సీమ మేధావులారా.. ట్రాప్‌‍లో పడొద్దు!

ABN , First Publish Date - 2021-12-29T09:09:46+05:30 IST

ఒక్క హైకోర్టు పెట్టినంత మాత్రాన రాయలసీమ అభివృద్ధి చెందిపోతుందా? నీళ్లు పొంగి పారి, నేల సశ్యశ్యామలం అవుతుందా? వజ్ర వైఢూర్యాలు రాశులుగా పోసి అమ్మే పరిస్థితులు వస్తాయా...

సీమ మేధావులారా.. ట్రాప్‌‍లో పడొద్దు!

ఒక్క హైకోర్టు పెట్టినంత మాత్రాన రాయలసీమ అభివృద్ధి చెందిపోతుందా? నీళ్లు పొంగి పారి, నేల సశ్యశ్యామలం అవుతుందా? వజ్ర వైఢూర్యాలు రాశులుగా పోసి అమ్మే పరిస్థితులు వస్తాయా? సీమ ప్రజలను మరోసారి దగా చేసే ప్రయ త్నాలు జరగుతున్నాయి. సచివాలయాన్ని విశాఖలో పెట్టడం వల్ల సీమ ప్రజలు ఎదుర్కోవాల్సిన సమస్యలను ప్రస్తావించకుండా వికేం ద్రీకరణ డిమాండును గుడ్డిగా తెర మీదకు తేవడం అన్యాయం. 


చరిత్ర నుంచి సరైన పాఠాలు నేర్చుకోకుండా పాత తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ప్రాంతీయ అసమానతలకు గురవుతున్న రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతంలో కూడిన రాష్ట్రంలో సమగ్రాభివృద్ధికి విభజించి పాలించు అనే బ్రిటిష్‌ పంథాను అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు నెరవేర్చడానికి ఇంతవరకు సరైన ప్రారంభం జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎప్పుడూ రాయలసీమ అభివృద్ధికి ఒక నమూనాను అనుసరించలేదు. ఈ అసం తృప్తి రాయలసీమ ప్రాంతంలో జ్వలిస్తూనే ఉన్నది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి మొదటి భాషాప్రయుక్త ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతం రాష్ట్ర రాజధానికి ఆతిథ్యమిచ్చిందనే చారిత్రక వాస్తవం నేపథ్యంలో– మోసపోయాం అనే భావన సీమ ప్రజలను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బాధతో కూడిన ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. అయితే వీటిని తరచూ తప్పుదారిలోకి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక పక్క అమరావతి రాజధాని పోరాటం, మరో పక్క మూడు రాజదానుల నినాదం ఘర్షణాత్మక వైఖరిని తీసుకుంటున్న దశలో రాయలసీమ అభివృద్ధి గురించిన చర్చ జనంలోకి వెళ్తోంది. 


రాయలసీమ ప్రాంతం అనేకమంది ముఖ్యమంత్రులతో సహా అత్యధిక సంఖ్యలో రాజకీయ నాయకులను అందించినప్పటికీ వెనుకబడ్డ ప్రాంతం గానే మిగిలిపోయింది. ముఖ్యమంత్రి పదవి అన్నది రాయలసీమ అభివృద్ధి పాలిట శాపంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్‌ను పాలించిన ముఖ్య మంత్రులలో రాయలసీమకు చెందినవారు తాము చాలా ఉదారులం అని చాటుకునేందుకే ఎక్కువ తాపత్రయపడ్డారు. ఇతర ప్రాంతాల అభివృద్ధి మీద శ్రద్ధపెట్టి, రాయలసీమను పక్కన పెట్టేశారు.


