ఆశలన్నీ విత్తనంపైనే!

ABN , First Publish Date - 2020-12-06T04:26:53+05:30 IST

ప్రకృతి ఈ ఏడాది రైతు గుండెల్లో గంపెడాశలు నింపింది.

ఆశలన్నీ విత్తనంపైనే!

వరినాట్లను ముంచేసిన ‘నివర్‌’

మళ్లీ నాట్లకు విత్తన కొరత

80 శాతం సబ్సిడీపై ఇస్తామన్న ప్రభుత్వం

17 వేల క్వింటాళ్లు అవసరమని వ్యవసాయ శాఖ ఇండెంట్‌!

ఇప్పటికే అదునుదాటుతోంది.. పంపిణీ ఎప్పటికో!?


నెల్లూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రకృతి ఈ ఏడాది రైతు గుండెల్లో గంపెడాశలు నింపింది. ఇటు జిల్లాలో, అటు పెన్నా ఎగువున వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఇక పూర్తిస్థాయి విస్తీర్ణంలో పంట సాగు చేసుకోవచ్చని రైతులు సంతోషించారు. అయితే, వారి ఆశలు ఫలించకముందే ప్రకృతి నిట్ట నిలువునా ముంచేసింది. రబీ సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు చల్లుకొని నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల నాట్లు కూడా వేసేశారు. అయితే, నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో అతిభారీ వర్షాలు, వరదలతో లక్షల ఎకరాల్లో నారుమళ్లు, నాట్లు నీట మునిగాయి. మునక నుంచి బయటపడ్డాక కొంత వరకు మాత్రమే పనికిరాగా మిగతా పాడైపోయింది. ఈ రైతులంతా మళ్లీ నార్లు పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పటికే ఎకరాకు దుక్కులు, నార్లు, నాట్లతో రూ.5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి సాగు మొదలు పెట్టాల్సి ఉండటంతో ఈ ఏడాది పెట్టుబడి భారీగా పెరిగే అవకాశముంది.  మళ్లీ విత్తనాలు చల్లుకుందామనుకుంటే మార్కెట్లో విత్తన కొరత నెలకొంది. ధరలూ పెరిగిపోయాయి. బీపీటీ పంట ఎక్కువ కాలం కావడంతో ఇప్పుడు వేయడం మంచిది కాదు. దీంతో రైతులు తక్కువ కాలం పంటైన ఆర్‌ఎన్‌ఆర్‌, నెల్లూరు జిలకర్లనే సాగు చేయాలి. గతంలో 25 కేజీల ఆర్‌ఎన్‌ఆర్‌ విత్తనాల బస్తా రూ.900 ఉండగా ఇప్పుడు రూ.200 వరకు అధికంగా అమ్ముతున్నారు. దీంతో ఇప్పటికే  ఆర్థికంగా చితికిపోయిన రైతులకు ఇది మరింత భారంగా మారుతోంది.


సబ్సిడీతో ప్రభుత్వం విత్తనాలు


తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న నారుమళ్లను గుర్తించి ఆ రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే జిల్లాలో వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం 44 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. అంతకుమించి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ రైతులంతా ప్రభుత్వం ఇస్తామన్న విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15వ తేదీలోపు  నష్టాన్ని అంచనా వేయాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ నెలాఖరులోపు రైతులకు నష్ట పరిహారాన్ని ఇస్తామని ప్రకటించింది. అయితే సబ్సిడీ విత్తనాలపై వ్యవసాయ శాఖ అధికారులకు కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. తుఫాను కారణంగా దెబ్బతిన్న నష్టానికిగానూ జిల్లాకు 17 వేల క్వింటాళ ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు ఏపీసీడ్స్‌కు ఇండెంట్‌ పెట్టారు. ఇందులో నెల్లూరు జిలకర 7 వేల క్వింటాళ్లు, బీపీటీ 1500 క్వింటాళ్లు, ఆర్‌ఎన్‌ఆర్‌ 7500 క్వింటాళ్లు ఉంది. ఇక జిల్లాలో 10 వేల క్వింటాళ్ల నెల్లూరు జిలకర అందుబాటులో ఉంది. ఈ విత్తనాలు ఎప్పటికి జిల్లాకు చేరుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అదును దాటిపోతోంది. ఇప్పటికిప్పుడు విత్తనాలు పోసుకున్నా నెలాఖరుకు నాట్లు వేస్తారు. ఏప్రిల్‌లో కోతలు వస్తాయి. అప్పటికే చాలా ఆలస్యమవుతుంది. ఈ ప్రభావం దిగుబడి, మార్కెట్‌పై ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రభుత్వం విత్తనాలు అందించడం ఆలస్యం చేస్తే ఈ దఫా పంట మరింత ఆలస్యమవుతుంది. ఆ ప్రభావం రైతులపై కోలుకోలేని విధంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2020-12-06T04:26:53+05:30 IST