సాగు సందడి!

ABN , First Publish Date - 2022-06-15T04:56:24+05:30 IST

పుడమి తల్లికి వానాకాలం సీజన్‌ కళ వచ్చింది. ఏరువాక పౌర్ణమిన

సాగు సందడి!
ఆమనగల్లులో పత్తిసాగుకు పొలం సిద్ధం చేస్తున్న రైతు

  • తొలకరి ప్రారంభంతో పల్లెల్లో విత్తన శోభ
  • ఊపందుకున్న వ్యవసాయ పనులు
  • హుషారుగా రైతులు, జోరందుకున్న విత్తన ప్రక్రియ
  • 2022 వానాకాలం సాగు విస్తీర్ణం 4,88,579 ఎకరాలు
  • అందుబాటులో ఉన్న ఎరువుల మోతాదు : 26537.31 టన్నులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : పుడమి తల్లికి వానాకాలం సీజన్‌ కళ వచ్చింది. ఏరువాక పౌర్ణమిన జిల్లాను తొలకరి పలకరించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పనులతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. పలు వ్యవసాయ క్షేత్రాల్లో పొలం పనులు ఊపందు కున్నాయి. నైరుతి రుతుపవనాలతో జిల్లాలో ఓ మోస్తారు తొలకరి వర్షాలు ప్రారంభం కాగా జోరుగా విత్తనాలు వేసే ప్రక్రియ ఆరంభమైంది. పల్లెల్లో రైతులు హుషారుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ మరో రెండు, మూడు సారు భారీ వర్షాలు కురిస్తేనే విత్తనాలు వేసు కోవాలని, భూమిలో వేడి తగ్గే వరకు ఆగాలని రైతులకు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఈసారి వర్షాలు అధికంగా కురిస్తే పంటల సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  గతేడాది సాగు విస్తీర్ణం 3,79,675 ఎకరాలు ఉండగా, ఈ ఏడాది వానాకాలం సాగు విస్తీర్ణం 4,88,579 ఎకరాలు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఈసారి 1,01,841 టన్నుల రసాయనిక ఎరువులు అవసరం ఉండగా, 26,537.31 టన్నులు అందుబాటులో ఉన్నాయిని అధికారులు చెబుతున్నారు.


పెరగనున్న పత్తి, కంది సాగు

వానాకాలం సాగుకు సంబంధించిన పంటల ప్రణాళిక ప్రకారం ఈసారి జిల్లాలో పత్తి, కంది సాగు గణనీయం పెరగనుంది. పత్తి క్వింటాలు మద్దతు ధర రూ.6,225 ఉండటం, బహిరంగ మార్కెట్‌లో ధర రూ.10 వేల వరకు పలుకుతుండటంతో అధికశాతం రైతులు పత్తి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది ప్రతికూల వాతావరణం కారణంగా పత్తి దిగుబడి తగ్గినప్పటికీ మార్కెట్‌లో పత్తికి మంచి డిమాండ్‌ లభించింది. గత ఏడాది వానాకాలంలో  1,31,600 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేయగా ఈసారి 2,75,050 ఎకరాల విస్తీర్ణంలో సాగు కానుంది. అలాగే గత ఏడాది వానాకాలంలో 35,571 ఎకరాల్లో కంది పంట సాగు చేయగా.. ఈసారి 70,520 ఎకరాల్లో కంది వేయనున్నారు. 


అందుబాటులో సబ్సిడీ విత్తనాలు

జిల్లాలో జనుము, జీలుగ విత్తనాలు రైతులకు 65శాతం సబ్సిడీపై అందుబాటులో ఉంచారు. 1,921 క్వింటాళ్ల జనుము, జీలుగ విత్తనాలు అవసరం కాగా 789.90  క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. 171 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు అవసరం కాగా 101.10 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 1,750 క్వింటాళ్ల జనుము విత్తనాలు అవసరం కాగా 688.80 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. 


అవసరం కానున్న 26,702 క్వింటాళ్ల విత్తనాలు

వానాకాలం పంటలకు సంబంధించి జిల్లాలో 26,702 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కానున్నాయి. వరి విత్తనాలు 18,750 క్వింటాళ్లు, కందులు 2820.8 క్వింటాళ్లు, పత్తి(ప్యాకెట్లు) 5,50,100 (450 గ్రాములు) అవసరం కానున్నాయి. అలాగే జొన్న 600 క్వింటాళ్లు, మినుములు 13.6 క్వింటాళ్లు, వేరుశనగ 144 క్వింటాళ్లు, పెసర్లు 28 క్వింటాళ్లు, ఆముదం 3 క్వింటాళ్లు, సోయాబీన్‌ 7 క్వింటాళ్లు, ఇతర పంటలకు సంబంధించి 495క్వింటాళ్ల విత్తనాలు అవసరం కానున్నాయి. 


మోస్తరు నుంచి భారీ వర్షం

ఏరువాక పౌర్ణమి రోజు మంగళవారం రోజున జిల్లాలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలోని షాబాద్‌ మండలం తాళ్లపల్లిలో అత్యధికంగా 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చందనవెల్లిలో 31.0 మిల్లీమీటర్లు, పెద్ద షాపూర్‌లో 22.3 మిల్లీమీటర్లు, శంకర్‌పల్లిలో 29.5 మిల్లీ మీటర్లు, ఆమనగల్లులో 25.5 మిల్లీమీటర్లు, కడ్గాల పరి ధిలోని ముద్విన్‌లో 13.8 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. చేవెళ్ల మండలం కందవాడలో 13.8 మిల్లీమీటర్లు, కొత్తూరులో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 



Updated Date - 2022-06-15T04:56:24+05:30 IST