రాయలసీమ వెనుకబాటుకు భౌగోళిక కారణాలకన్నా రాజకీయ నిర్లక్ష్యమే ఎక్కువ. ప్రకృతి ప్రసాదించిన విలువైన ఖనిజాలు బారైట్స్‌, ఇనుము, బంగారం, వజ్రాలు, సున్నపురాయి, ఆస్బెస్టాస్‌, క్వార్‌ట్జ్‌, మైకా, రాగి, చైనా క్లే, గ్రానైట్‌, డోలమైట్‌, యురేనియం వంటివి ఉన్న ప్రాంతం రాయలసీమ. అత్యంత విలువైన ఎర్ర చందనం విస్తారంగా ఉన్న ప్రాంతం కూడా. ఖనిజాల సమృద్ధి లభ్యత దృష్ట్యా ఈ ప్రాంతంలో భారీ పారిశ్రామికీకరణ జరిగి ఉండాలి, కానీ జరగలేదు. కనీసం పదివేల మందికి ఉపాధి కల్పించగల పరిశ్రమ ఒక్కటి కూడా ఇప్పటికీ ఈ ప్రాంతంలో లేదు. అభివృద్ధికి ప్రధాన ఇనపుట్‌గా కనిపించే పారిశ్రామికీకరణను ప్రోత్సహించడానికి రైలు కనెక్టివిటీ చాలా ముఖ్యం. కానీ అది పూర్తి స్థాయిలో రాయలసీమలో లేదు. ఆ దిశగా జరిగిన ప్రయత్నాలూ లేవు. స్వాతంత్య్రం తర్వాత నికర జలాల కేటాయింపు లేక, నీటిపారుదల సంభావ్యతలో గణనీయమైన అభివృద్ధిని చూడలేదు. ఈ ప్రాంత నీటి అవసరాలను సహేతుకమైన స్థాయిలో తీర్చే పెద్ద నీటిపారుదల ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రాంతమిది. నాగార్జునసాగర్‌తో పాటు సిద్దేశ్వరం ప్రాజెక్టు కూడా చేపట్టి ఉంటే ఈ ప్రాంతం ఇంతటి కరువు పరిస్థితులను చవిచూసేది కాదు. సీమలో ముఖ్యమైన ప్రాజెక్టులైన గాలేరు నగరి, హంద్రీ పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడం వల్ల రాయలసీమ ప్రాంతానికి గరిష్ఠ లాభం చేకూరుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో రాయలసీమ జనాభా 30శాతం, భౌగోళిక విస్తీర్ణంలో ఈ ప్రాంతానిది 40శాతం. కానీ బడ్జెట్‌ కేటాయింపులు ఈ దామాషాల ప్రకారం ఎన్నడూ ఉండవు. ఈ అన్యాయాలపై గొంతు విప్పాల్సిన సీమ నేతల సుదీర్ఘ నిశ్శబ్దానికి కారణాలు ఏమిటో అంతుపట్టవు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్న మాటల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. అమరావతి రాజధాని కోసం పాదయాత్రను వ్యతిరేకించడంపై దృష్టిపెట్టడం కాదు. రాయలసీమ అభివృద్ధికి అవరోధంగా ఉన్న అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అభివృద్ధికి ఏం చేయాలో చైతన్యపరిచి ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచాలి.  


రాయలసీమ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాల్సిన అంశాలి ఇవి: 1. పల్వరైజింగ్‌ యూనిట్లు, రసాయన పరిశ్రమల స్థాపనకు ఉపయోగపడే బారైట్స్‌ ఈ ప్రాంతం 70శాతా నికి పైగా ఉంది. 2. ఎర్రచందనాన్ని ఆధారం చేసుకునే పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. దీని వల్ల విలువైన వనరు అక్రమ రవాణాను కూడా నిరోధించవచ్చు. 3. తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపాంతరం చెందినందున ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనే బుల్డ్‌ సర్వీసెస్‌ అభివృద్ధికి అనువైన ప్రాంతం ఇది. 4. కడప, అనంతపురం జిల్లాలకు పవన విద్యుత్ సామర్థ్యం అపారంగా ఉంది. 5. టమోటా, బొప్పాయి, అరటి, మామిడి మొదలైన పంటలు విస్తారంగా పండుతున్న ఈ ప్రాంతంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు అవకాశం చాలా ఉంది. 5. ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో వేలాది ఎకరాల భూ ములు అన్యాక్రాంతమయ్యాయి. వీటిలో రాయలసీమ యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ఎవ్వరికీ తెలియని రహస్యం. రాయలసీమ ప్రాంతంలో స్థాపించే పరిశ్రమల్లో ఇక్కడి యువతకు ఎక్కువగా ఉద్యాగాలు ఇచ్చినపుడే, నిరుద్యోగాన్ని కొంతైనా తగ్గించగలం. 6. కడప షుగర్‌ ఫ్యాక్టరీ, గుంతకల్‌ స్పిన్నింగ్‌ మిల్లు, కర్నూలు కార్బైడ్‌, మన్న వరం ప్రాజెక్టులను పట్టాల మీదకు ఎక్కిం చాలి. 7. కడప జిల్లాలో ఉక్కు కర్మాగార నిర్మాణం సంగతి తేల్చాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సినవి చాలానే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థల లాగే రాయలసీమకు కూడా: రాయలసీమ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌, రాయలసీమ రీజియన్ కోసం నాన్ లాప్సబుల్ ఫండ్, రాయలసీమ కౌన్సిల్‌, రాయలసీమ అభివృద్ధి ఆర్థిక సంస్థ, రాయలసీమ రీజినల్‌ అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్ లిమిటెడ్, రాయలసీమ మైనింగ్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌, రాయలసీమ చేనేత హస్తకళల అభివృద్ధి సంస్థ వంటివి ఇవ్వాలి.


వీటి కోసం పోరాడకుండా, ఇవి సాధించేలా ప్రభుత్వం మీదా, పార్టీల మీదా ఒత్తిడి తీసుకురాకుండా, రాజధాని ట్రాప్‌లో రాయలసీమ మేధావులు పడిపోవడం తగదు.

దొడ్డారెడ్డి రాంభూపాల్‌ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి

Updated Date - 2021-12-29T09:09:46+05:30 IST