విత్తన చౌరస్తా

ABN , First Publish Date - 2020-12-14T06:27:26+05:30 IST

చర్చల్లో లోగుట్టు కనిపెట్టినంకనే కదా! అన్నదాతలు నీతాన తిండి ముట్టలేదు నువ్వు ఎవల దిక్కో తెలిసిన నొప్పి అది...

విత్తన చౌరస్తా

చర్చల్లో లోగుట్టు కనిపెట్టినంకనే కదా!

అన్నదాతలు నీతాన తిండి ముట్టలేదు

నువ్వు ఎవల దిక్కో తెలిసిన నొప్పి అది


ప్రతిరోజూ తినే రొట్టె మీదనన్నా

వ్యవసాయుని బక్క మొఖం అగుపిస్త లేదా నీకు

చట్టాలతో పొట్టలు ఎందుకు పొక్క చేస్తవ్‌


పల్లెంలో తినే మెతుకు మెతుకు మీదా

భారత రైతు నొసటి గీతల గాథలు


కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ కడుపులోని నిర్వచనం

ఎవలు దున్నే భూమిల వాళ్లే పనిముట్లు అయ్యే కాలం

మెల్లంగ కార్పోరేటు బొజ్జల్లో అగ్రికల్చర్‌ జీర్ణం


ఎల్లకాలం అన్నం పెట్టినోళ్లకు

నవ్వుకుంటనే సున్నం కొడుతన్నవ్‌

ఇదేమి జాతీయత స్వామీ


జల ఫిరంగుల నీళ్ల దెబ్బలకు

జలంధర్‌ రైతుల వెన్నెముకలు వక్కలై తన్నయి


గజగజ గడ్డకట్టే చలిలోనా

సింఘూ సడక్‌ మీద సింగాలైన రైతాంగం


టిక్రీ నుంచి ఢిల్లీ సుట్టు ముట్టిండ్రు

ట్రాక్టర్లు ఆగకుండా ఇరువాలు మూడు సాల్లు దున్నుతన్నయి

రోడ్ల మీదా ఇత్తనాలూ మొలకెత్తుతై...

అన్నవరం దేవేందర్‌

94407 63479

Updated Date - 2020-12-14T06:27:26+05:30 IST