విత్తన పంపిణీ ఎప్పుడో..?!

ABN , First Publish Date - 2022-05-25T06:34:07+05:30 IST

జిల్లాలో విత్తన వేరుశనగ పంపిణీపై అయోమయం నెలకొంది. విత్తన సేకరణలో తీవ్ర జాప్యమే ఇందుకు కారణమన్న విమర్శలు వస్తున్నాయి.

విత్తన పంపిణీ ఎప్పుడో..?!
అనంతపురం రూరల్‌ మండలం కాటిగాని కాల్వ ఆర్బీకే వద్ద బస్తాలను దించుకుంటున్న కూలీలు

ఖరీఫ్‌ సీజనకు వారమే గడువు

జిల్లాకు 1.10 లక్షల క్వింటాళ్ల కేటాయింపు

ఇప్పటిదాకా 36 వేల క్వింటాళ్లే సరఫరా 


అనంతపురం అర్బన : జిల్లాలో విత్తన వేరుశనగ పంపిణీపై అయోమయం నెలకొంది. విత్తన సేకరణలో తీవ్ర జాప్యమే ఇందుకు కారణమన్న విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది మే రెండో వారం నుంచే  పంపిణీ ప్రారంభించారు. ఈ సారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ ఉన్నతాధికారుల ముందుస్తు ప్రణాళికల లోపంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎప్పటి నుంచి విత్తన కాయలు పంపిణీ చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయశాఖ, ఆర్బీకేల వద్దకు వెళ్లి అడిగినా సరైన సమాధానం లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మారని తీరు 

జూన నుంచి ఖరీఫ్‌ సీజన మొదలవుతుంది. దీనికి మరో వారం గడువు ఉంది. అయినా వ్యవసాయ శాఖ యంత్రాంగం తీరు మార లేదు. జిల్లా వ్యాప్తంగా  ఇటీవల భారీ వర్షాలు పడ్డాయి. రైతులు దుక్కి దున్నుతున్నారు. మరో మారు వర్షం పడితే విత్తనం వేస్తారు. ఈ నెల 20 నుంచి విత్తన పంపిణీ ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. ఇంకా మొదలవ్వలేదు. సేకరణ ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో పంపిణీపై సందిగ్ధత ఏర్పడింది. 


ఆలస్యంగా నమోదు

రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని, సబ్సిడీ మినహా మిగతా డబ్బులు రైతులు కట్టిన తర్వాతనే విత్తన కాయలను పంపిణీ చేస్తారు. ఈ ఏడాది రైతుల పేర్ల నమోదుకు అవసరమైన యాప్‌ తయారీలో జాప్యం జరిగింది. నాలుగు రోజుల క్రితమే రైతుల పేర్ల రిజిస్ర్టేషన ప్రక్రియ మొదలు పెట్టారు. ఇప్పటి దాకా 5,628 మంది రైతులు 4,928 క్వింటాళ్ల విత్తన కాయల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. 


32 వేల క్వింటాళ్లే..

జిల్లాకు ఈ ఏడాది 1.10 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించారు. ఇప్పటి దాకా కేవలం 36 వేల క్వింటాళ్లు ఆర్బీకేలకు సరఫరా చేశారు. జిల్లాలో ఐదుగురు విత్తన సరఫరాదారులకు సేకరణ బాధ్యతలు అప్పగించారు. పంపిణీ మొదలు పెట్టాలంటే కనీసం 70 శాతం విత్తనకాయలు సిద్ధంగా ఉండాలి. ముందు జాగ్రత్త లేని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. 


వేగవంతం చేస్తాం.. 

విత్తన వేరుశనగ సేకరణను మరింత వేగవంతం చేస్తాం. ఇప్పటికే 32 వేల క్వింటాళ్లు రైతు భరోసా కేంద్రాలకు చేరింది. రైతుల పేర్ల రిజిస్ర్టేషన మొదలు పెట్టాం. త్వరలోనే పంపిణీ తేదీని ప్రకటిస్తాం. అర్హులైన రైతులందరికీ సబ్సిడీ విత్తన కాయలు పంపిణీ చేస్తాం. 

- చంద్రానాయక్‌,

 జిల్లా వ్యవసాయ అధికారి 

Updated Date - 2022-05-25T06:34:07+05:30 IST