ఢిల్లీలో భారీ భద్రత..మాక్ డ్రిల్స్

ABN , First Publish Date - 2021-10-12T02:22:55+05:30 IST

పండుగ సీజన్ కావడంతో దేశ రాజధానిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో భద్రతను పెంచాలంటూ..

ఢిల్లీలో భారీ భద్రత..మాక్ డ్రిల్స్

న్యూఢిల్లీ: పండుగ సీజన్ కావడంతో దేశ రాజధానిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో భద్రతను పెంచాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో రాకేష్ ఆస్థానా సోమవారంనాడు సమీక్షా సమావేశం జరిపారు. దీనిపై నార్త్ ఢిల్లీ డీసీపీ సాగర్ సింగ్ కల్సి మాట్లాడుతూ, పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశామని, ఎలాంటి ఉగ్రదాడులనైనా సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు వీలుగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు.


కాగా, పండుగ సీజన్‌లో ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసిన టెర్రర్ మాడ్యూల్‌ను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో శిక్షణ పొందినట్టు చెబుతున్న ఇద్దరు వ్యక్తులతో సహా ఆరుగురుని అదుపులోకి తీసుకుంది. పాకిస్థాన్ ఐఎస్ఐ, అండర్ వరల్డ్‌తో ఈ టెర్రర్ మాడ్యూల్‌కు సంబంధాలున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికలపై రాష్ట్ర పోలీసులు నిఘా పెంచారు. రాజధానిలోని మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు, రామ్‌లీలా, దుర్గాపూజా మండపాలలో అలెర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించారు. ఎలాంటి ఉగ్ర ముప్పు తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ప్రైవేటు కార్లను సైతం తనిఖీలు చేస్తున్నారు.

Updated Date - 2021-10-12T02:22:55+05:30 IST