లాలూచీ కుస్తీతో సీమ ఎడారే!

ABN , First Publish Date - 2022-05-17T06:26:08+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు సరిగా లేవని, విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తొలుత తుఫానుగా మొదలైనా తుదకు టీ కప్పులో తుఫానుగా ముగిశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ...

లాలూచీ కుస్తీతో సీమ ఎడారే!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు సరిగా లేవని, విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తొలుత తుఫానుగా మొదలైనా తుదకు టీ కప్పులో తుఫానుగా ముగిశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తమ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు పదిలంగా ఉండాలని భావించినందున కాబోలు, ఆ వ్యాఖ్యలు తాను యథాలాపంగా చేశానని మంత్రి కేటీఆర్ ఆ మరుసటి రోజునే మాట మార్చారు. అంతకు ముందే ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాము ఈ అంశాన్ని రాజకీయం చేయదలుచుకోలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసులోని మాట బయట పెట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సామరస్యం ఉంటేనే అంతర్ రాష్ట్ర జల వివాదాలతో ముడిపడిన తమ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభించుతుందని రాయలసీమ ప్రజలు భావిస్తున్నారు. నిజానికి సీమతో పాటు దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల పురోగతి ముఖ్యమంత్రుల మధ్య సామరస్యంతో ముడిపడి వుంది. అయితే వ్యక్తి గత సత్సంబంధాలు ఎప్పుడూ దెబ్బతినకున్నా ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో మాత్రం ఉభయ ముఖ్యమంత్రులూ సంప్రతింపులకు తావు లేకుండా కృష్ణా నదీ జలాల వివాదాన్ని తార స్థాయికి చేర్చారు! ఇందుకు ఎవరి అవసరాలు వారికున్నాయి మరి.


ఆంధ్రప్రదేశ్‌తో తగాదా పెంచి సెంటిమెంట్‌ను పెంచి కాపాడుకోవలసిన అవసరం తెలంగాణ ముఖ్యమంత్రికి ఉండగా ఎపి ముఖ్యమంత్రికి నవ రత్నాలు తప్ప సాగునీటి ప్రాజెక్టులకు నిధులు వ్యయం చేయలేని దుస్థితి దాపురించింది. అంతర్ రాష్ట్ర జల వివాదం దీనికి కవచమౌతోంది. కృష్ణా నదీ జలాల కోసమే ముఖ్యమంత్రులు ఇరువురూ తగాదా పడటం నిజమైతే ఎగువ రాష్ట్రాలతో గల వివాదాలను జల దోపిడీని ఎందుకు పట్టించుకోవడం లేదు? కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై చేయించుకొనేందుకు జరుగుతున్న యత్నాలపై ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు రాజకీయంగా దృష్టి పెట్టడం లేదు. ఈ తీర్పు నోటిఫై జరిగితే ఆల్మట్టి ఎత్తు 525 మీటర్లకు పెంచుకోనే అవకాశం లభిస్తుంది. ఉమ్మడి ఎపికి నికరంగా 38 టియంసిలు దక్కితే కర్ణాటకకు 173 టియంసిలు దఖలు పడతాయి. ఇప్పుడున్న కృష్ణ నీటిలో 285 టియంసిలు గల్లంతౌతాయి.


ఇదిలా వుండగా ప్రతిపాదనలో ఉన్న తుంగభద్ర ఎగువ సమాంతర కాలువతో ముడిపడి ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక జాతీయ హోదా సాధించింది. అధికారుల స్థాయిలో ఎపి అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. సీమ ప్రజల ప్రయోజనాల కోసం ఏ ఒక్క ఎమ్మెల్యే లేదా మంత్రి రాజకీయంగా నిరసన తెలుపలేదు. ఎమ్మెల్యేలకు అక్రమ రాబడులు, పదవుల యావ తప్ప ఆ ఊసే పట్టలేదు. దక్షిణ భారతదేశంలో పోలవరం తర్వాత అప్పర్ భద్ర రెండవ జాతీయ ప్రాజెక్టుగా ఉంది.


మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఇరు ప్రాంతాల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుండగానే కొత్తగా మంత్రి పదవి చేపట్టిన రోజా సకుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట ఘనమైన ఆతిథ్యం స్వీకరించారు. ముఖ్యమంత్రి అనుమతి లేనిదే ఇది సంభవమా అనే చర్చ సీమలో సాగుతోంది. 2019లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంచీపురంలో దైవ దర్శనం చేసుకొని వస్తూ చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి రోజా (అప్పుడు మంత్రి కాదు) ఇంట ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పిన బడాయి కబుర్లు మంత్రి రోజా మరచిపోయారేమో గాని ఇది సీమ ప్రజలకు పుండుపై కారం రాసినట్లుగా మిగిలింది.


ఇది వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్‌లో టిఆర్ఎస్ నేత ఇంట పెళ్లి సందర్భంగా కెసిఆర్‌తో ప్రత్యేకంగా విందు ఆరగించడమూ సీమ ప్రజలతో పాటు దక్షిణ తెలంగాణ ప్రజలు ఇంకా మరచిపోలేదు. ప్రజాస్వామ్యంలో నేతల కలయికలను ఎవరూ తప్పు పట్టనవసరం లేకున్నా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వీరు వ్యక్తిగతంగా కొనసాగించుతున్న స్నేహ సౌభ్రాతృత్వాలు రెండు రాష్ట్రాల మెట్ట ప్రాంతాల్లో ప్రతిష్టంభనలో పడిన సాగునీటి ప్రాజెక్టుల వివాదాల ముగింపునకు ఉపయోగించక పోవడమే నేటి మహా విషాదం.


నాణేనికి ఇది ఒకవేపు అయితే మరోవేపు ఆసక్తికరంగా ఉంటోంది. ఈ మూడేళ్ల కాలంలోని పరిణామాలు పరిశీలించితే ఇద్దరు ముఖ్యమంత్రులు అలాయ్ బలాయ్ ఆడారు. ఎడ మొహం పెడ మొహంగా వున్నారు. అవసరమైనపుడు ప్రత్యేకంగా విందులు ఆరగిస్తున్నారు. వ్యక్తిగత సంబంధాలు బ్రేక్ పడే సమయంలో రాజకీయం చేయదల్చుకోలేదని రాజీ పడుతున్నారు. అయితే సాగునీటి వివాదాలొచ్చేసరికి ప్రాజెక్టులను ప్రతిష్టంభనలో పడేస్తున్నారు. టిడిపి హయాంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ల మధ్య సాగిన విమర్శలు ఫోన్ ట్యాపింగ్ కేసుల కథాకమామీషు ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ఆ అయిదేళ్ల కాలంలో ఏ రాష్ట్రమూ పథకాల నిర్మాణం నిలుపుదలకు కోర్టుల తలుపులు తట్టిన సందర్భం లేదు.


అయితే ‘బోర్డులు లేవు. బేసిన్‌లు లేవు ట్రిబ్యునల్స్ అసలు వద్దే వద్దు. మేమిద్దరమే ముద్దు అని కౌగిలింతల రాజకీయాలు’ సాగించిన కేసీఆర్–జగన్ హయాంలో కోర్టు కేసులు దాపురించాయి. ముఖ్యమంత్రుల చేతులకు మట్టి అంటకుండా అటు దక్షిణ తెలంగాణలోనూ ఇటు రాయలసీమలోని సాగునీటి పథకాల నిర్మాణాన్ని కోర్టు కేసుల కారణంగా అటకెక్కించారు. వాస్తవంలో ఎవరి వద్ద పైసలు లేవు కాబట్టి ఏ ఒక్కరూ పైసా ఖర్చు చేసే అవకాశం లేకుండా చేసుకున్నారు. తమ తప్పేమీ లేదని కోర్టు తీర్పులతో మిన్నకున్నామని ఇరువురు ముఖ్యమంత్రులు నమ్మ బలికే పరిస్థితులు కల్పించుకొన్నారు. ఇదంతా ఇద్దరూ కలసి ఆడే నాటకమని సీమలో నేడు చాల మంది భావిస్తున్నారు.


