Abn logo
Jun 7 2020 @ 05:43AM

సీడ్‌ విజిలెన్స్‌!

నకిలీ విత్తనాల కోసం రంగంలోకి పోలీసులు 

వ్యవసాయాధికారులతో కలిసి యాక్షన్‌ప్లాన్‌ 

ఇప్పటికే భారీ ఎత్తున నకిలీ విత్తనాల పట్టివేత 

మారుమూల పల్లెల్లో దందా కోసం ప్రయత్నాలు 


నిర్మల్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి )  : నిర్మల్‌ జిల్లాలో నకిలీ విత్తనాల విఫత్తు అటు పోలీసు, ఇటు వ్యవసాయశాఖకు సవాలుగా మారుతుండగా వాటిని ఉపయోగించుకనే అన్నదాతకు శాపమవుతోంది. అయితే నకిలీ విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా విక్రయించకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన కఠిన ఆదేశాల కారణంగా జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమవుతోంది. దీని కోసం గాను నకిలీ విత్తనాలు జిల్లాలో ఎక్కడ కూడా అమ్మకుండా చూడాలన్నదే స్థానిక అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. సర్కారు ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ముందుకు కదులుతోంది. దీని కోసం గాను సీడ్‌ విజిలెన్స్‌ పేరిటా మండలాల వారీగా నిఘా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో పోలీసుశాఖ ఓ అడుగు ముందుకు వేసి నకిలీలను వెంటాడే పనిలో ఉన్నారు.


అయినప్పటికీ సంబంధిత అధికారులు అప్రమత్తంగానే వ్యవహరిస్తూ నకిలీల ఆటకట్టుకు ప్రయత్నిస్తున్నారు. నకిలీ విత్తనాలను విక్రయించకుండా చేసేందుకు, అలాగే వాటిని ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి రాకుండా చూసుకోవడం, ఇప్పటికే సేకరించిన నకిలీ విత్తనాల గిడ్డంగులపై దృష్టి కేంద్రీకరించడం లాంటి వాటి కోసం యాక్షన్‌ప్లాన్‌ మొదలయ్యింది. నకిలీ విత్తనాల వ్యాపారులు మారుమూల పల్లెలను లక్ష్యంగా చేసుకొని అక్కడ ఢంఫ్‌లను ఏర్పాటు చేయడం, అలాగే వాహనాల్లో పల్లె ప్రాంతాలకు వాటిని చేరవేస్తుండడం లాంటి పరిణామాలు యంత్రాంగానికి సవాలు విసురుతున్నాయి.


ఇలా మండల స్థాయి విజిలెన్స్‌ కమిటీలు జిల్లా స్థాయిలో ఇటు ఎస్పీ శశిధర్‌ రాజు, అటు కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, జాయిం ట్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావుల ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. ఇదిలా ఉండగా పోలీసులు ఇప్పటికే ఖానాపూర్‌, పెంబిల్లో లక్షల రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోగా, మరో రూ. 1.50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. అలాగే కాలం చెల్లిన విత్తనాలు, పురుగు మందులను కూడా వ్యాపారుల సిండికేట్‌ రైతులకు అంటగడుతోంది. కూచన్‌పల్లిలో శుక్రవారం రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి ఓ వ్యాపారి ఇంట్లో దాచి ఉంచిన గడ్డి మందు గ్లైఫోసెట్‌ను పట్టుకున్నారు. వరుసగా రెండు రోజుల్లోనే పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు, నకిలీపురుగు మందులు పట్టుౄకోవడం చర్చకు తావిస్తోంది. విత్తన వ్యాపారుల సిండికేట్‌ ఇప్పటికే పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను జిల్లాకు చేర్చినట్లు చెబుతున్నారు. మారుమూల పల్లెల్లోని గోదాముల్లో వీటిని భద్రపరుస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


ఎస్పీ ఆధ్వర్యంలో నిఘా

కాగా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహారిస్తుండడంతో ఇక్కడి జిల్లా పోలీసు యంత్రాం గం అప్రమత్తమయ్యింది. జిల్లాలో ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేకస్క్వార్డ్‌లు, విజిలెన్స్‌ విభాగాలు ఏర్పాటు అయ్యాయి. పోలీసు అధికారులు, మండల వ్యవసాయాధికారులతో మండలాల వారిగా నిఘాను విస్తృతం చేస్తూ తనిఖీలు నిర్వహించనున్నారు. దీని కోసం గాను విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలకు సంబందించిన స్టాక్‌ వివరాలను, వార్షిక క్రయ విక్రయాలతో పాటు గిడ్డంగులను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు, పురుగు మందులను విక్రయించవద్దంటూ సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఎస్పీ ఆదేశించారు. దీంతో ప్రస్తుతం నకిలీలకోసం వేట మొదలైంది. జిల్లావ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం కాబోతుండడంతో నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై చర్య లు తప్పవంటూ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. 


