విత్తనం.. అయోమయం

ABN , First Publish Date - 2022-08-10T05:54:18+05:30 IST

పొగాకు రైతుల్లో ఈ ఏడాది విత్తన పంపిణీ సమయంలోనే అయోమయం నెలకొంది. ప్రత్యేకించి నల్లరేగడి భూముల ప్రాంత రైతులు అటు పొగాకుబోర్డు, ఇటు సీటీఆర్‌ఐ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

విత్తనం.. అయోమయం

ఎఫ్‌సీఆర్‌-15 రకం కోరుతున్న నల్లరేగడి రైతులు

మరోరకం ఇస్తామంటున్న పొగాకు బోర్డు అధికారులు

తాము కోరినవే ఇవ్వాలని సాగుదారుల డిమాండ్‌

ఒంగోలు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పొగాకు రైతుల్లో ఈ ఏడాది విత్తన పంపిణీ సమయంలోనే అయోమయం నెలకొంది. ప్రత్యేకించి నల్లరేగడి భూముల ప్రాంత రైతులు అటు పొగాకుబోర్డు, ఇటు సీటీఆర్‌ఐ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. తమ అభీష్టానికి భిన్నంగా అధికారులు విత్తనాలు ఇస్తామంటున్నారని ఆరోపిస్తున్నారు. అసలు పొగాకు విత్తన పంపిణీ విధానాన్ని తప్పుబడుతున్నారు. గతేడాది నల్లరేగడి ప్రాంతంలో అధిక దిగుబడిని ఇచ్చిన ఎఫ్‌సీఆర్‌-15 రకం విత్తనాలనే తిరిగి ఈ ఏడాది కూడా ఇవ్వాలని ఆ ప్రాంత రైతులు కోరుతుండగా..  సిరి రకం తీసుకోవాలని బోర్డు, సీటీఆర్‌ఐ అధికారులు సూచిస్తుండటం ప్రస్తుతం రైతుల్లో అలజడికి కారణంగా కనిపిస్తోంది. ఇతర పంటలకు భిన్నంగా పొగాకు పంట ప్రభుత్వ నియంత్రణ, బ్యారన్‌ రిజిస్ట్రేషన్లు, సాగు, విక్రయాలకు వేలం నిర్వహణ ఇలా మొత్తం వ్యవహారం పొగాకు బోర్డు పర్యవేక్షణలోనే సాగుతుంది. దీంతో బ్యారన్‌ లైసెన్స్‌ ఉన్న రైతులకు సీటీఆర్‌ఐ ద్వారా పొగాకు విత్తనాలను అందిస్తారు. స్వయంగా నారుపోయని రైతులు కమర్షియల్‌గా రాజమండ్రితోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెంచే నారు దిబ్బల నుంచి కొనుగోలు చేస్తారు. అయితే సహజంగానే సీటీఆర్‌ఐ ద్వారా మంచి విత్తనాల సరఫరా ఉంటుంది కాబట్టి కమర్షియల్‌గా నారు పెంచేవారు సైతం రైతుల పేర్లతో సీటీఆర్‌ఐ నుంచి విత్తనాలు తెచ్చి వేస్తుంటారు. 


అధిక దిగుబడులు ఇస్తున్న  ఎఫ్‌సీఆర్‌-15 రకం

గతంలో ఎన్‌-98, అలాగే 1158 వంటివి అధికంగా వేయగా కొన్నేళ్లుగా సిరి రకం ఎక్కువగా వాడుతున్నారు. రెండేళ్ల క్రితం ఎఫ్‌సీఆర్‌-15 రకంను సీటీఆర్‌ఐ తీసుకురాగా గతేడాది ఎక్కువమంది రైతులు ఆ రకాన్ని వేశారు. ఇతర రకాలతో పోల్చుకుంటే ఈ రకం విత్తనం వేసిన వారికి అధిక దిగుబడులు వచ్చాయి. ఆకు కొట్టుడు కాస్త ఆలస్యమైనా పండిపోకుండా ఉంటుందని రైతులు గుర్తించారు. నల్లరేగడి ప్రాంత రైతులు తమకు బాగా ఉపకరించిందని చెప్తుండగా ఈ ఏడాది ఎఫ్‌సీఆర్‌-15 రకం కేవలం తేలిక నేలలకే పరిమితమని నల్లరేగడి రైతులు సిరి రకంను వాడుకో వాలని అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళనకు దారి తీసింది. 


అధికారుల తీరుపై రైతుల మండిపాటు

గతేడాది ఏ తరహా నేలలు అన్న దానితో సంబంధం లేకుండా ఎఫ్‌సీ ఆర్‌-15 రకం ఇచ్చిన అధికారులు ఈ ఏడాది ఆ రకం కోరుతున్న తమకు ఇవ్వకపోవడంపై నల్లరేగడి రైతులు మండిపడుతున్నారు. ఎక్కువమంది రైతులు సొంతంగా నారుదిబ్బలు పెట్టే పరిస్థితి లేకపోగా బ్యారన్‌కు పావు కిలో ఇచ్చి ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక కమర్షియల్‌గా నారు పెంచే వారికి విత్తనాలు సరఫరా చేయకపోవడంతో రాజమండ్రి ప్రాంతానికి చెందిన అలాంటి వారు ఇక్కడికి వచ్చి రైతుల పాసుపుస్తకాలు సేకరించి ఆ పేర్లతో తీసుకుంటున్నారు. అందువల్ల నేరుగా కమర్షియల్‌ పెంపకందారులకే ఇవ్వాలని ఈ ప్రాంత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదేవిషయాన్ని కొందరు బోర్డు, సీటీఆర్‌ఐ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి నట్లు సమాచారం. అయితే సరిపడా ఎఫ్‌సీఆర్‌-15 రకం లేక ఇలా తేలికనేల లకే పరిమితం చేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. ఏమైనా ఈ ఏడాది ఆరంభంలోనే విత్తనాలతోనే అజలడి ప్రారంభమైంది.








Updated Date - 2022-08-10T05:54:18+05:30 IST