వైకాపా ప్రభుత్వం అవలంబిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాల ఫలితంగా మెట్ట ప్రాంతమైన సీమ సాగునీటి ప్రాజెక్టులన్నీ అటకెక్కాయి. సీమ ప్రాంత సముద్ధరణ పేరు చెప్పి చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విస్తరణ పనులు అంతర్ రాష్ట్ర జల వివాదంతో బ్రేక్ పడి రెండేళ్లయింది. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ కొట్టేసిన చందమైనదని సీమ ప్రజలు భావిస్తున్నారు. తన తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో చూపిన చొరవ చూచి భ్రమపడి ఓట్లు గుమ్మరించితే నగదు బదిలీలతో సరిపెట్టడాన్ని సీమ ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. చిరకాలంగా సాగుతున్న రాయలసీమ అస్తిత్వ పోరాటానికి ప్రధానమైన ఇంధనం నీళ్లు – సాగునీటి ప్రాజెక్టులు. శ్రీ బాగ్ ఒడంబడికలో కూడా నీళ్ల కోసం ఆనాటి పెద్దలు ప్రాధాన్యత ఇచ్చారు. తుదకు సాగునీటి అంశం అటుంచగా తాగునీటికి ఈ రోజుకు వ్యవసాయ బావులపై ఆధారపడే గ్రామాలు సీమలో అసంఖ్యాకంగా వున్నాయి.


తుదకు ముఖ్యమంత్రిగా తను పరిపాలనా అనుమతులు ఇచ్చిన పథకాలకు నిధులు దక్కలేదు. తుదకు కృష్ణ యాజమాన్య బోర్డు కర్నూలుకు కాకుండా పోవడంతో ఇంతకాలం వైకాపా రెచ్చగొట్టిన సెంటిమెంట్ ఇప్పుడు రివర్స్ కొడుతోంది. ఈ మూడేళ్ల కాలంలో లక్షా 40 వేల కోట్ల రూపాయల ఉచితాలు పంచినట్లు చెబుతున్న ముఖ్యమంత్రిని, మున్ముందు ఇందులో పాతిక వేల కోట్లు తమ సాగునీటి ప్రాజెక్టులపై వ్యయం చేసి వుంటే తమ తల రాతలు కొంత మేరకైనా మారి ఉండేవికావా అని 52కి గాను 49 మంది ఎమ్మెల్యేలు గెలిపించింది నగదు బదిలీల కోసం కాదని సీమ ప్రజలు ప్రశ్నించే రోజు ఎంతో దూరంలో లేదు. నగదు బదిలీల కోసం కాదు గదా అని సీమ ఓటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.


మండు వేసవిలో వందలాది మంది రైతుల పాదయాత్ర నడుమ 2016 మే 31న తీవ్ర ఉద్రిక్తతల మధ్య సిద్దేశ్వరం అలుగుకు ప్రజా పునాది వేయబడింది. యాదృచ్ఛికంగా నేడు తారసపడిన ఆ సంఘటన సీమలో రెండవ దశ సాగునీటి ప్రాజెక్టుల ఉద్యమానికి ఊపిరిలూదుతోంది. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం వెంటనే చేపట్టాలని సంగమేశ్వరం వద్ద ఈ నెల 31వ తేదీన జల దీక్షకు సీమ సాగు నీటి సాధన సమితి ఇచ్చిన పిలుపుకు సీమ జిల్లాల్లో మంచి స్పందన రావడమే కాకుండా పెండింగ్ ప్రాజెక్టులపై డిమాండ్‌లు పెరుగుతున్నాయి. కొన్ని ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి యువజన సంఘాలు వివిధ రూపాల్లో ప్రచారం ముమ్మరం చేయడం శుభ సూచకం. 

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2022-05-17T06:26:08+05:30 IST