ఎండుగంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-20T04:35:20+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న 240 కిలోల ఎండు గంజాయిని పోలీసులు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద స్వాధీనం చేసుకున్నారు.

ఎండుగంజాయి స్వాధీనం
హోతి (కె) గ్రామంలో చెరుకు తోటలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్న పోలీసులు

మునిపల్లి, అక్టోబరు19: అక్రమంగా తరలిస్తున్న 240 కిలోల ఎండు గంజాయిని పోలీసులు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బుధేరా పోలీ్‌సస్టేషన్‌లో సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ వివరాలను వెల్లడించారు. తమిళనాడులోని తేని తాలుకాలోని ముత్తమ్మపాలెంకు చెందిన శేఖర్‌ తన టీఎన్‌49బీహెచ్‌3645 నంబరు గల (బొలేరో మ్యాక్స్‌ట్రక్క్‌) వాహనంలో వస్తువులు, ఇతర సామగ్రి రవాణా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నుంచి ముంబైకి 240కిలోల ఎండు గంజాయిని డ్రైవర్‌ రాజా స్టాలిన్‌తో కలిసి తన వాహనంలో తరలిస్తున్నాడు. సోమవారం రాత్రి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టగా బుధేరా వైపు నుంచి వస్తున్న బొలేరా వాహనాన్ని ఆపి తహసీల్దారు ప్రవీణ్‌కుమార్‌ సమక్షంలో సోదా చేశారు. వాహనంలో పైన ఖాళీ ఫ్రూట్‌ ట్రేలు ఉంచి వాటి కింద 40 ట్రేలలో ప్లాస్టర్‌తో ప్యాక్‌ చేసిన రెండు కిలోల బరువు గల 120 ప్యాకెట్లు లభించాయి. వాటి విలువ రూ.7.20లక్షలు ఉంటుందని,  కేసు నమోదు చేసి డ్రైవర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి వున్నారు.

గంజాయి మొక్కల ధ్వంసం

జహీరాబాద్‌, అక్టోబరు 19 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పరిధిలోని హోతి (కె) గ్రామంలో అక్రమంగా వ్యవసాయ పొలంలో సాగుచేస్తున్న 58 గంజాయి మొక్కలను పోలీసులు మంగళవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌ సీఐ రాజశేఖర్‌ మాట్లాడుతూ గ్రామానికి చెందిన జాన్‌ అనే రైతు తన మూడెకరాల చెరకు తోటలో అంతర పంటగా 58 గంజాయి మొక్కలను సాగుచేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తాము రూరల్‌ ఎస్‌ఐ రవిగౌడ్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది, తహసీల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సమక్షంలో దాడులు నిర్వహించి 58 గంజాయి మొక్కలను ధ్వంసం చేసి, తగులబెట్టామన్నారు. ఆ గంజాయి మొక్కల విలువ రూ.5.80 లక్షలు ఉంటుందన్నారు. గంజాయి సాగుచేసిన జాన్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. ఎక్కడైనా గంజాయిని సాగుచేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ రాజశేఖర్‌ హెచ్చరించారు. 



Updated Date - 2021-10-20T04:35:20+05:30 IST