భద్రత–రాజకీయం

ABN , First Publish Date - 2021-12-02T06:15:13+05:30 IST

మనదేశంలో రాజకీయం అంటని అంశమంటూ ఏదీ ఉండదేమో! సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) పరిధి విషయంలో ఇప్పుడు వివాదం సాగుతోంది. తన రాష్ట్రంలో బిఎస్ఎఫ్ అధికారపరిధిని 15 కిలోమీటర్ల నుండి యాభైకిలోమీటర్లకు పెంచడంపై...

భద్రత–రాజకీయం

మనదేశంలో రాజకీయం అంటని అంశమంటూ ఏదీ ఉండదేమో! సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) పరిధి విషయంలో ఇప్పుడు వివాదం సాగుతోంది. తన రాష్ట్రంలో బిఎస్ఎఫ్ అధికారపరిధిని 15 కిలోమీటర్ల నుండి యాభైకిలోమీటర్లకు పెంచడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఇటీవల జరిపిన భేటీలో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించాల్సిందిగా కోరారు. దీనిపై బెంగాల్ అసెంబ్లీ ఇప్పటికే ఒక తీర్మానం చేసింది కూడా. దీనికి ముందు పంజాబ్ కూడా అదే పనిచేసింది. విపక్షపార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల విషయంలో కేంద్రం అనుచితంగా ప్రవర్తిస్తున్నదనీ, ఏదో ఒక విధంగా వాటిపరిధిలోకి చొచ్చుకొనివస్తూ, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని బీజేపీయేతర పార్టీల వాదన. బిఎస్ఎఫ్ పరిధిని రాష్ట్రాలమీద రుద్దే అధికారం కేంద్రానికి లేదని కోల్‌కతా హైకోర్టులో ఒక ‘పిల్’ కూడా దాఖలైంది.


మమత నిత్యమూ కేంద్రంమీద మండిపడుతూనే ఉంటారు. కానీ, పంజాబ్ సైతం అదే మార్గంలో నడవడానికి ఆ రాష్ట్రం కొద్దినెలల్లో ఎన్నికలకుపోతూండటం కూడా ఓ కారణం కావచ్చు. బిఎస్ఎఫ్ అధీనంలో ఉండే భూభాగం పరిధిని యాభైకిలోమీటర్లకు పెంచుతూ అక్టోబర్ 11న కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ మహావీరులైన పంజాబీలను అవమానించే నిర్ణయమని దీనిని ఉపసంహరించాలని చన్నీ ప్రభుత్వం తీర్మానించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బిఎస్ఎఫ్ కు వివిధ చట్టాలకింద గాలింపు, అరెస్టు, స్వాధీనం ఇత్యాది అధికారాలతోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులున్న పశ్చిమబెంగాల్, పంజాబ్, అసోం రాష్ట్రాల్లో ఈ భద్రతాదళం అధికార పరిధి భారత భూభాగంలోపల యాభైకిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఐదు ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలో ఈ రకంగా హద్దుల నిర్థారణ జరగలేదు కానీ, మిగతా అధికారాలు మాత్రం దఖలుపడ్డాయి. ఇందుకోసం కేంద్రం 2014 నాటి చట్టాన్ని సవరించింది. అయితే, గుజరాత్‌లో దీనికి పూర్తి భిన్నంగా బిఎస్ఎఫ్ పరిధి 80 నుంచి యాభైకిలోమీటర్లకు తగ్గించడం రాజకీయ వివాదానికి కారణం. పాకిస్థాన్ పొరుగున ఉన్న గుజరాత్ వంటి అత్యంత కీలకమైన, అన్ని రకాల అక్రమరవాణాలకు కేంద్రమైన సరిహద్దు రాష్ట్రంలో బలగాల బాధ్యతని యాభైకిలోమీటర్లకు కుదించడం ఏమిటని విపక్షాల ప్రశ్న. భారతీయ జనతాపార్టీ తాను  అధికారంలో ఉన్న చోట ఒకరకంగా, లేనిచోట మరోరకంగా వ్యవహరిస్తున్నదని అవి అంటున్నాయి. 


బిఎస్ఎఫ్ పరిధిని విస్తరించడం వెనుక మారుతున్నకాలానికి అనుగుణంగా దానిని బలోపేతం చేయాలన్న లక్ష్యం ఉన్నదని రాజ్యసభలో బుధవారం హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులుగా ఉన్న కీలక రాష్ట్రాల్లో బిఎస్ఎఫ్ పరిధిని ఏకరీతిన యాభైకిలోమీటర్లు చేయడమే దీని ఉద్దేశ్యమన్నారు. కానీ, మంగళవారం బిఎస్‌ఎఫ్ డైరక్టర్ జనరల్ దీనికి పూర్తి భిన్నంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసోం, బెంగాల్ లో అక్రమచొరబాట్లవల్ల జనాభా రూపురేఖలు మారిపోతున్నందునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. దేశభద్రతకు సంబంధించిన విషయాలు సైతం రాజకీయరంగు పులుముకుంటుంటే ఉన్నతస్థాయి అధికారులు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. కేంద్రం నిర్ణయాన్ని మరింత అనుమానించడానికి ఇవి ఉపకరిస్తాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులు రెండూ ఒకేరకమైన ప్రమాదకరస్థాయివి కావు. ఆయుధాలు, మాదకద్రవ్యాలు, సరిహద్దు ఉగ్రవాదం, అక్రమచొరబాట్ల విషయంలో రెండింటినీ వేర్వేరుగా తూచవలసిందే. అలాగే, గుజరాత్, రాజస్థాన్ సరిహద్దు గ్రామాల్లో జనసాంద్రత తక్కువగా ఉండటం, పోలీసు వ్యవస్థ బలహీనంగా ఉండటంతో బిఎస్‌ఎఫ్ పరిధి ఎక్కువగానూ, బెంగాల్, పంజాబ్ లాంటి జనసాంద్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పరిధి తక్కువగానూ ఉంచారు. ఇప్పుడు ఏకరూపత పేరుతో బిఎస్ ఎఫ్ పరిధిని కొన్ని రాష్ట్రాల్లో తగ్గించి, కొన్నింట్లో పెంచడం వెనుక దేశశ్రేయస్సు మాత్రమే ఉన్నదని కేంద్రం అంటున్నది. దేశభద్రతకు సంబంధించిన నిర్ణయాలను రాజకీయాలతో ముడిపెట్టకపోవడం అత్యావశ్యకం.

Updated Date - 2021-12-02T06:15:13+05:30 IST