సీమ రుచులు

ABN , First Publish Date - 2020-09-12T05:30:00+05:30 IST

సీమ రుచులు

సీమ రుచులు

రాయలసీమ అనగానే రాగి ముద్ద గుర్తొస్తుంది.  సీమ వాసులే కాకుండా తెలుగు నాట అందరూ రాగి ముద్ద రుచిని ఆస్వాదిస్తారు. రాగులతో రాగి ముద్ద ఒక్కటే కాకుండా రాగి లడ్డు, అంబలి, రాగి సంగటి, రాగి రొట్టె, ముసుండలు... 

వంటివి కూడా తయారు చేసుకోవచ్చు. మీరూ ఆ రుచులను ట్రై చేయండి.


రాగి లడ్డు


కావలసినవి

రాగి పిండి - ఒక కప్పు, పంచదార లేదా బెల్లం - పావు కప్పు, నెయ్యి - ఒక కప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌.


తయారీ

స్టవ్‌పై పాన్‌ పెట్టి ఒక టీస్పూన్‌ నెయ్యి వేయాలి. నెయ్యి కాస్త వేడి అయ్యాక రాగి పిండి వేసి వేగించాలి.

వేగించుకున్న రాగి పిండిని ఒక పాత్రలోకి తీసుకుని, అందులో యాలకుల పొడి, పంచదార, నెయ్యి వేసి ఉండలు లేకుండా కలపాలి.

అవసరమైన మేర నెయ్యి కలుపుతూ లడ్డూలు తయారుచేసుకోవాలి. ఈ లడ్డూలు పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి.


రాగి రొట్టె


కావలసినవి

రాగి పిండి - ఒక కప్పు, మునగాకు - అరకప్పు, వెల్లుల్లి - రెండు రెబ్బలు, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, నువ్వులు - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నీళ్లు - తగినన్ని.


తయారీ

ఒక పాత్రలో రాగి పిండి తీసుకుని అందులో మునగాకు, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి.

ప్లాస్టిక్‌ కవర్‌పై నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్నచిన్న బాల్స్‌లా చేసుకోవాలి.

తరువాత ఒక్కోదాన్ని ఒత్తుకుంటూ రొట్టెలా చేసుకోవాలి. 

స్టవ్‌పై పెనం పెట్టి కొద్దిగా నూనె వేసుకుంటూ రొట్టెలు కాల్చాలి. 

వీటిని చట్నీతో లేదా పెరుగుతో తింటే రుచిగా ఉంటాయి.


రాగి సంగటి


కావలసినవి

రాగి పిండి - ఒక కప్పు, అన్నం - రెండు కప్పులు - నీళ్లు - నాలుగు కప్పులు.


తయారీ

మందంగా ఉన్న పాత్రను స్టవ్‌పై పెట్టి నీళ్లు పోసి వేడి చేయాలి.

తరువాత అందులో అన్నం వేసి ఉండలు లేకుండా కలపాలి.

ఇప్పుడు రాగి పిండిని వేసి మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి.

చిన్నమంటపై ఉడికిస్తూ నెమ్మదిగా కలపాలి.

గుండ్రంగా ఉన్న చిన్న పాత్రను తీసుకొని అందులో ఈ మిశ్రమం వేయాలి. ఇలా చేయడం వల్ల రాగి సంగటి లడ్డూ రూపంలో వస్తుంది.

ఈ రాగి సంగటి మటన్‌కర్రీ, చికెన్‌ కర్రీతో తీసుకుంటే రుచిగా ఉంటుంది.


ముసుండలు

కావలసినవి

రాగులు - అరకప్పు, సజ్జలు - అరకప్పు, పిండి - ఒక కప్పు, శొంఠి పొడి - పావు టీస్పూన్‌, గసగసాలు - రెండు టీస్పూన్లు, యాలకుల పొడి - చిటికెడు, బెల్లం పొడి - రెండు కప్పులు, నీళ్లు - ఒక కప్పు, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా. 


తయారీ

ఒక పాత్రలో బెల్లం తీసుకుని అందులో రాగులు, సజ్జలు, పిండి, శొంఠిపొడి, గసగసాలు, యాలకులపొడి వేసి, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. 

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ బాల్స్‌ మాదిరిగా చేసుకుంటూ నూనెలో వేయాలి. 

ముదురు గోధుమ రంగులోకి మారే వరకు వేగించుకుని తీసుకోవాలి. ఇవి పది రోజుల వరకు నిల్వ ఉంటాయి.



అంబలి

కావలసినవి

రాగి సంగటి - ఒక ముద్ద, నీళ్లు - రెండు కప్పులు, పెరుగు - రెండు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ

రాగి సంగటి ముద్దను రాత్రి తయారు చేసి పెట్టుకోవాలి.

ఉదయాన్నే ఒక పాత్రలో రాగి సంగటి ముద్దను సగం తీసుకొని అందులో పెరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి. అవసరమైన మేర నీళ్లు పోసి కలపాలి.

దీన్ని ఒక గ్లాసులోకి పోసుకుని ఉల్లిపాయలతో సర్వ్‌ చేసుకోవాలి. 


రాజేశ్వరి పూతలపట్టు

rppattu777@gmail.com

Updated Date - 2020-09-12T05:30:00+05:30 IST