విత్తన యాతన!

ABN , First Publish Date - 2022-07-01T05:15:16+05:30 IST

వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు సహకరించడం లేదు. ఖరీఫ్‌ కాలానికి అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో అందించడం లేదు. దీంతో జిల్లాలో రైతులు విత్తనాల కోసం పరుగులు తీస్తున్నారు.

విత్తన యాతన!
ఖరీఫ్‌ సీజన్‌లో భాగంగా విత్తనాలు జల్లుతున్న రైతు

అన్నదాతకు విత్తన కష్టాలు

పూర్తిస్థాయిలో అందని వైనం

బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి

దోచుకుంటున్న ప్రైవేట్‌ వ్యాపారులు

అధిక ధరలతో జేబులకు చిల్లు

పెరుగుతున్న సాగు వ్యయం 

ప్రభుత్వ సహకారం కరువు

 (పాలకొండ) 

వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు సహకరించడం లేదు. ఖరీఫ్‌ కాలానికి అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో అందించడం లేదు. దీంతో జిల్లాలో రైతులు విత్తనాల కోసం పరుగులు తీస్తున్నారు. కేవలం 30 శాతం మందికే ఏపీ సీడ్స్‌ ద్వారా  విత్తనాలు సరఫరా చేస్తున్నారు.  మిగిలిన 70 శాతం మంది రైతులు అధిక మొత్తాలకు ప్రైవేట్‌ డీలర్ల వద్ద కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది.  దీంతో  వారు దోపిడీకి గురువుతున్నారు. మొత్తంగా గతేడాదిలానేఈసారి కూడా విత్తన కష్టాలు తప్పవా? అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. 

ఇదీ పరిస్థితి.. 

జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌ కాలంలో 72 హెక్టార్లలో వరి సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయాధి కారులు అంచనాలు వేశారు. అయితే అందుకు సరిపడా విత్తనాలను రైతులకు పూర్తిస్థాయిలో అందించేందుకు వీలుగా ముందస్తు ప్రణాళికలు రూపొందించలేదు. దీంతో అన్నదాతలు విత్తన కష్టాలను  ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికారుల అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 72 వేల హెక్టార్లకు 60 వేల క్వింటాళ్ల వరకు వివిధ రకాల వరి విత్తనాలు అవసరం. అయితే  25 వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంచారు.  జిల్లాలో 306 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు  45 వేల మంది రైతులు విత్తనాల కోసం రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. ఇప్పటివరకూ జిల్లాకు  25,484 క్వింటాళ్లు చేరుకోగా వాటిని  ఆయా రైతులకు సరఫరా చేశారు. అయితే ఒక్కో రైతుకు రెండు, మూడు బస్తాలకు మించి ఇవ్వడం లేదు. దీంతో రెండు ఎకరాలు దాటి వ్యవసాయం చేస్తున్న రైతులు తలలు పట్టుకుంటున్నారు. 

 ధరలు ఇలా.. 

 ఏపీ సీడ్స్‌ ద్వారా 20, 30 కేజీల వరి విత్తన బస్తాలను సబ్సిడీపై రూ.800 నుంచి రూ.1000 సరఫరా చేస్తున్నారు. అయితే ప్రైవేట్‌ డీలర్లు మాత్రం ఒక్కో బస్తాకు అదనంగా రూ.400 నుంచి రూ.600 వరకు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఎంటీయూ 1121, 7029, 1061, 1064, బీపీటీ 5204, ఆర్‌జీఎల్‌ 2537 రకాలను మా త్రమే సబ్సిడీ ధరలకు సరఫరా చేస్తోంది.  అది కూడా కేవలం 30 శాతం మాత్రమే అందిస్తోంది. మిగిలిన 70 శాతం రైతాంగం ప్రైవేట్‌ సీడ్‌ అయిన సంపద, 1153, 1156, 1124, 1171, 333 రకాలతో పాటు వివిధ రకాల సన్న రకాల విత్తనాలను బయట మార్కెట్లో డీలర్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్‌ దృష్ట్యా  కొందరు  డీలర్లు ఆయా రకాల 20 కేజీల బస్తాలను రూ.1200 నుంచి రూ.1500 వరకు  విక్రయిస్తున్నారు.  మొత్తంగా రైతులు ఒక్క విత్తన బస్తా వద్ద రూ.400 నుంచి రూ.600 వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ఇకపోతే  కొంతమంది వ్యాపారులు  విక్రయించే విత్తనాల నాణ్యతను పరిశీలించే వారే కరువయ్యారు.  దీంతో అధిక ధరలకు నాసిరకం విత్తనాలను అన్నదాతలకు అంటకడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  జిల్లా పరిధిలో ఫెర్టిలైజర్‌, ఫెర్టిసైడ్‌, విత్తన విక్రయాల కేంద్రాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిపై ఆకస్మిక దాడులు నిర్వహించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

 విత్తనశుద్ధికి దూరం 

గతంలో రైతులే విత్తనాలను శుద్ధి చేసుకొని ఖరీఫ్‌, రబీ పంటలకు అవసరమైన వరి విత్తనాలను సిదఽ్ధం చేసుకొనేవారు. అయితే కొంతకాలంగా వాతావరణం అనుకూలించడం లేదు. దీంతో  జిల్లా రైతులు విత్తన శుద్ధి చేసుకోలేకపోతున్నారు.   రాష్ట్ర ప్రభుత్వం  కూడా అరకొరగానే సరఫరా చేస్తుండడంతో  రైతుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.  అధిక మొత్తం చెల్లిస్తున్నా.. నాణ్యమైన విత్తనాలను  వారు పొందలేకపోతున్నారు. మొత్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో అన్నదాతలకు సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలను  అందించడంలో సర్కారు పూర్తిగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు. 

 నిబంధనల మేరకే.. 

నిబంధనల ప్రకారం జిల్లాలో రైతులకు  30, 40 శాతం మాత్రమే విత్తనాల సరఫరా చేసే అవకాశం ఉంది.   మిగిలిన వాటికి అన్నదాతలు విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంది.  ప్రైవేటు డీలర్ల నుంచి  సబ్సిడీ ధరలకు నాణ్యమైన విత్తనాలు పొందేలా చర్యలు చేపడతాం. పూర్తిస్థాయిలో విత్తనాలను సరఫరా చేసేందుకు ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తాం.

-  రాబర్ట్‌పాల్‌, జిల్లా వ్యవసాయ శాఖాధికారి 



Updated Date - 2022-07-01T05:15:16+05:30 IST