మళ్లీ సెగ..!

ABN , First Publish Date - 2022-02-01T06:14:29+05:30 IST

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజున కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఆర్థిక సర్వే దేశానికి చక్కని భరోసా ఇచ్చింది. కరోనా రెండవ ఉధృతి ఆర్థికవ్యవస్థను బాధించలేదనీ...

మళ్లీ సెగ..!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజున కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఆర్థిక సర్వే దేశానికి చక్కని భరోసా ఇచ్చింది. కరోనా రెండవ ఉధృతి ఆర్థికవ్యవస్థను బాధించలేదనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 9.2 శాతంగా ఉంటుందని అన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 8 నుంచి 8.5శాతంగా ఉండవచ్చునన్న మరో అంచనా కూడా ధైర్యాన్నిస్తున్నది. విదేశీమారక నిల్వలు, ప్రత్యక్ష పెట్టుబడులు, పెరిగిన ఎగుమతులు ఇత్యాదివి మహమ్మారి కాలంలోనూ ఆర్థికాన్ని నిలబెడుతున్నాయి. 2024 25 ఆర్థిక సంవత్సరానికల్లా ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ సాధించాలన్న లక్ష్యం కూడా ఉన్నందున అది జరగలాంటే మౌలికరంగంలో 1.4 ట్రిలియన్ భారీ పెట్టుబడులు అవసరమని సర్వే గుర్తుచేసింది. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ (ఎన్ఐపీ) నిర్వహిస్తున్న కర్తవ్యాన్ని గుర్తుచేయడంతో పాటు, ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించి ఇటీవలే టాటాల చేతుల్లో పెట్టిన ఘట్టం ప్రభుత్వరంగాన్ని మరింత కుదించి, అన్ని రంగాల్లోనూ ప్రైవేటువ్యక్తుల పాత్ర పెంచాలన్న తమ లక్ష్యానికి ఎంతో ఉత్తేజాన్నిచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంది. తాము ఇచ్చిన 150కోట్ల కరోనా టీకా డోసులు ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవనంలో అద్భుతమైన పాత్ర పోషించాయని చెప్పడమే కాక, టీకాను ఆరోగ్యసంరక్షిణిగానే కాక, స్థూల ఆర్థిక వ్యవస్థ సూచికగా కూడా చూడాలంటోంది ప్రభుత్వం. ఒక్క పర్యాటకం తప్ప మిగతా రంగాలేవీ పెద్దగాదెబ్బతినలేదన్నది సర్వే సారాంశం.


ఆర్థికమంత్రి నిర్మల నేడు జనాకర్షక బడ్జెట్ ప్రవేశపెడతారని కూడా ఆర్థిక నిపుణులు ఊహిస్తున్నారు. బడుగు, వేతన జీవులను సంతృప్తిపరచే చర్యలతో పాటు, ఆదాయపన్ను విషయంలో ఔదార్యాన్ని ప్రదర్శించి మధ్యతరగతినీ, కొన్ని కొత్తపథకాలతో మహిళలనూ, చిన్నవ్యాపారులనూ ఆకర్షించే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ బడ్జెట్ ను అధికారపక్షం తన రాజకీయప్రయోజనాలకు అనుగుణంగా వాడుకొనే అవకాశం ఉన్నదని విపక్షాల అనుమానం. బడ్జెట్ లో ఏముంటుందన్నది అటుంచితే, ఈ ఎన్నికల కాలంలో ఉభయపక్షాలూ రాజకీయంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఈ బడ్జెట్ సమావేశాలను వేదికగా మలుచుకోవడం సహజం. ఇందుకు పెద్దగా కష్టపడనక్కరలేకుండానే పెగాసస్ అంశం మళ్ళీ తెరమీదకు వచ్చి, విపక్షాలకు ఆయుధంగా ఉపకరిస్తున్నది. పెగాసస్ విషయంలో మనపాలకులు ఎంత మొండిగా మాట్లాడుతున్నారో తెలిసిందే. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కథనం వెలుగులో విపక్షాలు చర్చను కోరుతున్నందున, కోర్టు పరిధిలో ఉన్న అంశంపై చర్చ చేయడం కోర్టు ధిక్కారం అవుతుందని అధికారపక్షం వాదిస్తోంది. పెగాసస్ కొనుగోలుకు సంబంధించిన వివరాలు, స్థలకాలాదులతో న్యూయార్క్ టైమ్స్ కొత్త కథనం మరింత స్పష్టతనిచ్చింది. 2017లో మోదీ సందర్శన సందర్భంగా భారత్- ఇజ్రాయెల్ మధ్య కుదిరిన రెండు బిలియన్ డాలర్ల ఆయుధ కొనుగోలు ఒప్పందంలో ఈ స్పైవేర్ అంతర్భాగమని అంటోంది. దానితో పాటు, ఈ ఒప్పందం తరువాత పాలస్తీనా విషయంలో భారతదేశం అప్పటివరకూ అనుసరిస్తున్న వైఖరి విస్పష్టంగా మారిపోయిన అంశాన్ని కూడా ఈ కథనం గుర్తుచేస్తోంది. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనావైపు కాక ఇజ్రాయెల్ పక్షాన నిలబడిన ఘట్టాలను ఉదహరించింది. ఆ పత్రికను ‘సుపారీ మీడియా’ అంటూ పాలకపక్ష నాయకులు నిందించినంత మాత్రాన ప్రయోజనం లేదు. గత ఏడాది జులైలో అంతర్జాతీయ మీడియా సంస్థల కన్సార్షియం వెలుగులోకి తెచ్చిన పలు కీలకమైన అంశాలకు ఇది కొనసాగింపు మాత్రమే. మనదేశంలో రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయనాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, పాత్రికేయులు, ప్రజాఉద్యమకారులు, ఎన్నికల అధికారులు ఇత్యాది మూడువందలమంది ముఖ్యుల ఫోన్లమీద ఈ పెగాసస్ తో నిఘా పెట్టినట్టు ది వైర్  వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. పెగాసస్ స్పైవేర్ ను భారతదేశం కొనుగోలు చేయలేదని విస్పష్టంగా ప్రకటించకపోగా, నిండుసభలో అసత్యాలు చెప్పినందుకూ, సభను తప్పుదోవపట్టించినందుకు విపక్షనేతలు నోటీసులతో నిలదీస్తున్నారు. కొత్త కథనాన్ని కూడా దర్యాప్తులో భాగంగా స్వీకరించాలని సుప్రీంకోర్టులో న్యాయవాది ఎం.ఎల్.శర్మ మరో పిటిషన్ వేశారు. పార్లమెంటు, మంత్రివర్గం అనుమతులు లేకుండా ఈ కొనుగోలు జరిగినందున ఒప్పందాన్ని రద్దుచేయాలని అంటున్నారు. కొన్ని  ఫోన్లలో ఈ స్పైవేర్ వాడినట్టుగా ఆధారాలున్నాయని జస్టిస్ రవీంద్రన్ కమిటీ ముందు సైబర్ నిపుణులు చెప్పారట. న్యాయస్థానంలోనైనా ఈ వ్యవహారంపై నిజం నిగ్గుతేలుతుందని ఆశించాలి.

Updated Date - 2022-02-01T06:14:29+05:30 IST