మానవతా దృష్టితో వ్యవహరించండి

ABN , First Publish Date - 2020-11-29T05:19:24+05:30 IST

తుఫాను వల్ల జరిగిన నష్టాలను అంచనా వేయడంలో, పంటల నష్ట నివేదికలు రూపొందించే విషయంలో అధికారులు మానవతా దృష్టితో వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.

మానవతా దృష్టితో వ్యవహరించండి
ఏరియల్‌ సర్వేకి బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్‌

తుఫాను నష్టాల అంచనాపై 

అధికారులకు సీఎం సూచన

పంటలు నష్టపోయిన రైతులకు 

రాయితీ విత్తనాల పంపిణీకి ఆదేశం


తిరుపతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):తుఫాను వల్ల జరిగిన నష్టాలను అంచనా వేయడంలో, పంటల నష్ట నివేదికలు రూపొందించే విషయంలో అధికారులు మానవతా దృష్టితో వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఆదుకోవాలని సూచించారు. పంటలు నష్టపోయిన రైతులకు 80 శాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలని నిర్దేశించారు. శనివారం ఉదయం తిరుపతి విమానాశ్రయంలో నివర్‌ తుఫాను నష్టాలపై చిత్తూరు,నెల్లూరు,కడప జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు మూడు జిల్లాల్లో తుఫాను నష్టాలను పరిశీలించేందుకు హెలికాప్టర్‌లో మంత్రులు పెద్దిరెడ్డి, సుచరితలతో కలసి గంటన్నర పాటు ఏరియల్‌ సర్వే చేశారు. తిరిగివచ్చాక జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.... తుఫాను కారణంగా జిల్లాలో మరణించిన ఆరుగురి కుటుంబాలకు రూ. 5 లక్షల వంతున ఎక్స్‌గేషియా వెంటనే అందజేయాలని కలెక్టర్‌ భరత్‌ గుప్తాను ఆదేశించారు. తుఫాను నేపధ్యంలో పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన ప్రతి ఒక్కరికీ రూ. 500 చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. తుఫానులో సంభవించిన అన్ని రకాల నష్టాలకు సంబంధించి వచ్చే నెల 15వ తేదీలోపు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని స్పష్టం చేశారు.31వ తేదీ నుంచీ నష్టపరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వరదల కారణంగా దెబ్బతిన్న పింఛా ప్రాజెక్టు ఆనకట్టను వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్లు, చెరువులు దెబ్బతిన్న చోట్ల తక్షణం మరమ్మతులు చేపట్టాలన్నారు.


245 గ్రామాలపై నివర్‌ ప్రభావం: కలెక్టర్‌  


నివర్‌ తుఫాను కారణంగా జిల్లాలోని 21 మండలాలకు చెందిన 245 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని కలెక్టర్‌ భరత్‌ గుప్తా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. వ్యవసాయ శాఖకు సంబంధించి 9658 హెక్టార్లు, ఉద్యాన శాఖకు సంబంధించి 1730 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి 8129 మేకలు, గొర్రెలు చనిపోవడం జరిగిందని, 245 కచ్చా ఇళ్ళు దెబ్బతిన్నాయని తెలిపారు. 44 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 4042 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. 543 కిలోమీటర్ల మేరకు ఆర్‌ అండ్‌ బీ రహదారులు దెబ్బతిన్నాయని, మున్సిపాలిటీల పరిధిలో రూ. 10.82 కోట్ల విలువ చేసే భవనాలు, కాలువలు, పైపులైన్లు దెబ్బతిన్నాయని వివరించారు. ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్‌ బాషా,  మంత్రులు సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా,  కడప కలెక్టర్‌ హరికిరణ్‌, నెల్లూరు కలెక్టర్‌ చక్రధర్‌ బాబు, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెస్‌ బాబు, పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాఽథ రావు,జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారిణి పద్మజ తదితరులు పాల్గొన్నారు.


తుఫాను నష్టాలపై ఫొటో ఎగ్జిబిషన్‌  


తుఫాను నష్టాలపై విమానాశ్రయంలో  పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి జగన్‌ సందర్శించారు. సదరన్‌ డిస్కం పరిధిలోని మూడు జిల్లాల్లో సుమారు రూ.5 కోట్ల పైచిలుకు నష్టం వాటిల్లిందని సంస్థ సీఎండీ హెచ్‌.హరనాథరావు సీఎంకు వివరించారు. ముందుజాగ్రత్తలు తీసుకున్నా పెనుగాలుల కారణంగా అధిక నష్టం వాటిల్లిందన్నారు.

Updated Date - 2020-11-29T05:19:24+05:30 IST