గందరగోళం నుంచి గమ్యం వైపు..

ABN , First Publish Date - 2022-06-20T13:44:49+05:30 IST

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. ‘అగ్నిపథ్‌’ స్కీంను రద్దు చేయాలని కోరుతూ ఈనెల

గందరగోళం నుంచి గమ్యం వైపు..

కుదుటపడుతున్న సికింద్రాబాద్‌ స్టేషన్‌

వివిధ ప్రాంతాలకు రైళ్లు

నిఘా నీడలో పరిసరాలు


హైదరాబాద్‌ సిటీ: సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. ‘అగ్నిపథ్‌’ స్కీంను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 17న ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ అట్టుడికిన విషయం తెలిసిందే. దీంతో సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లన్నీ ఆ రోజు దారి మళ్లించారు. శుక్రవారం రాత్రి నుంచి పరిస్థితులు అదుపులోకి రావడంతో రైళ్లు యధావిధిగా నడుస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో రోజువారీగా 290 రైళ్లు నడవాల్సి ఉండగా, ఆదివారం 260 నడిచాయి. 86 ఎంఎంటీఎస్‌ రైళ్లలో 34 సర్వీసులు రద్దయ్యాయి. స్టేషన్‌లో నిఘా వ్యవస్థను పెంచారు.


పోలీసుల కవాతు

బర్కత్‌పుర: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఆదివారం కవాతు నిర్వహించారు. ఆర్పీఎఫ్‌, జీఆర్‌పీ, స్థానిక కాచిగూడ పోలీసులు ఈ కవాతులో పాల్గొన్నారు. ఆర్పీఎఫ్‌ సీఐ ధర్మేంద్రప్రసాద్‌, కాచిగూడ రైల్వే సీఐ శ్రీనివా్‌సరావు, కాచిగూడ సీఐ హబీబుల్లాఖాన్‌ కవాతుకు సారథ్యం వహించారు. మూడు ప్లాటూన్ల పోలీసు బలగాలను రంగంలోకి దించారు. బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లు ధరించిన పోలీసులు కవాతులో పాల్గొన్నారు. 


నేడు క్షతగాత్రుల డిశ్చార్జి

ఆర్పీఎఫ్‌ పోలీసులు జరిపిన కాల్పులో తీవ్ర గాయాలపాలైన సీఈఈ అభ్యర్థులు 13 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరిలో పది మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సోమవారం మరోసారి పరీక్షలు చేసి  వారిని డిశ్చార్జి చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం వారిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. 


స్నేహితుల ఇళ్లకని వెళ్లారు..

‘ఈ నెల 17న సాయంత్రం మూడు గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. ఆరోజు తిరిగి రాలేదు. ఫోన్‌ స్బిచ్ఛాప్‌ ఉంది. 18న రాత్రి జీఆర్‌పీ పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది. మీ అబ్బాయిని అరెస్ట్‌ చేశాం. అతడి ఆఽధార్‌ కార్డు తీసుకు రావాలని చెప్పారు. నా కొడుకు ఎలాంటి తప్పూ చేయలేదని భావిస్తున్నా’ అని అల్లర్ల కేసులో అరెస్టయిన గణేష్‌ తండ్రి మెదక్‌కు చెందిన అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మరో నిందితుడు పృథ్వీ తండ్రి సాయిందర్‌ కూడా అలానే పేర్కొన్నారు. ‘స్నేహితులతో బయటికి వెళ్తున్నానని ఫోన్‌ చేశాడు. ఇలా జరుగుతుంది అని అనుకోలేదు’ అని వాపోయారు. 


మరో ముగ్గురి గుర్తింపు 

అడ్డగుట్ట: ఈ నెల 17న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సు అద్దాలను కొందరు రాళ్లతో పగలకొట్టారు. డ్రైవర్‌ కలకొండ నర్సింహ గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దాలు పగలుగొట్టిన వారిలో సురేందర్‌, షఫీ, వినోద్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.


సికింద్రాబాద్‌ స్టేషన్‌ వద్ద భారీ బందోబస్తు

ఇటీవల జరిగిన విధ్వంసం నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్‌, అదనపు బలగాలు పహారా కాస్తున్నాయి. టికెట్లను పరిశీలించిన తర్వాతే ప్రయాణికులను రైల్వేస్టేషన్‌ లోనికి అనుమతి ఇస్తున్నారు. స్టేషన్‌ ముందు యాచకులను కూడా ఉండనీయడం లేదు.

Updated Date - 2022-06-20T13:44:49+05:30 IST