భద్రత ప్రధానం

ABN , First Publish Date - 2022-01-06T07:14:47+05:30 IST

ఎన్నికలకు పోబోతున్న పంజాబ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు ఆరంభించేందుకు వెళ్ళిన ప్రధాని నరేంద్రమోదీ పర్యటన రద్దుచేసుకొని వెనక్కు మళ్ళవలసి వచ్చిన ఘటన అవాంఛనీయమైనది...

భద్రత ప్రధానం

ఎన్నికలకు పోబోతున్న పంజాబ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు ఆరంభించేందుకు వెళ్ళిన ప్రధాని నరేంద్రమోదీ పర్యటన రద్దుచేసుకొని వెనక్కు మళ్ళవలసి వచ్చిన ఘటన అవాంఛనీయమైనది. మోదీ కాన్వాయ్ మార్గంలో ఒక ఫ్లై ఓవర్ వద్ద రైతులు ధర్నాకు కూచోవడంతో ఆయన ఇరవైనిముషాలసేపు ఆ వంతెనపైనే చిక్కుబడిపోయారు. తిరిగి భటిండా విమానాశ్రయానికి చేరుకున్న మోదీ తాను కనీసం ప్రాణాలతో సురక్షితంగా వెనక్కురాగలిగినందుకు పంజాబ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేశారు. ప్రధాని స్థాయి వ్యక్తికి ఎదురవకూడని అనుభవం కనుక నరేంద్రమోదీ మెత్తనిమాటలతో ఈ ఘాటైన విమర్శ చేయడం, మొత్తంగా ఈ వ్యవహారం రాజకీయరంగు పులుముకోవడం సహజం.


పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ తాను చెప్పదల్చుకున్నదేదో చెప్పారు. దేశ ప్రధానికి ఇటువంటి చేదు అనుభవం ఎదురైనందుకు బాధపడుతున్నాననీ, ఆఖరునిముషంలో ప్రధాని రోడ్డుమార్గాన ప్రయాణించాలని నిర్ణయించడంతో ఈ గందరగోళం నెలకొన్నది తప్ప, భద్రతావైఫల్యమేమీ ఇందులో లేదనీ అంటున్నారు. మోదీ పంజాబ్ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని రైతు సంఘాలు అప్పటికే ఆందోళన నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తున్న కాంగ్రెస్ నాయకులు, ఫిరోజ్ పూర్ సభలో జనం లేకపోవడంతో బీజేపీ దానిని రద్దుచేసుకున్నదంటూ ఖాళీ కుర్చీల విడియోలు పోస్టు చేస్తున్నారు. సుదీర్ఘ రైతు ఉద్యమాన్ని ఉపసంహరించుకున్న రైతులకు ఇప్పటికీ అనేక అంశాల్లో న్యాయం చేకూరలేదనీ, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తొలగింపు, రైతులపై కేసుల ఉపసంహరణ, ఏడువందలమంది రైతుకుటుంబాలకు నష్టపరిహారం తదితర అంశాల్లో కేంద్రం నిర్లక్ష్యం చూపడంతో రైతులు ఇలా రోడ్డుమీదకు వచ్చారని ఆ పార్టీ అంటున్నది. భద్రతావైఫల్యానికి పంజాబ్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కేంద్ర హోంశాఖ అంటోంది. ప్రధాని వెళ్ళేమార్గానికి క్లియరెన్స్ ఇచ్చి, ప్రధాని భద్రతకు భరోసా ఇచ్చిన రాష్ట్ర పాలకులు ఆ మార్గంలో నిరసనకారులను ఎలా అనుమతించారని బీజేపీ నాయకులు అడుగుతున్నారు. ‌నిరసనకారులకు ముందస్తు సమాచారం ఇచ్చి మరీ ప్రధానిని అవమానించారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పాకిస్థాన్ సరిహద్దుకు పదికిలోమీటర్ల దూరంలో ప్రధాని ఇలా ఇరవైనిముషాలు ఉండిపోవడం శాంతిభద్రతల వైఫల్యమేనని ఇటీవలే బీజేపీతో చేతులు కలిపిన అమరీందర్ సింగ్ అంటున్నారు. 


ఈ విమర్శలు, ప్రతివిమర్శలు అటుంచితే, జరిగిన ఘటన తీవ్రమైనదనడంలో సందేహం లేదు. ప్రధాని కాన్వాయ్ చిక్కుకుపోయిన ఫ్లై ఓవర్ వద్ద ధర్నాచేస్తున్న రైతుల అసలు లక్ష్యం ఫిరోజ్ పూర్ సభకు పొరుగు రాష్ట్రాలనుంచి తరలివస్తున్న బీజేపీ నాయకులను, కార్యకర్తలకు నిరసన తెలియచేయడమేననీ, ప్రధాని కాన్వాయ్ ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ వంతెనపై చిక్కుకున్న విషయం వారిలో చాలామందికి తెలియదని అంటున్నారు. ప్రధాని భద్రత విషయంలో జరిగిన ఈ తప్పిదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఉమ్మడి వైఫల్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నది. వందకిలోమీటర్లపైన ఉన్న రోడ్డు మార్గాన ప్రధాని ప్రయాణించేందుకు ఆఖరినిముషంలో నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. రద్దీగా ఉండే ఈ మార్గంలో సాధారణ దినాల్లో ప్రయాణించేందుకు రెండున్నర గంటలవరకూ పడుతుందట. రైతుజనాభా అత్యధికంగా ఉండే ఈ మార్గం రైతు ఉద్యమాలకు ప్రసిద్ధి. ఇతరత్రా అంశాలు పరిగణనలోకి తీసుకొని కూడా ఇంటలిజెన్స్ వ్యవస్థలు అనుమతించకూడని మార్గం ఇది. పంజాబ్ ప్రభుత్వం హడావుడిగా ప్రధాని రోడ్డుపర్యటనకు అనుమతివ్వక తప్పలేదని చన్నీ చెప్పడం సరికాదు. బీజేపీ సభలనూ, మోదీ పర్యటననూ రైతులు నిరసిస్తున్న విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియనిదేమీ కాదు కనుక, భటిండానుంచి హుస్సేనీవాలా వరకూ హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం సహకరించనప్పుడు ఇలా రోడ్డుమార్గాన్ని ఎంచుకోవడం కంటే, వెంటనే పర్యటన రద్దుచేసుకొని ఉంటే బాగుండేది. ప్రధాని భద్రత కంటే, అభివృద్ధి కార్యక్రమాల ఆరంభం ప్రధానమేమీ కాదు.

Updated Date - 2022-01-06T07:14:47+05:30 IST