తీర ప్రాంతాల్లో తనిఖీలు.. హడలెత్తిన ప్రజలు

ABN , First Publish Date - 2022-06-29T13:01:46+05:30 IST

రాష్ట్రంలోని కాశిమేడు, రాయపురం హార్బర్‌ తదితర ప్రాంతాల్లో బీసెంట్‌నగర్‌, మెరీనాబీచ్‌ తీర ప్రాంతాల్లో ఉగ్రవాద నిరోదక చర్యల్లో భాగంగా

తీర ప్రాంతాల్లో తనిఖీలు.. హడలెత్తిన ప్రజలు

                    - రిహార్సల్స్‌ అని తెలిసి ఊపిరిపీల్చుకున్న జనం


చెన్నై, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాశిమేడు, రాయపురం హార్బర్‌ తదితర ప్రాంతాల్లో బీసెంట్‌నగర్‌, మెరీనాబీచ్‌ తీర ప్రాంతాల్లో ఉగ్రవాద నిరోదక చర్యల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేసి, ఉగ్రవాదులను నిరోధించారు. పోలీసుల హడావుడి చూసి సామాన్యులు కొన్ని చోట్ల భయాందోళనలకు గురయ్యారు. నిజంగానే తీవ్రవాదులు వచ్చారేమోనని ఉలిక్కిపడ్డారు. చివరకు రిహార్సల్స్‌ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాద చర్యలను నిరోధించే దిశగా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉదయం గుమ్మిడి పూండి నుంచి కన్నియాకుమారి వరకూ సముద్రతీం పొడవునా నావికాదళం ఉన్నతాధికారులు, సిబ్బంది, రాష్ట్ర పోలీసులు కలిసి గస్తీపై రిహార్సల్స్‌ నిర్వహించారు. 2008లో ముంబయిలో ఉగ్రవాదులు సముద్రమార్గంలో చొరబడి దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన దరిమిలా సముద్రతీరం పొడవునా భద్రతా ఏర్పాట్ల ను తీవ్రతరం చేయడంతోపాటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉగ్రవాద చొరబాట్లను నిరోధించేలా గస్తీపై కసరత్తు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు, ఆయా రాష్ట్రాల్లోని నావికాదళం ప్రాంతీయ విభాగానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాల్లో గస్తీ ఏర్పాట్లపై నావికాదళం అధికారులు రాష్ట్ర పోలీసులు కలిసి కసరత్తు జరిపారు. నేవీకి చెందిన కొంతమంది సభ్యులు ఉగ్రవాదుల్లా సముద్రమార్గంలో, నగరాల్లో చొరబడేందుకు ప్రయత్నించగా వారిని స్థానిక పోలీసులు సమర్థవంతంగా నిలువరించారు. గుమ్మిడిపూండి నుంచి కన్నియాకుమారి వరకూ సముద్రతీర నగరాల్లో నావికాదళ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా ఈ కసరత్తు నిర్వహించారు. నగరంలో పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ నేతృత్వంలో జరిగిన ఈ రిహార్సల్స్‌లో అదనపు పోలీసు కమిషనర్లు, డిప్యూటీ పోలీసు కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. నగరంలో పదివేల మంది పోలీసులు ఈ రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T13:01:46+05:30 IST