పీఎం పర్యటనలో భద్రతా లోపం : ‘నిరసనకారులతో కలిసి పోలీసులు టీ సేవించారు’

ABN , First Publish Date - 2022-01-07T18:26:57+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన

పీఎం పర్యటనలో భద్రతా లోపం : ‘నిరసనకారులతో కలిసి పోలీసులు టీ సేవించారు’

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సమయంలో భద్రతా లోపాలపై దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ ప్రారంభించింది. ఈ సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని పిటిషనర్  కోరారు. 


ఈ పిటిషన్‌ను లాయర్స్ వాయిస్ అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో) దాఖలు చేసింది. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. ఇది శాంతిభద్రతల సమస్య కాదని, ఇది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) చట్టం పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఇది రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించిన విషయం కాదన్నారు. ఎస్‌పీజీ చట్టంలోని సెక్షన్ 14ను పరిశీలించాలని కోరారు. 


కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, అత్యంత అరుదైన అంశంపై విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంఘటన చాలా తీవ్ర స్వభావం కలది అని, అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బందులకు కారణమయ్యే అంశమని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాహన శ్రేణి రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు పంజాబ్ డీజీపీని సంప్రదించినట్లు తెలిపారు. రోడ్డు మార్గం ప్రయాణానికి అనుకూలంగా ఉన్నట్లు డీజీపీ చెప్పిన తర్వాతే పీఎం వాహన శ్రేణి ముందుకు వెళ్ళిందని చెప్పారు. రోడ్డును దిగ్బంధించినట్లు డీజీపీ హెచ్చరించలేదని తెలిపారు. పీఎం కాన్వాయ్‌కి ముందు ఓ వార్నింగ్ కార్ వెళ్లిందన్నారు. నిరసనకారులతో కలిసి స్థానిక పోలీసులు టీ సేవిస్తున్నట్లు గమనించారని చెప్పారు. ఫ్లైఓవర్‌పై రోడ్డును దిగ్బంధించినట్లు స్థానిక పోలీసులు వార్నింగ్ కార్‌లోని సిబ్బందికి తెలియజేయలేదన్నారు. 


పంజాబ్‌లో ప్రధాన మంత్రి పర్యటించేటపుడు ఆయనకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని నిషిద్ధ ఉగ్రవాద సంస్థ Sikhs for Justice బహిరంగంగా పిలుపునిచ్చిందని చెప్పారు. ఇది అంతర్జాతీయ ఉగ్రవాదానికి సంబంధించిన సంఘటన కావచ్చునన్నారు. ప్రధాన మంత్రి భద్రతకు లోపం ఏర్పడిన ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయరాదని తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం ఈ సంఘటనపై దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేసి ఉండకూడదన్నారు. న్యాయ ప్రక్రియను అధిగమించి, మాయ చేయడం కోసమే ఈ కమిటీ నియామకమని ఆరోపించారు. ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారి దర్యాప్తు చేయడం చాలా అవసరమని తెలిపారు. 


ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, ఈ సంఘటన జరిగిన రోజునే ఈ కమిటీని నియమించామని, ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైన తర్వాత కాదని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. అదేవిధంగా ఎఫ్ఐఆర్‌ను కూడా నమోదు చేసినట్లు  తెలిపారు. 


Updated Date - 2022-01-07T18:26:57+05:30 IST