ఒకసారి కలుద్దామన్నారు!

ABN , First Publish Date - 2022-08-10T09:33:39+05:30 IST

ఢిల్లీలో తాను ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో ఏం జరిగిందో మాజీ సీఎం చంద్రబాబు మంగళవారమిక్కడ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో వివరించారు.

ఒకసారి కలుద్దామన్నారు!

  • మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయన్నారు
  • వీలు చూసుకుని ఢిల్లీ రమ్మన్నారు
  • వచ్చేముందు పీఎంవోకు చెప్పాలని మోదీ అన్నారు
  • ఢిల్లీలో జరిగింది ఇదీ.. టీడీపీ నేతలకు చంద్రబాబు వివరణ

అమరావతి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో తాను ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో ఏం జరిగిందో మాజీ సీఎం చంద్రబాబు మంగళవారమిక్కడ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో వివరించారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ భేటీలో ఢిల్లీలో ఆయన పర్యటన ప్రస్తావనకు వచ్చింది. ‘రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నేను ఒక పక్కన ఉండి వేరే వారితో మాట్లాడుతున్నాను. ప్రధాని ఒక్కొక్కరినీ పలకరిస్తూ తానే నా వద్దకు వచ్చారు. మనం కలిసి చాలా రోజులైంది... ఢిల్లీ రావడం లేదా అని అడిగారు. ఢిల్లీలో నాకు పనేమీ లేదని, రావడం లేదని చెప్పాను. మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి.. మనం ఒకసారి కలవాలని ఆయన అన్నారు. నేను కూడా మిమ్మల్ని కలుద్దామనుకుంటున్నానని చెప్పాను. ఒకసారి వీలు చూసుకుని ఢిల్లీ రండి. మీరు వచ్చే ముందు నా కార్యాలయానికి సమాచారమిస్తే నాకు అనువుగా ఉన్న సమయం చెబుతాను.. వద్దురు గాని అని ఆయన అన్నారు. నేను కూడా సరేనన్నాను. 


ఆరోగ్యం,  కుటుంబం తదితర విషయాలపైనా మాట్లాడుకున్నాం’ అని చంద్రబాబు వివరించారు. ప్రధానితో ఆయన మాట్లాడింది కొద్ది నిమిషాలే అయినా రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో అది ప్రకంపనలు సృష్టించిందని ఒక నేత అన్నప్పుడు చంద్రబాబు నవ్వి ఊరుకున్నారు. ప్రధానితో ఆయన భేటీపై వైసీపీలో ఉలికిపాటు చాలా ఎక్కువగా ఉందని మరో నేత వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి ఏదేదో మాట్లాడారు. ఆ పార్టీలోని భయమంతా ఆయన మాటల్లోనే కనిపించింది. ప్రధాని వద్ద జగన్‌రెడ్డి ప్రాధాన్యం తగ్గలేదని చెప్పుకోవడానికి ఆయన చాలా తాపత్రయపడ్డారు. జగన్‌రెడ్డిని ప్రధాని గంటసేపు తన పక్కనే కూర్చోబెట్టుకున్నారని సజ్జల చె ప్పారు. మరి గంటసేపు కూర్చుని రాష్ట్రానికి ఏం తెచ్చారో మాత్రం చెప్పలేదు’ అని ఒక మాజీ మంత్రి ఎద్దేవా చేశారు.


