సరిహద్దులో కట్టుదిట్టం

ABN , First Publish Date - 2021-05-06T06:51:52+05:30 IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి కోరారు.

సరిహద్దులో కట్టుదిట్టం
తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్న పోలీసులు

ఆంధ్ర-తెలంగాణ బోర్డర్‌లో పోలీసుల పహారా

వాహనదారులతో సహనంగా వ్యవహరించాలి  : డీఎస్పీ

యుద్ధప్రాతిపదికన బారికేడ్ల ఏర్పాటు

జగ్గయ్యపేట రూరల్‌, మే 5: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి కోరారు. బుధవారం రాష్ట్ర సరిహద్దు గరికపాడు వద్ద తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వచ్చే వాహనాలకు అనుమతులు లేవని బైకు, ఆటోలు, కార్లు, తదితర వాహనదారులను వెనక్కు తిప్పి పంపారు. అత్యవసర సర్వీసులు, సరుకు రవాణా, వైద్యపరంగా అనుమతులున్న వారిని రాష్ట్రంలోకి అనుమతించారు. డీఎస్పీ మాట్లాడుతూ వాహనాల రాకపోకలకు రహదారిపై పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనుమతులు లేని వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు చెక్‌పోస్టుల వద్ద మూడు షిప్టుల్లో డీఎస్పీ, సీఐల పర్యవేక్షణలో ప్రతి షిప్టులో ఎస్‌ఐతో పాటు 20 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. రహదారిపై బారికేడ్ల ఏర్పాటుకు సహకరించిన చెట్టినాడు సిమెంట్‌ డీలర్‌ సతీ్‌షను అభినందించారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో సరిహద్దులో తెలంగాణకు చెందిన భూబాగాన్ని ఆంధ్రరాష్ట్ర అధికారులు తనిఖీల నిమిత్తం వినియోగించుకున్నారు. ఇప్పుడు కూడా అదేస్థలం కోసం యత్నించగా తెలంగాణ అధికారులు ఇవ్వకపోవటంతో గరికపాడు పాత ఆర్టీఏ చెక్‌పోస్టు వద్దనున్న డివైడర్‌ తొలగించి అనుమతులు లేకుండా రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలను వెనక్కి పంపేశారు. తనిఖీల సమయంలో వాహనదారులతో సిబ్బంది సహనంగా వ్యవహరించాలని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి సిబ్బందికి అవగాహన కల్పించారు. 

Updated Date - 2021-05-06T06:51:52+05:30 IST