈ ముఠా ఎక్కడికి తరలిస్తున్నదనే కోణంలో కరీంనగర్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 


 గ్రానైట్‌ క్వారీలకు సరఫరా కోసమా?

కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాల్లోని గ్రానైట్‌ క్వారీలకు ఈ గన్‌పౌడర్‌, డిటోనేటర్లు సరఫరా చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నది. గ్రానైట్‌ క్వారీలకు ప్రత్యేకంగా మందుగుండు నిలువపెట్టుకునేందుకు ప్రత్యేకంగా మాగ్జిన్‌లు ఉంటాయి. అయితే జీరో దందా కింద తక్కువ ధరలకు లభిస్తుండటంతో నిందితులు అక్రమ మార్గంలో ఈ పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-02-26T05:52:57+05:30 IST