సీమ నేతలూ గట్టిగా మాట్లాడాలి

మాధవ్‌ అశ్లీల వీడియోపై పోరాటాన్ని ఉధృతం చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ నేతలు.. ప్రత్యేకించి మహిళా నేతలు బలంగా పోరాడుతున్నారని, అదే సమయంలో రాయలసీమ నేతలు కూడా ఈ అంశంపై గట్టిగా మాట్లాడాలని సూచించారు. ‘మూడేళ్లు గడచిపోయాయి. ఇక అందరం ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. పొలిట్‌బ్యూరోలో సభ్యులుగా ఉన్న సీనియర్‌ నేతలు కూడా రోడ్లపైకి రావాలి. మీలో కొందరు ఇంకా పూర్తి స్థాయిలో పోరాట స్ఫూర్తి ప్రదర్శించడం లేదు. ఆ లోపం త్వరగా సవరించుకోవాలి’ అని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో జెన్‌కో నిర్మించిన కృష్ణపట్నం థర్మల్‌ కేంద్రాన్ని అదానీ గ్రూపు తీసుకునే ప్రయత్నం చేస్తోందని, దీనిపై బీజేపీ సహా అన్ని పార్టీలనూ కలుపుకొని పోరాడుతున్నామని సీనియర్‌ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. భావ సారూప్య పార్టీలను కలుపుకొని సమష్టిగా పోరాటం చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో బాగా వెనుకబడిపోవడంపై ప్రవాసాంధ్రుల్లో తీవ్రమైన ఆవేదన ఉందని, వారిని అన్ని రకాలుగా కలుపుకొని పోవడానికి కార్యాచరణ రూపొందించుకోవాలని సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి సూచించారు. ‘నేను రెండు నెలలుగా అమెరికాలో ఉన్నాను. కనీసం వెయ్యి మందితో మాట్లాడాను. వీరిలో అన్ని కులాల వారూ ఉన్నారు. జగన్‌ సామాజిక వర్గానికి చెందిన వారిలో కూడా రాష్ట్ర పరిస్థితులపై బాగా ఆవేదన ఉంది. వారందరూ టీడీపీకి సహకరించడానికి ముందుకొస్తున్నారు’ అని వివరించారు.


బాబు స్థాయేంటో వైసీపీకి అర్థం కావడం లేదు: పయ్యావుల

సీనియర్‌ రాజకీయవేత్తగా చంద్రబాబుకు దేశంలో అత్యున్నతమైన స్థాయి ఉందని, ఆ విషయం వైసీపీకి అర్థం కావడం లేదని అసెంబ్లీ పీఏసీ చైర్మన్‌, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన అన్ని వర్గాల ఆలోచనల్లో మార్పునకు కారణమైందని, దానిని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. ప్రధానితో చంద్రబాబు భేటీకి ముందు తామంతా ఆయన నాయకత్వంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశామని, ఆమెతో భేటీ అద్భుతంగా జరిగిందని చెప్పారు. ‘ఒక తల్లిలా మా అందరినీ రిసీవ్‌ చేసుకున్నారు. రాష్ట్రపతిగా ఆమె ఎంపిక నూటికి నూరు శాతం మంచి నిర్ణయమని వ్యక్తిగతంగా కలిశాక మా అందరికీ అనిపించింది’ అని పేర్కొన్నారు.


యువతకు ప్రాధాన్యంపై కమిటీ

పార్టీ సంస్థాగత నిర్మాణంలో యువతకు మరింత ప్రాధాన్యం ఎలా కల్పించాలో సూచనలివ్వడానికి కమిటీని వేయాలని పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దీనిని ప్రస్తావించారు. ‘వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు ఇస్తామని మనం చెప్పాం. దీనితోపాటు అన్ని స్థాయుల్లో యువతకు పాత్ర కల్పించాలి. సుదీర్ఘకాలం పాతవారే పదవుల్లో ఉండిపోతే యువతకు అవకాశాలు రావు. వారికి కమిటీల్లో భాగస్వామ్యం కల్పించి క్రమంగా ఎదగడానికి చాన్సివ్వాలి. యువ రక్తం రావడానికి సంస్థాగత నిర్మాణంలో సంస్కరణలు తేవాలి. దీనికి స్పష్టమైన విధానంకావాలి’ అని ఆయన కోరారు. ఈ చర్చలో మరికొందరు నేతలు కూడా పాల్గొని సానుకూలంగా స్పందించారు. ఆలస్యం కాకుండా దీనిపై ప్రణాళిక రూపొందించడానికి కమిటీ వేయాలని, వచ్చే పొలిట్‌బ్యూరో సమావేశం నాటికి నివేదిక ఇచ్చేలా కాల పరిమితి పెట్టాలని కూడా లోకేశ్‌ కోరారు. దీనికి చంద్రబాబు అంగీకరించారు. రెండు మూడ్రోజుల్లో కమిటీ వేస్తానని తెలిపారు.

Updated Date - 2022-08-10T09:33:39+05:30 IST