గోధుమల డిమాండ్‌ను భారత్ వాడుకోవాలి: మోదీ

ABN , First Publish Date - 2022-03-08T22:42:38+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా గోధుమలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, గోధుమల ఎగుమతిలో భారత్‌ అగ్రగామిగా నిలవాలని ప్రధాని మోదీ అన్నారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు అన్నిశాఖలు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

గోధుమల డిమాండ్‌ను భారత్ వాడుకోవాలి: మోదీ

ప్రపంచవ్యాప్తంగా గోధుమలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, గోధుమల ఎగుమతిలో భారత్‌ అగ్రగామిగా నిలవాలని ప్రధాని మోదీ అన్నారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు అన్నిశాఖలు దృష్టి సారించాలని ఆయన సూచించారు. ‘ఫైనాన్సింగ్ ఫర్ గ్రోత్ అండ్ యాస్పిరేషనల్ ఎకానమి’ అనే అంశంపై ఆర్థికశాఖ మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం ఆర్థిక ప్రగతి సాధించే అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే గోధుమల ఎగుమతిలో రష్యా ఉక్రెయిన్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. రష్యా రెండో స్థానంలో, ఉక్రెయిన్ నాలుగో స్థానంలో ఉన్నాయి. అయితే, ఈ రెండు దేశాల మధ్య యుద్ధంతోపాటు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గోధుమలకు డిమాండ్ పెరిగింది. గోధుమ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఈ అవకాశాన్ని వాడుకోవాలని మోదీ సూచించారు.


‘‘భారత్ గోధుమల ఎగుమతిలో కీలక స్థానంలో ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా మన దేశ గోధుమలకు డిమాండ్ పెరిగింది. దీనికి తగ్గట్లుగా నాణ్యమైన గోధుమల్ని సరఫరా చేయడంపై దృష్టిపెట్టాలి. దీంతో క్రమంగా మన మార్కెట్ విస్తరిస్తుంది. మార్కెట్‌లో గోధుమల ఎగుమతిలో మన స్థానం పదిలంగా ఉంటుంది. అయితే, దీనికి ఆర్థిక శాఖ, ఎగుమతులు-దిగుమతుల శాఖ, షిప్పింగ్ ఇండస్ట్రీ వంటివన్నీ కలిసి సమన్వయంతో పనిచేయాలి’’ అని మోదీ సూచించారు. అలాగే దేశం ఆర్థికంగా వృద్ధి చెందేందుకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రపంచవ్యాప్తంగా భారత్ అగ్రగామిగా నిలిచేందుకు అవసరమైన 8 నుంచి 10 కీలక రంగాలపై దృష్టిపెట్టాలని మోదీ అన్నారు. నిర్మాణ రంగం, స్టార్టప్‌లతోపాటు, డ్రోన్స్, స్పేస్‌వంటి రంగాల్లో భారత్ టాప్ 3లో ఉంటుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, దీనికోసం బడ్జెట్‌లో అన్ని చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. 

Updated Date - 2022-03-08T22:42:38+05:30 IST