సరిహద్దుల నుంచే అక్రమ దిగుమతులు

నిర్మల్‌ జిల్లాలో 1.70లక్షల ఎకరాల్లో పత్తిపంటను సాగు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గత సంవత్సరం కన్నా పత్తిసాగు విస్తీర్ణం పెరగడంతో విత్తనాలకు భారీగా డిమాండ్‌ ఏర్పడుతోంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అక్ర మ దందాకు తెర లేపారు. సరిహద్దులో ఉన్న మహరాష్ట్రలోని నాందేడ్‌, పర్బని, జాల్నా, సిర్‌పల్లిలను నుంచి ఇప్పటికే ఈ నకిలీ వ్యాపారుల సిండికేట్‌ నకిలీ విత్తనాలను భారీ ఎత్తున జిల్లాలోకి తరలించారన్న ఫిర్యాదులున్నాయి. ఇలా తరలించిన నకిలీ విత్తనాలను మారుమూల పల్లె ప్రాంతాల్లో భద్రపరుస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. సరిహద్దులపై గతంలో మాదిరిగా కాకుండా నిఘా తగ్గడం, రవాణా మార్గం ఏర్పడడంతో ఈ నకిలీ విత్తనాలను జిల్లాలోకి తీసుకురావడం సులభమైందంటున్నారు. పత్తిసాగు లక్ష్యం భారీగా ఉన్న క్రమంలోనే ఈ వ్యాపారుల సిండికేట్‌ రైతుల అవసరాన్ని క్యాచ్‌ చేసుకోవాలని యోచిస్తున్నారు. 


మండలాల వారీగా యాక్షన్‌ ప్లాన్‌..

కాగా జిల్లాలోని 19 మండలాలకు సంబంధించిన వ్యవసాయాధికారులు, పోలీసు అధికారులతో విజిలెన్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, నివేదికలు ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. దీంతో పాటు కీలకమైన నిఘా విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి యాక్షన్‌ప్లాన్‌ను అమలు చేయా లని కూడా నిర్ణయించారు. ఎరువులు, పురుగుల మందులను వ్యవసాయ శాఖ సూచించిన దుకాణాల్లోనే కొనుగోలు చేయాలంటూ రైతులకు సూచిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు అధికారుల కళ్లు గప్పి అక్రమదందా ను కొనసాగించాలని కూడా ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారంటున్నారు. అయితే రైతులు ప్రతియేటా నకిలీ విత్తనాలతో పెద్ద ఎత్తున నష్టపోతున్న వైనాన్ని ప్రభుత్వం సైతం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కె. చంద్రశేౄఖర్‌రావు నియంతృత సాగువిధానం అమలుపై కఠినంగా వ్యవహారిస్తుండడం, అలాగే వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకువస్తానంటూ ప్రకటిస్తుండడం లాంటి అంశాలు రైతులకు ఊరటనిస్తున్నాయి.


అయితే ఈ సారి ఖరీప్‌, రబీ సీజన్‌లకు సంబంధించిన మొత్తం సమగ్ర పంట ల విధానం అమలయ్యేందు కోసం వ్యవసాయ శాఖ పకడ్బందీ యాక్షన్‌ప్లాన్‌ రూపొందించింది. ఈ యాక్షన్‌ప్లాన్‌కు అనుకూలంగానే జిల్లాలో నకిలీ విత్తనాల ఆటకట్టించడమే కాకుండా, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడకుండా చర్యలు చేపట్టబోతున్నారు. రైతులకు అవసరమైన మేరకు ఎరువులు , విత్తనాలు , పురుగు మందులను వ్యవసాయ శాఖ పకడ్బందీగా పంపిణీ చేయాలని కోరుతున్నారు. 


Advertisement
Advertisement